వైసీపీ నేతల ప్రచార పిచ్చికి రాష్ట్రం బలి అవుతోందని టీడీపీ ఏపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ప్రకటన విడుదల చేశారు.
"రాష్ట్రంలో పాలు, నీళ్ళు కరువు గాని మద్యానికి కొదవ లేదు. లాక్ డౌన్ సమయంలో సారా ఏరులై పారుతుందన్న స్పీకర్ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి ప్రజలకు సమాధానం చెప్పాలి. సాక్షాత్తు స్పీకర్ ఈ వ్యాఖ్యలు చేశారంటే పరిస్థితి ఎంత ఘోరంగో ఉందో అర్ధం చేసుకోవచ్చు.
అక్రమ మద్యం అమ్మకాలు జరిపిన వైకాపా నాయకులపై చర్యలు తీసుకోవాలి. ఎక్సైజ్ శాఖ మంత్రి నైతిక బాధ్యత వహిస్తూ ప్రజలకు క్షమాపణలు చెప్పి రాజీనామా చేయాలి. ప్రజలకు అవసరమైన పాలు, నీళ్లు దిరకడం కష్టమైంది గాని మద్యం మాత్రం వాలెంటీర్ల ద్వారా డోర్ డెలివరీ చేస్తున్నారు. మద్యం దుకాణాలు ఖాళీ అవుతుంటే కేసులు పెట్టకుండా జరిమానాలతో సరిపెడుతున్నారు.
మద్యం అమ్మకాలు వైకాపా నాయకుల ప్రధాన ఆదాయ వనరుగా మారిపోయింది. ఎక్కడికి వెళ్లినా మద్యం యద్దేచ్ఛగా దొరకడం సిగ్గుచేటు. ప్రభుత్వం దుశ్చర్యలకు అత్యవసర సేవలు అంధించే వారు బలవుతున్నారు. దేశ వ్యాప్తంగా ముఖ్యమంత్రులు కరోనాను ఏ విధంగా తగ్గించి తమ ప్రజలను ఎలా కాపాడుకోవాలని చూస్తుంటే ఏపీలో జగన్ మాత్రం తుగ్లక్ చర్యలతో రాజకీయం, దోచుకోవడం, దాచుకోవడం వంటి వాటి కోసం తహతహలాడుతున్నారు.
కరోనాను నియంత్రించేందుకు దేశంలో ముఖ్యమంత్రులందరు లాక్ డౌన్ పొడిగించాలని ప్రధానికి చెబితే జగన్ మాత్రం రాజకీయం చేసుకునేందుకు ప్రజల ప్రాణాలను లెక్కచేయకుండా లాక్ డౌన్ ఎత్తి వెయ్యాలని చెప్పడం క్షంతవ్యం కాదు. ముఖ్యమంత్రులు తమ ప్రజల కోసం గ్రౌండ్ లెవల్ లో పని చేస్తూ తమ ప్రజలకు ధైర్యాన్ని అందిస్తుంటే జగన్ మాత్రం తాడేపల్లికే పరిమితం అయ్యి పబ్జి ఆడుకోవడం సిగ్గుచేటు.
రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బాధితుల్లో 30 శాతం మంది అధికారులు, డాక్టర్లలతో పాటు అత్యవసర సేవలు అందిస్తున్న వారికే రావడం జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి తార్కాణం. సదుపాయాలు కల్పించమని ప్రశ్నిస్తున్న డాక్టర్లను, అధికారులను సస్పెండ్ చేశారు. నేడు సదుపాయాలు లేక వైరస్ బారిన పడుతున్నందుకు జగన్ ప్రభుత్వాన్ని సస్పెండ్ చేయాలా? డాక్టర్లు, పోలీసులు, అధికారులు, పారశుద్ధ్య కార్మికులకు కనీస సదుపాయాలు కల్పించక వారి ప్రాణాలతో వైకాపా ప్రభుత్వం ఆటలాడుతూ రాజకీయం చేయడం దౌర్బాగ్యం.
ప్రతి వ్యక్తికి 3 మాస్కులు ఇస్తానని చెప్పిన జగన్ కనీసం డాక్టర్లకు 1 మస్కైనా ఇవ్వమని ప్రాధేయపాడుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య సర్వీసులు ఎస్మా పరిధిలోకి తెస్తూ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకురావడం సిగ్గుచేటు. నేడు ప్రాణాలు పోగొట్టుకుంటున్న డాక్టర్లకు జగన్ ఏం సమాధానం చెబుతారు? ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా వైద్య సేవలు అందిస్తున్న వారిని ఇన్ని ఇబ్బందులు పెట్టడం జగన్ కే చెల్లింది.
ప్రజల ఆకలి కేకలు ప్రభుత్వానికి పట్టావా? లాక్ డౌన్ కారణంగా విపత్కర పరిస్తితులు ఎదోర్కొంటూ కూటికోసం,కూలికోసం రోడ్డున పడినవారి కష్టాలు తీర్చేందుకు (కేంద్రం కాకుండా) జగన్ ప్రభుత్వం ఒక్క రూపాయి ఖర్చు చేయలేదు. పట్టింపులు, పంతాలను పక్కన పెట్టి అన్యా క్యాంటీన్లను తెరిచి అభాగ్యుల ఆకలి తీర్చే భాద్యత ప్రభుత్వం చేపట్టాలి. జగన్ కు ముందు చూపు లేకపోవడంతో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు.
ప్రతి శుక్రవారం తన అక్రమాస్తుల పై సీబీఐ కోర్టుకు అబద్దాలు చెప్తున్న జగన్ ఇప్పుడు కరోనా పాజిటివ్ కేసులపై బులిటెన్ లో ఒకలా, రిపోర్ట్ లో మరొకలా తప్పుడు లెక్కలు చెప్పి రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారు. వైకాపా నాయకులకు మితిమీరిన ప్రచార పిచ్చి వలన నేడు రాష్ట్ర వ్యాప్తంగా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. జగన్ కి, వైసీపీ నేతలకు అబద్ధాలు, అవాస్తవాలు చెప్పటం తప్ప నిజాలు చెప్పటం తెలీదు.
4 వారాల వరకు రాష్ట్రం లోకి కరోనా వైరస్ రాదని ఎన్నికలు నిర్వహించమని జగన్ సీఎస్ చేత లేఖ రాయించారు. కానీ లేఖ రాసి 4 వారాలు కూడా గడవక ముందే రాష్ట్రంలో 8 వందలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆ లేఖ ప్రకారం ఎన్నికలు నిర్వహించి ఉంటే పరిస్థితి ఏంటి? మన రాష్ట్రం మారో ఇటలీ అయ్యేది. దీనికి బాధ్యత ఎవరిది? లేఖ రాయించిన జగన్ దా, లేక రాసిన సీఎస్ దా?
జగన్ కి ఎన్నికల మీదే దృష్టి తప్ప ప్రజల ప్రాణాలంటే లెక్క లేదు. జగన్ వైఖరి చూస్తుంటే ఐసోలేషన్ వార్డులు, క్వారంటయిన్ కేంద్రాల్లో కూడా పోలింగ్ బూతులు ఏర్పాటు చేసి ఎన్నికలు నిర్వహించేటట్టున్నారు. కరోనా కేసులు రోజ రోజుకి పెరిగిపోతున్నాకానీ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదు" అని పేర్కొన్నారు.