ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 9 మే 2020 (10:20 IST)

గ్యాస్ లీకేజీ బాధితులకు కొత్త సమస్యలు... కమిలిపోతున్న చర్మం.. శరీరంపై బొబ్బలు...

వైజాగ్ గ్యాస్ లీకేజీ ఘటనలో ప్రాణాలతో బయటపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి కొత్తగా అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. శ్వాసకోశ సమస్యలతో పాటు.. ఇతర సమస్యలు తలెత్తడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా, చర్మం నల్లగా కమిలిపోవడం, చర్మంపై బొబ్బలు వస్తున్నాయి. 
 
రెండు రోజుల వైజాగ్‌లో ఎల్జీ పాలిమర్స్ నుంచి స్టిరిన్ అనే విషవాయువు లీకై 12 మంది చనిపోగా 554 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిని విశాఖ కేజీహెచ్ ఆస్పత్రిలో ఉంచి చికిత్స చేస్తున్నారు. అయితే, గ్యాస్ పీల్చి అస్వస్థతకులోనై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులకు ఇప్పుడు ఇతర సమస్యలు చుట్టుముడుతున్నాయి.
 
తాజాగా, బాధితుల్లో కొందరికి ఒంటిపై బొబ్బలు వస్తుండగా, చిన్నారుల్లో జ్వరం, న్యూమోనియా వంటి లక్షణాలు బయటపడుతుండడం ఆందోళనకు గురిచేస్తోంది. తొలుత శరీరంపై దురద, మంట పుడుతున్నాయి. ఆ తర్వాత చర్మం కమిలిపోయి బొబ్బలు వస్తున్నాయి.
 
దీంతో చర్మవ్యాధుల నిపుణులు వారికి చికిత్స అందిస్తున్నారు. మరికొందరు బాధితులు తాము ఆహారం తీసుకోలేకపోతున్నామని చెబుతున్నారు. దీంతో స్పందించిన వైద్యులు వారికి కిడ్నీ, కాలేయ పనితీరుకు సంబంధించిన పరీక్షలు చేస్తున్నారు.