సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: శనివారం, 6 నవంబరు 2021 (20:28 IST)

విఐపిలు ఈ నెల 13, 14, 15 తేదీల్లో తిరుమల రావద్దండి, ఎందుకంటే?

మొట్టమొదటిసారి తిరుపతి వేదికగా సౌత్ ఇండియా కౌన్సిల్ మీటింగ్ జరుగనుంది. కౌన్సిల్ సమావేశానికి ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు. కేంద్ర హోంశాఖామంత్రి అమిత్ షా అధ్యక్షతన సమావేశం జరుగనుంది. సమావేశంలో రాష్ట్రాల అభివృద్థి, కేంద్రప్రభుత్వం కేటాయించనున్న నిధుల అంశంపై ప్రధానంగా చర్చించనున్నారు.
 
అయితే కౌన్సిల్ సమావేశం పాల్గొనేందుకు ముఖ్యమంత్రులు, కేంద్రం హోంశాఖామంత్రితో పాటు పలువురు అగ్రనేతలు వస్తున్న నేపథ్యంలో తిరుమలలో విఐపి దర్సనాలను మూడు రోజుల పాటు టిటిడి నిలిపివేయనుంది.
 
ఈ నెల 13, 14, 15 తేదీల్లో తిరుమల శ్రీవారి ఆలయంలో బ్రేక్ దర్సనాలను రద్దు చేస్తున్నట్లు టిటిడి ముందస్తుగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో నవంబరు 12, 13, 14 తేదీల్లో విఐపి బ్రేక్ దర్సనాలకు ఎలాంటి సిఫారసు లేఖలు స్వీకరించబడవని టిటిడి ఒక ప్రకటనలో తెలిపింది. 
 
విఐపిలు ఆరోజుల్లో తిరుమల రావద్దని కూడా టిటిడి విజ్ఞప్తి చేస్తోంది. అయితే ఈ కౌన్సిల్ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మైలతో పాటు కేరళ ముఖ్యమంత్రి విజయన్, తమిళనాడు సిఎం స్టాలిన్‌లు కూడా హాజరు కానున్నారు. సిఎంలు అందరూ కలిసి కేంద్రానికి ఏం చెప్పబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది.