శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 1 ఆగస్టు 2019 (14:17 IST)

రివర్స్ టెండరింగ్ పేరెత్తితే వారిద్దరి వెన్నులో వణుకు : విజయసాయి రెడ్డి

మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి సెటైర్లు వేశారు. సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో అక్రమాలపై ట్విట్టర్ వేదికగా నిలదీశారు. ప్రాజెక్టుల పనులకు సంబంధించి రివర్స్‌ టెండరింగ్‌ అనగానే మీ నాయకుడు చంద్రబాబుకు, నీకు వెన్నులో వణకు పుడుతుందా అని ప్రశ్నించారు. అలాగే పోలవరం ప్రాజెక్టులో దోచుకున్న ప్రతి రూపాయిని కక్కిస్తామని హెచ్చరించారు. 
 
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి మీలా కుల, వర్గ బలహీనతలు లేవని స్పష్టం చేశారు. ఇకపోతే పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టుల విషయంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం వైఎస్‌ జగన్‌ ప్రాజక్టుల పనుల్లో పారదర్శకత కోసం రివర్స్‌ టెండరింగ్‌ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. రివర్స్‌ టెండరింగ్‌కు జలవనరుల శాఖ పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది. రివర్స్‌ టెండరింగ్‌తో భారీ మొత్తంలో ప్రజాధనం ఆదా అవుతుందని నిపుణులు భావిస్తున్నారు. 
 
ఆంధ్రప్రదేశ్‌ను అవినీతి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని విజయసాయిరెడ్డి తెలిపారు. ఏపీకి కొత్త ఇమేజీ తీసుకొస్తానని సీఎం వైఎస్‌ జగన్‌ చెబుతుంటే రాష్ట్రానికి పరిశ్రమలు రావని పచ్చపార్టీ నేతలు ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు.
 
మరోవైపు రివర్స్ టెండరింగ్‌పై మాజీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు నిప్పులు చెరిగారు. పోలవరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని గత తెలుగుదేశం ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసుందుకే రివర్స్ టెండరింగ్ అంటూ దేవినేని ఉమా మహేశ్వరరావు ఆరోపించారు.