గుడివాడ క్యాసినో పై సిఎం జగన్ నోరు విప్పాలన్న చంద్రబాబు
గుడివాడ క్యాసినోపై సిఎం జగన్ నోరు విప్పాలని మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండు చేశారు. పార్టీ ముఖ్యనేతలతో చంద్రబాబునాయుడు తన కార్యాలయంలో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గుడివాడ క్యాసినోపై సిఎం జగన్ నోరు విప్పడని, గ్యాంబ్లింగ్ పై సమాధానం లేకనే మంత్రి కొడాలి నాని బుకాయింపులు, బూటకపు మాటలు మాట్లాడుతున్నాడని విమర్శించారు.
బెస్ట్ సిఎంల లిస్ట్ లో టాప్ 20లో ఎపి సిఎం జగన్ రెడ్డి ఎక్కడా కనిపించడం లేదని చంద్రబాబు ఎద్దేవా చేశారు. క్యాసినో వంటి విష సంస్కృతిపై పోరాటం కంటిన్యూ చెయ్యాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దీనిపై వివిధ జాతీయ ఏజెన్సీలకు, దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చెయ్యాలని నిర్ణయించారు. చిత్తూరు జిల్లాలో దళిత మహిళను పోలీసు కస్టడీలో చిత్రహింసలకు గురిచేయడాన్ని ఖండించారు. ఉద్యోగులపై సోషల్ మీడియాలో ప్రభుత్వమే తప్పుడు ప్రచారం చేయించడం ప్రభుత్వ నైజాన్ని తెలుపుతోందని, ఉద్యోగుల డిమాండ్లకు సమావేశం మద్దతు పలుకుతోందన్నారు.
కోవిడ్ కేసులు భారీగా నమోదు అవుతున్న కారణంగా స్కూళ్లకు సెలవులు ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. వివేకానంద హత్య కేసులో తెర వెనుక సూత్రధారుల లెక్కలు తేల్చకుండా, కేసును నలుగురికే పరిమితం చేసే పని జరుగుతోందన్నారు. రాష్ట్రంలో ఎరువుల కృతిమ కొరత సృష్టిస్తూ.. అధిక ధరలకు రైతులకు విక్రయిస్తున్నారన్నారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ, ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రజలకు మరింత విస్తృతంగా కోవిడ్ వైద్యసేవలు అందిస్తామని తెలుగుదేశం అధినేత తెలిపారు.