జీవితంలో సెటిలయ్యాకే వివాహమంటూ యూత్, పెళ్లివయసు దాటి పెద్దాయన వయసుకు (video)
రైలు వెళ్లిపోయాక టిక్కెట్ కొంటే ఏం లాభం? అలాగే పెళ్లీడు వయసు దాటాక పెళ్లికోసం పాకులాడితే ఏం ప్రయోజనం? అప్సరసల లోకం నుంచి దిగి వచ్చిన కన్యను పెళ్లాడాలని కొందరూ, పెళ్లాడి పిల్లలు పుడితే వారిని సాకేదెలా సెటిలయ్యాక పెళ్లి అంటూ మరికొందరూ, ఇవన్నీ వదిలేసి పెళ్లాడదామని ప్రయత్నిస్తే... అమ్మాయిలు కూడా తమ జీవిత భాగస్వామి విషయంలో ప్రత్యేక అంచనాలు వుండటంతో సమాజంలో పెళ్లి కాకుండా వుంటున్న యువకులు... అదే మన భాషలో ముదిరిపోతున్న బెండకాయలు ఎక్కువవుతున్నారు.
ఈ విషయంలో చాలావరకూ అబ్బాయిలు.. జీవితంలో సెటిలయ్యాకే వివాహం చేసుకోవాలనే ధోరణి కారణంగా పెళ్లివయసు దాటి పెద్దాయన వయసుకు వచ్చేస్తున్నారు. ఇందుకు మంచి ఉదాహరణే ఈ దిగువున వున్న వీడియో....
ప్రభుత్వ సర్వే ప్రకారం, మనదేశంలో ఎక్కువ మంది పురుషులు అవివాహితులుగా మారుతున్నారు. 2011-2019 నుండి దాదాపు ఎనిమిది సంవత్సరాలలో, 15-29 సంవత్సరాల వయస్సు గల పెళ్లికాని వ్యక్తుల నిష్పత్తి 17.2 శాతం నుండి 23 శాతానికి పెరిగిందని ప్రభుత్వ సర్వే తెలిపింది. జాతీయ యువజన విధానం 2014లో, 15 నుండి 29 సంవత్సరాల వయస్సు గల వారిని యువతగా వర్గీకరించారు.
జాతీయ గణాంక కార్యాలయ నివేదిక ప్రకారం, 15-29 సంవత్సరాల వయస్సు గల పెళ్లికాని జనాభాలో పురుష జనాభాలో 2011లో 20.8 శాతం నుండి 2019లో 26.1 శాతానికి పెరుగుతున్న ధోరణి ఉంది. కనుక క్రమంగా పెళ్లిళ్లు కానివారి సంఖ్య పెరిగిపోతుంది. పెళ్లీడు వయసులోనే పెళ్లిళ్లు కానించేస్తే... ఇలా పెళ్లికాని ప్రసాదులుగా మిగిలే పరిస్థితి వుండదు.