బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 11 మార్చి 2018 (11:10 IST)

డీజే శబ్దానికి గుండెపోటు.. పెళ్లయిన గంటలోనే వధువు కన్నుమూత.. ఎక్కడ?

పచ్చని పందిట్లో అంరంగ వైభవంగా పెళ్లి జరిగింది. బంధువులు, స్నేహితులంతా కలిసి ఆ నవవధూవరులను నిండునూరేళ్లూ పిల్లా పాపలతో వర్ధిల్లాలని దీవించారు. అలా అందరి దీవెనలు అందుకుని దైవదర్శనానికి వెళ్లారు.

పచ్చని పందిట్లో అంరంగ వైభవంగా పెళ్లి జరిగింది. బంధువులు, స్నేహితులంతా కలిసి ఆ నవవధూవరులను నిండునూరేళ్లూ పిల్లా పాపలతో వర్ధిల్లాలని దీవించారు. అలా అందరి దీవెనలు అందుకుని దైవదర్శనానికి వెళ్లారు. కానీ, వారి మూడుముళ్ల బంధం మూడు గంటలైనా నిలవలేదు. గుడికి వెళ్ళి ఇష్టదైవాన్ని దర్శనం చేసుకుని ఇంటికి వస్తుండగా, ఓ ఊరేగింపులో ఏర్పాటు చేసిన డీజే శబ్దం అధికంగా ఉండటంతో ఆ శబ్దాన్ని భరించలేక నవవధువు గుండెపోటుతో కన్నుమూసింది. ఈ విషాదకర ఘటన శనివారం రాత్రి 10 గంటల సమయంలో సూర్యాపేటలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
సూర్యాపేట శంకర్‌విలాస్‌ సెంటర్‌ సమీపంలోని ఏపీజీవీబీ బ్యాంకు ఎదుట ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌ నిర్వహిస్తున్న హనుమయ్య కుమార్తె గాయత్రి (23)ని వరంగల్‌ జిల్లా నెల్లికుదురుకు చెందిన వేణుకు ఇచ్చి వివాహం చేశారు. వీరి వివాహం శనివారం మధ్యాహ్నం జరిగింది. అనంతరం ఊరేగింపుతో వధువరులను ఇంటికి తీసుకెళ్తూ స్థానిక వేంకటేశ్వర ఆలయంలో పూజ నిమిత్తం నిలిపారు. నవ దంపతులిద్దరూ దేవుడిని దర్శించుకొని బయటికి రాగా, గాయత్రి ఒక్కసారిగా కుప్పకులింది. 
 
వెంటనే చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు జిల్లా కేంద్రంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యుడు పరిస్థితి విషమంగా ఉందని తెలపడంతో అక్కడి నుంచి ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లగా ఆప్పటికే మృతి చెందింది. ఆమె మృతితో ఇరు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. 
 
ఊరేగింపులో ఏర్పాటు చేసిన డీజే సౌండ్స్ అధికంగా ఉండడం, ఆ శబ్ధాన్ని భరించలేకే గాయత్రి కుప్పకూలినట్టుగా భావిస్తున్నారు. ఈ పెళ్లితో అప్పటివరకు సందడిగా ఉన్న ఆ ఇళ్లు విషాదంలో మునిగిపోయాయి. పెళ్లైన కొన్ని గంటల్లోనే కాళ్ల పారాణి ఆరక ముందే నవ వధువు గుండెపోటుతో చనిపోవడంతో కుటుంబ సభ్యులతో పాటు బంధువులు కన్నీరు మున్నీరయ్యారు.