బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: శనివారం, 9 జూన్ 2018 (17:30 IST)

ప్రధానమంత్రిని హత్య చేసేంత శక్తి వాళ్లకుందా? ఇమేజ్ కోసం పాకులాట... వరవరరావు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హత్యకు మావోయిస్టులు కుట్ర‌లు ప‌న్నార‌న్న వార్త‌లు ఇప్పుడు సంచ‌ల‌నంగా మారాయి. అంతేగాదు ఇందులో వ‌ర‌వర‌ రావు పేరు వినిపించ‌డం తెలుగు రాష్ఱ్రాల్లో మ‌రింత సంచ‌ల‌నం అయింది. ఇంత‌కీ వ‌ర‌వ‌ర‌రావు పేరు ఎలా తెర‌పైకి వ‌చ్చింది. ఆయ‌న‌కు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హత్యకు మావోయిస్టులు కుట్ర‌లు ప‌న్నార‌న్న వార్త‌లు ఇప్పుడు సంచ‌ల‌నంగా మారాయి. అంతేగాదు ఇందులో వ‌ర‌వర‌ రావు పేరు వినిపించ‌డం తెలుగు రాష్ఱ్రాల్లో మ‌రింత సంచ‌ల‌నం అయింది. ఇంత‌కీ వ‌ర‌వ‌ర‌రావు పేరు ఎలా తెర‌పైకి వ‌చ్చింది. ఆయ‌న‌కు దీనితో సంబంధం ఏమిటి? ఆయ‌న ఏమంటున్నారు?
 
ఈ ఏడాది జనవరిలో మహారాష్ట్రలోని భీమా కోరేగావ్‌లో జరిగిన హింసాత్మక ఘటనకు సంబంధించి కేసులో సుధీర్‌ దావలే, సురేంద్ర గాట్లింగ్‌, సోమాసేన్‌, మహేష్‌ రౌత్‌, రోనా జాకబ్‌ విల్సన్‌ అనే ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. 
 
అయితే జాకబ్‌ విల్సన్‌ను అరెస్ట్‌ చేసిన ఇంటి నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న లేఖ తాజాగా కలకలం రేపుతోంది. అరెస్ట్‌ అయిన జాకబ్‌ విల్సన్ ల్యాప్‌టాప్లో ప్రధాని హత్యకు కుట్ర పన్నారంటూ పూణె పోలీసులు ఓ లేఖను కోర్టుకు సమర్పించారు. మోదీని ఎలా హత్య చేయాలో మావోయిస్టులు లేఖల ద్వారా చర్చించుకోవడం ఉన్నట్లు తెలిసింది. మోదీని కూడా రాజీవ్ హత్య తరహాలోనే చేయాలని, అందుకు ఓ ప్రణాళిక రూపొందించాలని, ఇందుకు నాలుగు లక్షల రౌండ్ల బుల్లెట్లు, ఎనిమిది కోట్ల రూపాయలు అవసరం పడతాయని లేఖలో పేర్కొంటూ, ఈ కుట్రలో వరవరరావు సహకారంతో డబ్బు సర్దుబాటు చేయాలని ప్రస్తావించారు. దీంతో పూణే పోలీసులు వరవరరావును కేసులోకి తెచ్చారు. ఆయ‌న్ను విచారించే అవ‌కాశాలూ ఉన్నాయి. 
 
న‌న్ను టార్గెట్ చేశారు…
ప్రధాని హత్యకు కుట్ర లేఖలో తన పేరు ఉండటంపై వరవరరావు స్పందిస్తూ… ప్రధాని హత్యకు మావోయిస్టులు కుట్ర పన్నారని తాను అనుకోవడం లేదన్నారు. ప్రధానిని హత్య చేసే శక్తి మావోయిస్టులకు ఉందా? అనేది కూడా అనుమానమేనని అన్నారు. ఇటీవల మోదీ గ్రాఫ్ తగ్గుతుందని, ఆయన ఇమేజ్‌ను పెంచే చర్యగా తాను ఈ కుట్రను భావిస్తున్నానని అన్నారు.
 
రోనా జాకబ్‌ విల్సన్‌ భీమకోరేగావ్‌ ఘటనలో దొరకలేదని, ఢిల్లీ, పుణెలో దాడులు చేసి ఆయన్ను అదుపులోకి తీసుకున్నారని వరవరరావు పేర్కొన్నారు. తనపై ఆరోపణలు వచ్చినంత మాత్రాన విల్సన్‌తో సంబంధం లేదని చెప్పనని, ఇదంతా తనను టార్గెట్‌ చేయడమే అనిపిస్తుందన్నారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఎవరూ తనను సంప్రదించలేదని, మహా అయితే తనను కూడా అరెస్టు చేస్తారని, అంతకంటే ఏమీ కాదని వరవరరావు వ్యాఖ్యలు చేశారు. ప్రజాసంఘాలు, విప్లవ రచయితలను అణచివేసే కుట్ర జరుగుతుందని ఆయన ఆరోపించారు.