గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , సోమవారం, 15 నవంబరు 2021 (15:30 IST)

కోడ్ ఆఫ్ కాండక్టు అమలు కావడం లేదని టీడీపీ నేత‌ల ఫిర్యాదు

రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ పాలనపై టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తాలిబన్ల పాలనను తలపించేలా, నియంత పాలన కొనసాగిస్తున్నారన్నారు. దేనికీ భయపడకుండా చివరి నిమిషం వరకూ పోరాడతామని స్పష్టం చేశారు. వైసీపీ అక్రమాలపై న్యాయ పోరాటం చేస్తామని అన్నారు.
 
 
వైసీపీకి డబ్బు పిచ్చి, అధికార పిచ్చి పట్టిందన్నారు బొండా ఉమ‌. ఎన్నికల్లో ఎక్కడా కోడ్ ఆఫ్ కాండక్టు అమలు కావడం లేదని చాలా సార్లు ఫిర్యాదు చేశామని తెలిపారు. హైకోర్ట్ ఆదేశాలు పట్టించుకోకుండా ప్రభుత్వం దున్నపోతు మీద వర్షం పడ్డట్టు వ్యవహరిస్తోందని విమర్శించారు. ఇవాళ ఎన్నికల్లో ప్రజా స్వామ్యాన్ని అపహాస్యం చేసేలా దొంగ ఓట్లు వేయిస్తోందని, పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని ఆరోపించారు. 
 
 
కుప్పం మున్సిపల్ ఎన్నికలకు ఇతర నియోజకవర్గాల నుంచి డ్వాక్రా, వెలుగు మహిళలను తీసుకొచ్చారని, వందలాది వాహనాల్లో దొంగ ఓటర్లను తరలించారని ఆరోపించారు. ఎస్ఈసీ ఫిర్యాదులు పట్టించుకోకుండా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. చిన్న మున్సిపల్ ఎన్నికల్లో ప్రతిపక్షాన్ని దెబ్బకొట్టడానికి ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారని బొండా ఉమా వ్యాఖ్యానించారు. సోమవారం ఉదయం ఎస్‌ఈసీ కార్యాలయానికి చేరుకున్న టీడీపీ నేతలు బొండా ఉమ, బోడె ప్రసాద్, అశోక్ బాబు ఈసీని కలిసి వినతి పత్రం అందజేశారు.