గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 8 మే 2020 (17:32 IST)

ప్రాణాలను డబ్బుతో వెలకడతారా? సీఎం జగన్ నిర్ణయం సబబుకాదు : చంద్రబాబు

విశాఖపట్టణం గ్యాస్ లీకేజీ ఘటనలో చనిపోయిన కుటుంబాలకు రూ.కోటి ఆర్థికసాయం ప్రకటించడాన్ని టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తప్పబట్టారు. ప్రాణాలను డబ్బుతో వెలకడతారా? అంటూ నిలదీశారు. ఇలాంటి ఘటనలపై ఎంతో కఠినంగా వ్యవహరించాల్సిన ప్రభుత్వం, విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనను తేలికగా తీసికున్నట్టుగా ఉందని విమర్శలు చేశారు. 
 
అంతేకాకుండా ఈ ఘటనపై విచారణకు ముగ్గురు ఐఏఎస్ అధికారుల నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీపై కూడా చంద్రబాబు విమర్శలు చేశారు. ఈ కమిటీలోని ఏ ఒక్క సభ్యుడికి రసాయన శాస్త్రంపై ఏమాత్రం అవగాహన లేదని ఆరోపించారు. అలాంటపుడు ఈ కమిటీ ఎలాంటి నివేదిక ఇస్తుందో ఇపుడే అర్థం చేసుకోవచ్చన్నారు.
 
ఇకపోతే, ఇలాంటి ప్రమాదాలు పునరావృతంకాకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఎల్జీ పాలిమర్స్ వంటి పరిశ్రమల్లో మరిన్ని భద్రతా చర్యలు చేపట్టాలని కోరారు. ఇలాంటి పరిశ్రమలకు అనుమతి ఇచ్చేటప్పుడు నిబంధనలు పాటించాలని చెప్పారు. జనావాసాల మధ్య ఇలాంటి పరిశ్రమలు ఉండడం సరికాదని తెలిపారు. స్టిరీన్ లీక్ ఘటన గతంలో ఎన్నడూ జరగలేదని చెప్పారు.
 
'ఎవరికీ ప్రాణాలు తీసే హక్కు లేదు.. ఏదైనా ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగితే కేవలం ఆ ఫ్యాక్టరీలోని కార్మికులే చనిపోయే అవకాశం ఉంటుంది. కానీ, మొదటిసారి ఏపీలో సాధారణ ప్రజలు ఇలా చనిపోయారు. ఇందుకు కారణమైన వారు ఎంతటి వారైనా వదలిపెట్టడానికి వీల్లేదు. విశాఖలో భయంకర పరిస్థితులు నెలకొన్నాయి. జనాలు చాలా భయంతో గురువారం పరుగులు తీశారు' అని చంద్రబాబు గుర్తుచేశారు.
 
లాక్‌డౌన్‌ వల్లే ప్రమాదం జరిగిందా? అన్న విషయంపై కూడా దర్యాప్తు జరపాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే పరిశ్రమలో ఉన్న సైరన్‌ కూడా మోగలేదని సీఎం జగనే చెప్పారు. దీనిపై సీఎం జగన్‌ స్పందించిన తీరు బాగోలేదని ఆయన అన్నారు. ఇలాంటి ప్రమాదాలను తేలికగా తీసుకునే విధంగా ఆయన చేసిన ప్రకటన ఉందని చెప్పారు.