శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 15 జులై 2020 (09:14 IST)

కరోనా టైంలోనూ వైసీపీ నేతలకు కమీషన్ల కక్కుర్తి: టిడిపి ఎమ్మెల్యే

మిగతా రాష్ట్రాల కంటే ఎక్కువగా కరోనా  పరీక్షలు చేస్తున్నామని మంత్రులు డబ్బా కొడుతున్నారు కానీ మరో వైపు కరోనా టెస్టుల కోసం సేకరించిన శాంపిల్స్  రాష్ర్టవ్యాప్తంగా వేల సంఖ్యలో వృధా అయ్యాయని టిడిపి ఎమ్మెల్యే బాల వీరాంజనేయస్వామి మండిపడ్డారు.

ఈ మేరకు ఆయన ప్రకటన విడుదల చేశారు. "రాష్ర్టంలో కరోనా రోజురోజుకూ విజృంచిస్తుంటే  ప్రభుత్వంలో మాత్రం చలనం లేదు.  ఐసిఎమ్ఆర్ సూచనలను లెక్కలేని తనంగా తీసుకుని ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోంది. రాష్ర్టంలో కరోనా నిర్ధారణ కోసం సేకరించిన 74 వేల శాంపిళ్లు వృధా అయినా ఆరోగ్య శాఖ మంత్రి ఎందుకు మౌనం వహిస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలి?

ఒక్క ప్రకాశం జిల్లాలోనే  27 వేల శాంపిల్స్ వృధా అయ్యాయి. సేకరించిన స్వాబ్ లు పనికిరాకుండా పోయాయి. దీన్ని బట్టి కరోనా నివారణలో రాష్ట్ర ప్రభుత్వం పనితీరు ఏవిధంగా ఉందో అర్థమవుతోంది. పరీక్షా కేంద్రాల సంఖ్య పెంచకుండా నిర్లక్ష్యంగా అధికార యంత్రాంగం వ్యవహరించడం దుర్మార్గం. అనుభవం లేరి వారితో నమూనాలు సేకరించి ఎవరి ప్రాణాలు తీయాలని చూస్తున్నారు?

కరోనా నివారణలో ప్రభుత్వం మొద్దు నిద్ర పోతోంది. క్షేత్ర స్థాయిలో జరుగతున్న పరిస్థితులను మంత్రులు గానీ, అధికారులు గానీ గమనించకపోవడం వల్లే రాష్ర్టంలో ఈ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. నాణ్యత లేని వీటీఎం ప్యాకింగులను కొనుగోలు చేసి విపత్తుల సమయంలోనూ అవినీతికి పాల్పడుతున్నారు. దేశంలో మేమే నెంబర్ వన్ గా కరోనా పరీక్షలు చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటూ ప్రటనలు చేసుకుంటున్నారు.

మరి శాంపిళ్ల వృధాపై ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలి. కరోనా పేషంట్లకు నాణ్యమైన వైద్యం అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. దీనికి నిదర్శనమే డిప్యూటీ సిఎం ఆంజాద్ భాషా పక్క రాష్ర్టానికి వెళ్లి వైద్యం చేయించుకోవడం. క్వారంటైన్ లో ఉన్న వారికి సరైన ఆహారం అందించడం లేదు. పురుగులు పడిన నీళ్లను, పాడై పోయిన ఆహారాన్ని అందిస్తున్నారు.

ఒక్కొక్కరికి రోజుకు రూ.500లు ఖర్చు పెడుతున్నామని చెప్పి అనుయాయులకు కాంట్రాక్టులు కట్టబెట్టి విచ్చల విడిగా ప్రజల సొమ్మును జేబుల్లోకి నింపుకుంటున్నారు. క్వారంటైన్ సెంటర్లలో ఉండాలంటే రోగులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. వీటికంటే ఇంటి దగ్గరే పుష్టిగా ఉండొచ్చన్న అభిప్రాయం వారిలో ఉంది. ప్రభుత్వం ఇదే విధానాన్ని అవలంభిస్తే ఏపీ కూడా మరో అమెరికా అవుతుందేమోనని ఆందోళనగా ఉంది" అని వ్యాఖ్యానించారు.