శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 20 సెప్టెంబరు 2024 (20:09 IST)

తిరుమలకు సరఫరా చేసిన నెయ్యిలో నాణ్యతా లోపం లేదు : ఏఆర్ డెయిరీ

tirupati laddu
తిరుమలలో తయారు చేసే శ్రీవారి లడ్డూ కోసం తయారు చేసిన నెయ్యిలో ఎలాంటి నాణ్యతా లోపం లేదని తమిళనాడు రాష్ట్రంలోని దిండిగల్ జిల్లాలో ఉన్న ఏఆర్ డెయిరీ యాజమాన్యం స్పష్టం చేసింది. ఇదే అంశంపై శుక్రవారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. అన్ని రకాల నాణ్యతా పరీక్షలు చేసిన తర్వాతే నెయ్యి సరఫరా చేశామని స్పష్టం చేసింది. 
 
జూన్, జూలై నెలలోనే నెయ్యి సరఫరా చేశామని, ల్యాబ్ పరీక్షలు కూడా సంతృప్తికరంగా అనిపించిన తర్వాతే నెయ్యిని సరఫారా చేసినట్టు యాజమాన్యం వివరించింది. తాము ఇప్పటివరకు సరఫరా చేసిన నెయ్యిలో ఎలాంటి నాణ్యతా లోపం లేదని, ఈ విషయంలో తాము కట్టుబడివుంటామని పేర్కొంది. 
 
కాగా, కలియుగ వైకుంఠంగా పేరుగాంచిన తిరుమల పుణ్యక్షేత్రంలో పవిత్ర ప్రసాదం లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలిపి కల్తీ నెయ్యి వాడారంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే. తమిళనాడుకు చెందిన ఏఆర్ డెయిరీ ఈ కల్తీ నెయ్యిని సరఫరా చేసినట్టు ఆరోపణలు రావడంతో ఏఆర్ డెయిరీ యాజమాన్యం స్పందించింది.