మరికొన్ని నిమిషాల్లో దేశ బడ్జెట్... తెలుగు రాష్ట్రాల్లో భారీ అంచనాలు...
2025-26 ఆర్థిక సంవత్సరానికిగాను కేంద్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్‌ను మరికొన్ని నిమిషాల్లో ప్రవేశపెట్టనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం ఉదయం 11 గంటలకు లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 2025-26 ఏడాదికి గానూ వివిధ శాఖలకు నిధులు కేటాయించనున్నారు. దేశ భవిష్యత్తుకు కీలకమైన ఈ బడ్జెట్‌పై ఈసారి తెలుగు రాష్ట్రాల్లో అంచనాలు పెరిగిపోయాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నేతృత్వంలో కూటమి సర్కారు కొలువుదీరిన తర్వాత ప్రవేశ పెడుతున్న తొలి బడ్జెట్ కావడంతో సహజంగానే ఉత్సుకత నెలకొంది. ఏపీకి కేటాయింపులపై రాష్ట్రవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ఉక్కు పరిశ్రమకు కేటాయింపులపై విశాఖ వాసుల్లో ఆతృత నెలకొంది.
మరోవైపు, మధ్య తరగతి ప్రజలు, వేతన జీవుల్లో ఆశలు నెలకొన్నాయి. ఈసారి ఆదాయ పన్ను తగ్గించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో ఖమ్మం జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటు, భద్రాద్రిలో మైనింగ్ వర్సిటీ కోసం 30 ఏళ్లుగా వినిపిస్తున్న డిమాండ్లు ఈసారైనా నెరవేరేనా అని ప్రజలు ఎదురుచూస్తున్నారు. కొత్తగూడెంలో విమానాశ్రయం ఏర్పాటు కోసం కేంద్రం ఈసారైనా నిధులు కేటాయించేనా అని ఆతృతగా వేచి చూస్తున్నారు.
2019లో కేంద్ర ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నిర్మలా సీతారామన్ ఇప్పటి వరకు ఏడుసార్లు కేంద్ర బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశ పెట్టారు. వరుసగా ఎనిమిదోసారి నేడు బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. గతంలో వరుసగా పదిసార్లు కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టి మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ రికార్డు సృష్టించారు. ఆ తర్వాత తొమ్మిదిసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టి మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం రెండో స్థానంలో ఉన్నారు.
2019లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో నిర్మలా సీతారామన్ పారిశ్రామిక రంగానికి సంబంధించిన పన్నుల్లో కీలకమైన సంస్కరణలు తీసుకువచ్చారు. కార్పొరేట్ పన్ను రేట్లను తగ్గించారు. 2020 బడ్జెట్ లో పాత ఆదాయపు పన్ను విధానంలోని సంక్లిష్టతలను తొలగిస్తూ కొత్త ఆదాయపు పన్నును ప్రవేశపెట్టారు. పాత, కొత్త విధానాలలో దేనినైనా ఎంచుకునే స్వేచ్ఛను పన్ను చెల్లింపుదారులకు ఇచ్చారు.
తాజాగా దీనిలో స్టాండర్డ్ డిడక్షన్ కూడా తీసుకొచ్చారు. 2021-22 బడ్జెట్‌లో కంపెనీ చట్టంలోని కొన్ని నిబంధనలను డీక్రిమినలైజ్ చేశారు. విధానపరమైన లోపాలు, సాంకేతికపరమైన తప్పిదాలు వంటి చిన్న ఉల్లంఘనలను నేరాల నుంచి తొలగించారు. కొన్నింటిని సివిల్ పెనాల్టీలతో సరిపెట్టారు. ఇది దేశంలో వ్యాపార అనుకూల వాతావరణాన్ని ప్రోత్సహించేందుకు తోడ్పడింది.