ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 8 జనవరి 2021 (13:30 IST)

సీఎం జగన్‌ను కలుస్తానంటున్న బాలకృష్ణ.. ఎందుకబ్బా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డిని కలుస్తానని సినీ నటుడు, హిందూపురం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రకటించారు. ఈ ప్రకటన టీడీపీ శ్రేణుల్లో కలకలం రేపింది. అయితే, ఆయన సీఎం జగన్‌ను కలవడానికి ప్రధాన కారణం లేకపోలేదు. 
 
ఏపీ ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఇందుకోసం ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. అయితే, తాను ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురంను జిల్లా కేంద్రంగా చేయాలని బాలకృష్ణ డిమాండ్ చేశారు. ఇదే విషయంపై అవసరం అయితే సీఎంను కలుస్తానని ప్రకటించారు. 
 
ప్రస్తుతం బాలకృష్ణ హిందూపురంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా, స్థానిక వైకాపా నేతలపై సంచలన ఆరోపణలు చేశారు. హిందుపురంలో పేకాట, మట్కాను అధికార పార్టీ నేతలు ప్రోత్సహిస్తున్నారంటూ మండిపడ్డారు. మాట వినని అధికారులను బదిలీ చేస్తున్నారని చెప్పారు. ఇప్పటికే ఐదుగురు మున్సిపల్ కమిషనర్లను మార్చారని గుర్తుచేశారు. 
 
ఇంటి పట్టాల పంపిణీలో కోట్ల రూపాయల అవినీతి జరుగుతోంద న్నారు. ఆలయాలపై దాడులు జరుగుతున్న ప్రభుత్వం స్పందించడం లేదని దుయ్యబట్టారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలయాలపై దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని బాలకృష్ణ డిమాండ్ చేశారు.