ఆదివారం, 3 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: సోమవారం, 15 నవంబరు 2021 (20:08 IST)

కుప్పం రచ్చరచ్చ, పోలింగ్ శాతం ఎంతంటే?

ఎపిలో 13 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే మిగిలిన మున్సిపాలిటీల విషయం పక్కనబెడితే ఒక్క కుప్పం మున్సిపాలిటీపైనే ఇప్పుడు అందరి దృష్టి ఉంది. అందుకు కారణం ప్రతిపక్షనేత నారా చంద్రబాబునాయుడు సొంత నియోజకవర్గం కావడమే.

 
ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ 8.30 నిమిషాల తరువాత ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు వైసిపి మరోవైపు టిడిపిలకు చెందిన నేతలు దొంగ ఓటర్లను తీసుకొచ్చి ఓట్లు వేయిస్తున్నారంటూ ఆందోళనకు దిగారు.

 
పోలింగ్ కేంద్రాల వద్ద ఘర్షణకు దిగారు. కొన్నిచోట్ల ఉద్రిక్త పరిస్థితిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. సరిగ్గా రెండు సంవత్సరాలకు ముందు మున్సిపాలిటీగా కుప్పం ఏర్పడడం.. అందులోను మొట్టమొదటి ఎన్నికలు కావడంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నికలు రెండు పార్టీలు తీసుకున్నాయి.

 
ఎలాగైనా చంద్రబాబు పరువు తీయాలని వైసిపి పన్నాగం వేస్తే.. కుప్పంకు టిడిపి కంచుకోట అని నిరూపించేందుకు ఆ పార్టీ నేతలు ప్రయత్నించారు. ముఖ్యంగా కుప్పం మున్సిపాలిటీ పరిధిలో 25 వార్డులు ఉండగా అందులో 14వ వార్డు ఏకగ్రీవమైంది. ఇక మిగిలింది 24 వార్డులు మాత్రమే.

 
ఉదయం నుంచి 7,16,13 వార్డులలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అందులోను క్రిష్ణగిరి, కర్ణాటక సరిహద్దుల నుంచి బస్సుల్లో టిడిపి నేతలు దొంగ ఓటర్లను తరలిస్తున్నారని వైసిపి నేతలు అడ్డుకున్నారు. దీంతో లాఠీఛార్జ్ జరిగి తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి.

 
అయితే ఇంత జరుగుతున్నా కూడా ఓటింగ్ శాతం మాత్రం బాగా పెరిగింది. మధ్యాహ్నం 1 గంటకే సుమారుగా 50.34 శాతం ఉన్న ఓటింగ్ కాస్త సాయంత్రం ఐదు గంటలకు ముగిసే సమయానికి 80శాతంకు చేరింది. రీపోలింగ్ లేకుండా ఎల్లుండి ఓట్లను అధికారులు లెక్కించుకున్నారు.