జగన్ మరో మూడు జన్మలెత్తినా మూడు రాజధానులు కట్టలేరు
ప్రజా రాజధానిపై ప్రభుత్వాధినేతగా వైఎస్ జగన్‌రెడ్డి విద్వేషపు కుట్రలపై అమరావతి రైతులు, కూలీల పోరాటం 7 వందల రోజులకు చేరిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, 30 వేల మంది రైతుల సమస్యగా చిన్నచూపు చూసిన పాలకుల కళ్లు బైర్లు కమ్మేలా కోట్లాది రాష్ట్ర ప్రజలు మద్దతుగా నిలిచారన్నారు.
అమరావతి రైతులు చేపట్టిన న్యాయస్థానం టూ దేవస్థానం పాదయాత్ర జనసంద్రాన్ని తలపిస్తోందన్నారు. జగన్‌రెడ్డి, ఆయన మంత్రులు మరో మూడు జన్మలెత్తినా మూడు రాజధానులు కట్టలేరన్నారు. ప్రజా రాజధాని కోసం భూములు, ప్రాణాలు తృణప్రాయంగా రైతులు చేసిన త్యాగం నిరుపయోగం కాదని ఆశాభావం వ్యక్తం చేశారు.
అమరావతి కోట్లాది మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్ష.. అమరావతి వైపు న్యాయం ఉంది.. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ప్రజలు, రాజకీయ పార్టీల మద్దతు ఉంది.. ఒకే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్-ఒకే రాజధాని అమరావతి మాత్రమే ఉంటాయి.. జై ఆంధ్రప్రదేశ్..జై అమరావతి అంటూ లోకేష్ వ్యాఖ్యానించారు.