సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 1 ఏప్రియల్ 2021 (10:41 IST)

లడ్డూ - పులిహోర లెక్కలు తారుమారు... చీరల విక్రయాల్లో ఆమ్యామ్యాలు

బెజవాడ కనకదుర్గ గుడి అధికారుల అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అమ్మవారి పేరుతో భారీగా దోచుకున్నట్టు విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో వెల్లడైంది. ముఖ్యంగా లడ్డూ, పులిహోర ప్రసాదాల లెక్కలను తారుమారు చేయడం, చీరల విక్రయాల్లో అవినీతికి పాల్పడటం వంటి చర్యలకు పాల్పడినట్టు తేలింది. 
 
నిజానికి ఏపీలోని ప్రముఖ ఆలయాల్లో దుర్గగుడి ఒకటి. ఇక్కడ నిత్యం ఏదో ఒక వివాదం చోటుచేసుకుంటోంది. తాజాగా విజిలెన్స్‌ అధికారులు దుర్గ గుడిలో సోదాలు నిర్వహించారు. నిత్యాన్నాదాన కాంట్రాక్టులో అవకతవకలు జరిగినట్టు గుర్తించారు విజిలెన్స్‌ అధికారులు.
 
ఈవో సురేష్‌బాబు నిర్ణయంతో చీరలు విక్రయించినట్టు గుర్తించారు. చీరల కౌంటర్ లో దేవాదాయశాఖ కమిషనర్‌ అనుమతి లేకుండా సొంత నిర్ణయంతో చీరల విక్రయం జరిగినట్టు తేల్చారు. 
 
అలాగే, లడ్డూ, పులిహోర తయారీ, అమ్మకాల్లో లెక్కలను తారుమారు చేసినట్టు గుర్తించారు. బుధవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు తనిఖీలు నిర్వహించారు విజిలెన్స్‌ అధికారులు. సెక్యూరిటీ, శానిటరీ టెండర్లలో అవకతవకలపై విజిలెన్స్‌కు ఫిర్యాదులు అందడంతో సోదాలు చేపట్టారు. ఇప్పటికే ఏసీబీ సోదాల్లో 15 మంది అధికారులపై సస్పెన్షన్‌ వేటు పడింది.
 
కాగా, ఇప్పటికే 15 మంది సిబ్బందిపై సస్పెన్షన్‌ వేటు పడటంతో… తమదాకా వస్తుందేమోనని మరికొందరు హడలిపోతున్నారు. తాజాగా లడ్డూ, పులిహోర తయారీ, విక్రయాల లెక్కల్లో తేడాలున్నట్టు విజిలెన్స్‌ అధికారులు గుర్తించారు. అటు ఈవో సురేష్‌బాబు సొంత నిర్ణయంతో చీరల విక్రయాలు జరిగినట్టు గుర్తించారు. దీంతో ఈసారి మళ్లీ ఎంత మందిపై వేటు పడుతుందోననే ఉత్కంఠ నెలకొంది.