ఆన్‌లైన్ చదువులపై పెదవి విరిచిన ఉప రాష్ట్రపతి వెంకయ్య
ప్రస్తుతం కరోనా సీజన్లో విధిలేని స్థితిలో నిర్వహిస్తున్న ఆన్ లైన్ చదువులపై సాక్షాత్తు భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పెదవి విరిచారు. ఆన్ లైన్ విద్యాబోధన అనేది విద్యార్థులకు విషయాన్ని చేరవేయడంగానే కాకుండా, వారిలో సృజనాత్మకత, పరిశోధనాసక్తిని పెంపొందించేదిగా ఉండాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు.
తరగతి గదుల్లో బోధించే విద్యకు ఆన్‌లైన్ విద్యాబోధన సరైన ప్రత్యామ్నాయం కాదని అన్నారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ విద్యాభ్యాసాన్ని సమన్వయం చేస్తూ.. అందరికీ ఆమోదయోగ్యమైన మిశ్రమ విద్యావిధానాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రపంచ విశ్వవిద్యాలయాల సదస్సును ఉపరాష్ట్రపతి నివాసంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ సమావేశ ప్రాంగణం నుంచి బుధవారం వెంకయ్యనాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యను అందించడం మాత్రమే కాకుండా, వివిధ రంగాల్లో నాయకులుగా ఎదిగేలా విద్యార్థులను తీర్చిదిద్దే బాధ్యతను విశ్వవిద్యాలయాలు తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.