మంగళవారం, 8 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 15 ఫిబ్రవరి 2023 (08:28 IST)

సికింద్రాబాద్ - తిరుపతి మధ్య వందే భారత్ రైలు : మంత్రి కిషన్ రెడ్డి

kishan reddy
కేంద్ర పర్యాటక శాఖామంత్రి కిషన్ రెడ్డి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభవార్త చెప్పారు. సికింద్రాబాద్ - తిరుపతి ప్రాంతాల మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు వచ్చే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే సికింద్రాబాద్ - విజయవాడ - విశాఖపట్టణంల మధ్య వందేభారత్ రైలును నడుపుతున్న విషయం తెల్సిందే. 
 
ఈ నేపథ్యంలో ఆయన మంగళవారం ఏపీలో పర్యటించారు. ధర్మవరం - విజయవాడ ఎక్స్‌ప్రెస్ రైలును మచిలీపట్నం వరకు పొడగించగా, ఆ రైలు విజయవాడ రైల్వే స్టేషన్‌లో పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ, తెలుగు రాష్ట్రాల్లో వేగంగా కొత్త లైన్లు, ఎలక్ట్రిఫికేషన్, ట్రిప్లింగ్ పనులు చేపడుతున్నట్టు వెల్లడించారు. విజయవాడ రైల్వే స్టేషన్‌ను ఎయిర్‌పోర్టు మాదిరిగా అభివృద్ధి చేస్తామన్నారు. ఇందుకోసం డీపీఆర్ సిద్ధమయ్యాక విజయవాడ రైల్వే స్టేషన్‌లో అభివృద్ధి పనులను ప్రారంభిస్తామని తెలిపారు.
 
ప్రస్తుతం తిరుపతి, నెల్లూరు రైల్వే స్టేషన్లను అద్భుతంగా తీర్చిదిద్దుతున్నట్టు చెప్పారు. రాజమండ్రి, గూడూరు వంటి ముఖ్యమైన స్టేషన్లను ఆధునకీకరిస్తామన్నారు. హైదరాబాద్ వచ్చే ఆంధ్రులకు చర్లపల్లి వద్ద రైల్వే టెర్మినల్ నిర్మిస్తామన్నారు. 
 
వచ్చే డిసెంబరు లోగా దేశ వ్యాప్తంగా వంద వందే భారత్ రైళ్లను నడపాలన్న పట్టుదలతో కేంద్రం ఉందన్నారు. అందువల్ల సికింద్రాబాద్ - తిరుపతి ప్రాంతాల మధ్య వందే భారత్ రైలు నడిచే అవకాశం ఉందని ఆయన చెప్పారు. కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి రూ.8600 కోట్లను కేటాయించడం జరిగిందని ఆయన గుర్తుచేశారు.