మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 16 జులై 2020 (18:29 IST)

కరోనాను ఎదుర్కోవడంలో కట్టుబాట్లు ఏవి? (Video)

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. రోజురోజుకు రికార్డుస్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ప్రభుత్వం సడలింపులు ఇవ్వడంతో ప్రజలు రోజువారీ కార్యక్రమాల్లో బిజీగా ఉంటున్నారు.

ఈ సమయంలోనే కరోనా వ్యాప్తి జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను మర్చిపోతున్నారు. కరోనాను ఎదుర్కోవడంలో మనవంతు బాధ్యతను నిర్వర్తిద్దాం. కరోనాను ధైర్యంగా ఎదుర్కొందాం.  
 
1) కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించిన ప్రాంతాల్లోనూ ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవడంలేదు. కంచెలు వేసినా దూరి వెళ్లిపోతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అత్యవసరమైన పనులు ఉంటేనే బయటకు వెళ్లాలి.  
 
2) టిఫిన్, టీ,  ఫ్రూట్ జ్యూస్ సెంటర్ల దగ్గర ఎప్పటిలాగానే తీవ్రమైన రద్దీ ఉంటోంది. ఎక్కడా కనీసం భౌతిక దూరం పాటించడం లేదు. మాస్కులు పెట్టుకున్నా తగిన జాగ్రత్తలు తీసుకోవడంలేదు. ఫ్యాషన్ గా మాస్కులు ముఖానికి తగిలించుకుని నిర్లక్ష్యంగా తిరుగుతున్నారు.
 
3) మరికొంతమంది కరోనా లక్షణాలు ఉన్నా బయటకు చెప్పడం లేదు. కరోనా లక్షణాలు ముదిరిపోయి పరిస్థితి తీవ్రంగా మారినపుడు మాత్రమే బయటకు తెలుస్తున్నాయి. అలా చేయడం ద్వారా వారిని, వారి కుటుంబాన్ని, వారితో దగ్గరగా మెలిగిన వారిని కూడా ప్రమాదంలోనికి నెడుతున్నారు.
 
4)  బయట తిండి, టీ , చాట్ మసాలాలు, బిర్యానీలు తినకపోవడం మంచిది. ఇప్పుడున్న పరిస్థితుల్లో బయట తిండి తినడం వల్ల కరోనాను మనమే స్వయంగా ఆహ్వానిస్తున్నట్టు లెక్క.
 
5) కరోనాకి ఎవరూ అతీతులు కాదు. రాబోయే రోజుల్లో కరోనా బారినపడేవారి సంఖ్య మరింత పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మనవరకు రాలేదని అజాగ్రత్తగా మాత్రం ఉండకూడదు. అది మన బాధ్యతారాహిత్యాన్ని తెలియచేస్తుంది.
 
6) కరోనా అనేది సాధారణ వ్యాధుల్లా పరిగణించి బాధ్యత లేకుండా తిరగమని కాదు. కరోనా సోకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు పెట్టుకుని, ఇంటికి ఒకరు మాత్రమే బయటకు వచ్చి అవసరమైన పనిచూసుకు వెళ్లాలి. ఈ సూచనలు పాటించడంలో నిర్లక్ష్యం వహించడం తగదు.  
 
8) సాధ్యమైనంత వరకు చిన్న పిల్లల్ని బజారుకి, మార్కెట్లకు పంపకండి. ట్యూషన్ లు, చదువులు అని అత్యుత్సాహం వద్దు. ఇప్పుడు ప్రాణాలు కాపాడుకోవడం ముఖ్యం.
 
9) డాక్టర్లు, నర్సులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు తమ కుటుంబాలను సైతం పక్కన పెట్టి మనకు అవసరమైన సేవలు అందిస్తున్నారు. వారి శ్రమను గుర్తించి మనం కూడా తగిన జాగ్రత్తలు తీసుకుని వారిపై ఎక్కువ ఒత్తడిపడకుండా తగ్గిద్దాం. 
 
10) బాధ్యత తెలుసుకొని మసలుదాం. మనం క్షేమంగా ఉండి సమాజాన్ని క్షేమంగా ఉంచుదాం.