జూపూడిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన టీడీపీ ఎమ్మెల్యే
జూపూడి ప్రభాకర్‌రావుపై కొండేపి ఎమ్మెల్యే బాలవీరాంజవేయస్వామి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జూపూడికి అధికారమే పరమావధిగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అధికారంలో ఉన్న పార్టీలోనే జూపూడి ఉంటారని ఎద్దేవా చేశారు. గడ్డి ఉన్న చోటకు గొర్రె పరుగులు పెట్టినట్లు జూపూడి వైఖరి ఉందన్నారు. గతంలో దళిత పులిని అంటూ ప్రకటన చేసుకుని నేడు ఆ దళితులను వంచిస్తూ.. వైసీపీలో చేరారన్నారు. 'జగన్ కాలకేయుడు, ప్రమాదకరమైన విషం' అంటూ గతంలో జూపూడి విమర్శించారని గుర్తుచేశారు.
జగన్ ఓ సైకో.. అందుకే వైఎస్ దూరంగా ఉంచారని నాడు జూపూడి వ్యాఖ్యానించిలేదా?, నేడు అలాంటి జగన్ చెంతకు జూపూడి చేరడం అవకాశవాదానికి నిదర్శనమని చెప్పారు. జైలుకు వెళ్లొచ్చిన వారంతా ఉద్యమకారులు కాదనే విషయం జూపూడి గుర్తించాలని హితవు పలికారు.
జగన్ ఏ కారణంగా జైలుకు వెళ్లారో ప్రజలందరికీ తెలుసన్నారు. జూపూడి పొగడ్తలు, ప్రశంసలు అన్నీ కూడా పదవుల కోసమేనన్నారు. రంగులు మార్చడంలో జూపూడి ఊసరవిల్లితో పోటీపడుతున్నారని సైటర్ వేశారు. మంగళవారం సీఎం జగన్ సమక్షంలో జూపూడి ప్రభాకర్‌రావు వైసీపీలో చేరారు. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం జూపూడిని జగన్ ఆలింగనం చేసుకున్నారు.