శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 7 ఫిబ్రవరి 2021 (13:03 IST)

ఉక్క ఫ్యాక్టరీపై ప్రధానికి సీఎం జగన్ లేఖను స్వాగతిస్తున్నా : ఎమ్మెల్యే గంటా

ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన విశాఖ ఉక్క ఫ్యాక్టరీలో పెట్టుబడులను ఉపసంహరించుకుని ప్రైవేటీకరణ చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. అంటే.. విశాఖ స్టీల్ కర్మాగారం ప్రైవేటు పరంకానుంది. 
 
ఈ నేపథ్యంలో ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ కాకుండా ఉండేందుకు సలహాలు, పరిష్కారాలతో ప్రధాని మోడీకి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్‌ జగన్ లేఖ రాయడాన్ని తాను స్వాగ‌తిస్తున్నానంటూ టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ట్వీట్లు చేశారు.
 
'సొంత ఇనుప ఖనిజం గనిని కేటాయించడం, రుణాలను ఈక్విటీలుగా మార్చడం ద్వారా స్టాక్ ఎక్స్చేంజిలో నమోదై నిధుల సేకరణకు అవకాశం ఉండడం లాంటివి పరిష్కార మార్గాలు. ఇందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదములు తెలియచేస్తున్నాను' అని గంటా అన్నారు.
 
'అయితే కేంద్రం ఇప్పటికే పాలసీ తీసుకున్నందున లేఖతో పాటు ముఖ్యమంత్రి స్వ‌యంగా వెళ్లి ప్రధానిని కలిసి వైజాగ్ స్టీల్ ఏర్పాటు ఉద్యమాన్ని సైతం వివరించి విశాఖ, తెలుగు ప్రజల మనోభావాలను వివరించి ప్రధానిని ఒప్పించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. అవసరమైతే అఖిలపక్షాన్ని కూడా తీసుకెళ్లి ఒత్తిడి తేవాలని కోరుతున్నాను' అని గంటా ఆదివారం ఓ ట్వీట్ చేశారు.