గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 25 నవంబరు 2020 (05:51 IST)

జగన్ పాలనలో ఏపీ అంటే అడుక్కుతినడం, పారిపోవడం: కోట్ల సుజాతమ్మ

పోలవరంప్రాజెక్ట్ నిర్మాణాన్ని చంద్రబాబుప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టి  నిర్విరామంగా పనులుకొనసాగిస్తే, నేడున్న జగన్ ప్రభుత్వం అంతగొప్ప ప్రాజెక్టుని కమీషన్లకోసం నిలువునా ముంచేసిందని టీడీపీ మహిళానేత, మాజీఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ ఆగ్రహం వ్యక్తంచేశారు.

ఆమె తననివాసం నుంచి జూమ్ యాప్ ద్వారా విలేకరులతో మాట్లాడారు . చంద్రబాబునాయుడు ఏపీ అంటే  అమరావతి, పోలవరం అనేలా  రాష్ట్రాన్ని అభివృద్ధిలో నడిపిస్తే, ఇప్పుడున్న ప్రభుత్వం ఏ అంటే అడుక్కుతినడం, పీ అంటే పారిపోవడం అనేలా రాష్ట్రాన్ని తయారు చేసిందన్నారు. 

ఎవరు ఎక్కువ కమీషన్లు ఇస్తారా....ఏ పనులు చేస్తే, అధికంగా నొక్కేయవచ్చన్న ఆలోచనతో, నవరత్నాలనే ముసుగులో, ప్రజలను మభ్యపెడుతూ  ఇప్పుడున్న పాలకులు పనులుచేస్తున్నారు తప్ప,  ప్రజలను దృష్టిలో పెట్టుకొని చేయడం లేదని సుజాతమ్మ స్పష్టంచేశారు.

అధికారంలోకి రావడం కోసం 400హామీలిచ్చిన జగన్ , వాటిలో ఎన్నింటిని నెరవేర్చాడో చెప్పాలన్నారు. పోలవరం ప్రాజెక్ట్ అనేది ఎప్పుడు పూర్తవుతుందన్న ఆలోచన ప్రజలకుకూడా కలుగుతోందని, జగన్ ప్రభుత్వంలో ప్రాజెక్ట్ పనులు వెనక్కు వెళుతున్నాయితప్ప, ముందుకు కాదన్నారు.

చంద్రబాబు హాయాంలో పోలవరం ప్రాజెక్ట్ లో మొత్తం 72శాతం పనులు జరిగితే, మట్టిపని 68శాతం జరగ్గా, కుడికాలువ పనుల్లో మట్టిపని 100శాతం వరకు జరిగిందని,  లైనింగ్ పని 81శాతంవరకు, ఎడమకాలువమట్టిపనులు 87శాతం వరకు, లైనింగ్ పని 62శాతం వరకు జరిగిందని సుజాతమ్మ పేర్కొన్నారు. 

ఈ ప్రభుత్వం వచ్చాక ప్రాజెక్టులో ఎంతశాతం పనులుచేసిందో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. క్యూసెక్కుకి, టీఎంసీకి తేడాతెలియని వ్యక్తులు మంత్రులుగా ఉన్నారని, వారిని ఏం అడిగినా, ఏదేదో మాట్లాడటం తప్ప, సరైనజ్ఞానం లేకుండా పోయిందన్నారు.

నీటినిల్వ, నిర్వాసితులు సమస్యల గురించి పట్టించుకోకుండా, ప్రజలకు పనికొచ్చే పనులేవీ చేయకుండా ఏదేదో మాట్లాడటం మంత్రులకు అలవాటైందన్నారు. ఎవరు ఏం అడిగినా మేం మీకు చెప్పామా అంటూ కొడాలినాని మాట్లాడుతుంటాడన్నారు. 

చంద్రబాబు ప్రభుత్వంలో నిర్మించిన ఇళ్లను,  డిసెంబర్ లో పేదలకు పంచుతానని జగన్ చెబుతున్నాడని, జనవరిలో స్థానిక ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందునే ఆయన అలా చెప్పాడన్నారు.  టీడీపీ ప్రభుత్వం ఎవరికైతే ఇళ్లను కేటాయించిందో, వారికే వాటిని కేటాయించాలని, అలాకాకుండా ఈప్రభుత్వం అవినీతికోసం అనర్హులకు, తమవారికి ఇళ్లను కేటాయిస్తే, చూస్తూ ఊరుకునేది లేదని సుజాతమ్మ హెచ్చరించారు. 

వాలంటీర్ వ్యవస్థ ఏంచేస్తుందో తెలియడంలేదని, టీడీపీ వాళ్లంటే వారికి ఒక్కపనీ కూడా చేయడంలేదన్నారు.  ప్రజల్లో పేదలుంటారని, వారిలో పార్టీలను చూడటం పాలకులకు తగదన్నారు. అర్హులైన వారికి ఇళ్లు, ఇళ్లస్థలాలు, ఇతర పథకాలు అందిస్తేనే, ఏపార్టీ అయినా మనుగడ సాగిస్తుందని సుజాతమ్మ హితవు పలికారు.

ఒక్కఛాన్సంటూ అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం, ఒకటిన్నర సంవత్సరంలోనే ఏప్రభుత్వం పొందలేనంత వ్యతిరేకత పొందిందన్నారు. చంద్రబాబునాయుడు ప్రతిసోమవారం పోలవరం నిర్మాణంపై సమీక్ష నిర్వహించి, ప్రాజెక్ట్ నిర్మాణాన్ని పూర్తిచేయాలని పనిచేస్తే, ఈప్రభుత్వం వచ్చాక దాన్ని మూలన పడేసిందన్నారు.  పేకాట కేంద్రాలు, మద్యం, సారా వ్యాపారం, వంటివాటిపై ఉన్నశ్రద్ధ ప్రభుత్వానికి ప్రజలపై లేకుండా పోయిందన్నారు.

పోలవరం నిర్మాణం పూర్తిచేయాలనే సంకల్పంతో వైసీపీప్రభుత్వం పనిచేస్తే, ప్రజలు హర్షిస్తారన్నారు.  పోలవరం నిర్మాణంపూర్తయ్యేలోగా ప్రజలకు ఇబ్బందులు ఉండకూడదని భావించే ఆనాడు చంద్రబాబునాయుడు పట్టిసీమను పూర్తిచేశారన్నారు.

కమీషన్లకోసం, కాంట్రాక్టర్లకోసం పోలవరాన్ని బలిపెట్టడం  వైసీపీ ప్రభుత్వానికి ఎంతమాత్రం మంచిదికాదన్నారు. పోలవరం నిర్మాణం దిశగా రాష్ట్రప్రభుత్వం పనిచేస్తే, అందుకు సహకరించడానికి టీడీపీ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుందన్నారు. 

మంత్రి గుమ్మనూరు జయరాం అవినీతిపై  ఈప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని, దాంతో ఆయన భూదోపిడీ, కబ్జాలు మరింత పెరిగిపోయాయన్నారు. ఈప్రభుత్వం అధికారంలో ఉంటే, రాష్ట్రం అధోగతిపాలవడం ఖాయమని సుజాతమ్మ తేల్చిచెప్పారు.