శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Updated : గురువారం, 7 మే 2020 (19:28 IST)

వైజాగ్ గ్యాస్ లీకేజీ : మృతుల కుటుంబాలకు రూ.కోటి ఎక్స్‌గ్రేషియా - సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ నగరం ఆర్.ఆర్.వెంకటాపురంలో ఉన్న ఓ పాలిమర్స్ పరిశ్రమలో ప్రమాదం జరిగి రసాయన వాయువులు భారీగా లీకయ్యాయి. గురువారం వేకువ నుంచి రసాయన వాయువులు లీకవవుతుండడంతో ఇప్పటికే మూణ్నాలుగు కిలోమీటర్ల మేర వ్యాపించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 13 మంది మరణించారు. 86మంది బాధితులకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్లు కేజీహెచ్ వైద్యులు తెలిపారు.
 
మ‌ధ్యాహ్నం 3.10
విశాఖ గ్యాస్ లీక్ ఘటనలో మరణించిన వారికి కోటి రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నవారికి 10 లక్షల చొప్పున, ప్రాథమిక చికిత్స చేయించుకున్న వారికి రూ.25 వేలు, రెండు మూడు రోజులు చికిత్స పొందినవారికి లక్ష రూపాయల చొప్పున సాయం చేస్తామని తెలిపారు.
 
ఈ ఘటనపై పూర్తి దర్యాప్తుకు కమిటీ ఏర్పాటు చేశామని, ఆ కమిటీ నివేదిక ఇచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ ఘటన జరిగిన గ్రామంలో కొన్ని జంతువులు కూడా చనిపోయాయని, వాటికి కూడా పరిహారం చెల్లిస్తామ‌న్నారు. మృతుల కుటుంబాలకు అన్ని రకాలుగా అండగా ఉంటామ‌ని హామీ ఇచ్చారు. మృతుల కుటుంబ సభ్యుల్లో ఒక‌రికి అదే సంస్థలో ఉద్యోగాలు ఇప్పించేందుకు ప్రయత్నిస్తామ‌ని చెప్పారు.
 
మధ్యాహ్నం 1.45
ప్రమాద బాధితులను పరామర్శించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కింగ్ జార్జ్ హాస్పటల్‌కు చేరుకున్నారు. ఇక్కడ చికిత్స పొందుతున్న 196 మంది పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉందని వైద్యులు సీఎంకు వివరించారు. వారందరి ఆరోగ్య పరిస్థితిని జగన్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆంధ్రా మెడికల్ కళాశాల డిజిటల్ క్లాస్ రూంలో అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు.
 
మధ్యాహ్నం 12.45
విశాఖపట్నంలో గ్యాస్ లీకేజీ ఘటనకు సంబంధించి దక్షిణ కొరియా రాజధాని సోల్‌లో ఉన్న ఎల్జీ కెమ్ సంస్థను బీబీసీ సంప్రదించింది. అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయనప్పటికీ ప్రస్తుత పరిస్థితిని అంచనా వేస్తున్నామని, మృతులు, బాధితుల వివరాలను సేకరిస్తున్నామని తెలిపారు. కరోనావైరస్ లాక్ డౌన్‌ కారణంగా ప్రస్తుతం ఫ్యాక్టరీ మూతబడి ఉందని, గ్యాస్ లీకేజీని రాత్రి డ్యూటీలో ఉన్న గార్డు ముందుగా గుర్తించారని తెలిపింది.
 
మధ్యాహ్నం 12.00
కారణాలపై విచారణ చేస్తున్నాం: ఎల్జీ పాలిమర్స్
విశాఖలో ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో గ్యాస్ లీకేజీ ప్రమాదంపై విచారణ చేస్తున్నామని ఎల్జీ సంస్థ తెలిపిందని రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. ప్రస్తుతం గ్యాస్ లీకేజీ అదుపులో ఉందని దక్షిణ కొరియాకు చెందిన ఈ కంపెనీ వెల్లడించింది.
 
అత్యవసర సర్వీసుల సిబ్బంది వెంటనే స్పందించి సమీపంలోని 3 కిలోమీటర్ల పరిధిలోని ప్రాంతాల ప్రజలను అక్కడి నుంచి ఖాళీ చేయించారు. ప్రస్తుతం ప్రమాద తీవ్రతను అంచనావేసే పనిలో ఉన్నాం. ప్రభుత్వ అధికారులతో కలసి సిబ్బందిని, ప్రజలను రక్షించేందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటున్నాం అని ఎల్జీ పాలిమర్స్ యాజమాన్య సంస్థ ఎల్జీ కెమ్ ఓ ప్రకటనలో తెలిపింది.
 
ఉదయం 11.50
గ్యాస్ లీకేజీ ఘటన బాధితులను పరామర్శించేందుకు, సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షించేందుకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖకు బయలుదేరారు. ప్రస్తుతం విశాఖ కేజీహెచ్‌లో 130మంది చికిత్స పొందుతున్నారు. వివిధ హాస్పటళ్లలో మరో 250మంది వరకూ చికిత్స తీసుకుంటున్నారు.
ఉదయం 11.25
విశాఖ ప్రమాదంలో ప్రజలు కొందరు ప్రాణాలు కోల్పోవడంపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలుపుతూ ట్వీట్ చేశారు. అనారోగ్యంపాలైవన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
 
ఉదయం 11.20
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌కు లేఖ రాశారు. విశాఖ నగంలో ఉన్న ఎల్జీ పాలిమర్స్‌ను నగరం బయట ఉన్న ప్రత్యేక ఆర్థిక మండలికి తరలించాలని తద్వారా భవిష్యత్‌లో ఇలాంటి ప్రమాదాలు నిరోధించేందుకు చర్యలు చేపట్టాలని కోరారు.
 
విశాఖలో స్టైరీన్ గ్యాస్ బాధితులకు చికిత్స చేసే అనుభవం ఉన్న వైద్య సిబ్బంది, పరికరాలు లేని కారణంగా కేంద్రం తగిన అనుభవం ఉన్న వైద్య సిబ్బందిని విశాఖకు పంపించాలని కోరారు. ప్రస్తుతం కోవిడ్-19 వ్యాపిస్తున్న తరుణంలో స్టైరీన్ బాధితులకు తగిన చికిత్స అందించాలని సూచించారు. విశాఖ వెళ్లేందుకు అనుమతి ఇవ్వండివిశాఖ వెళ్లి బాధితులను పరామర్శించాలి కాబట్టి అనుమతి ఇవ్వాలని చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న చంద్రబాబు, కేంద్రం అనుమతినిస్తే వెంటనే విశాఖ వెళ్లాలనుకుంటున్నట్లు తెలిపారు.
 
ఉదయం 11.15
మృతులకు సంతాపం తెలిపిన కేసీఆర్
గ్యాస్ లీకేజీ ఘటన చాలా బాధించిందని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. "ఇదో దురదృష్టకరమైన సంఘటన. మృతుల కుటుంబాలకు నా సానుభూతి తెలుపుతున్నా. అస్వస్థతకు గురైనవారంతా త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా" అని ఆయన తెలిపారు.
 
ఉదయం 11.10
స్టైరీనా గ్యాస్ చాలా ప్రమాదకరమైనది
"ఇప్పటివరకు అందిన సమాచారాన్ని బట్టి ఎల్జీ పాలిమర్స్ నుంచి విడుదలైన గ్యాస్ స్టైరీన్ అని భావిస్తున్నాం. ఒకవేళ ఇది నిజమైతే.. ఈ వాయువు అత్యంత ప్రమాదకరమైనది. ఈ వాయువుకు ఎలాంటి రంగు ఉండదు. వాసన ఉండదు. నర్వ్ ఏజెంట్‌గా పనిచేయడంలో ఎంతో శక్తిమంతమైన వాయువు కాబట్టి దీన్ని రసాయన ఆయుధాల్లో ఉపయోగిస్తారు" అని శాస్త్రవేత్త ఎంవీ ఆంజనేయులు తెలిపారు.
 
ఉదయం 10.40
విశాఖ ఘటనపై ఏపీ సీఎం జగన్‌తో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌లో మాట్లాడారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిపై వివరాలు తెలుసుకున్నారు. అవసరమైన అన్ని రకాల సహాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటివరకు చేపట్టిన సహాయ చర్యలను మోదీకి జగన్ వివరించారు. పరిస్థితి అదుపులోనే ఉందని, బాధితులకు వైద్య సహాయం అందిస్తున్నామని తెలిపారు. గవర్నర్ హరిచందన్ కూడా జగన్‌కు ఫోన్ చేశారు. ప్రమాద కారణాలు, సహాయక చర్యలను సీఎం ఆయనకు వివరించారు.
 
ఉదయం 10.35
కంపెనీ నిర్లక్ష్యం కనిపిస్తోంది
ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి
విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనపై ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి బీబీసీ తెలుగుతో మాట్లాడారు. తెల్లవారుజామున సుమారు 3.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం సంభవించింది. లాక్ డౌన్ నిబంధనలు సడలింపు తర్వాత ఈరోజు ఈ ఫ్యాక్టరీ తెరుచుకోవాల్సి ఉంది. కార్యకలాపాలు పునఃప్రారంభించేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్న సమయంలో ఈ లీకేజీ జరిగింది. ఏం జరిగిందో స్పష్టంగా తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నాం.
 
ప్రాథమిక ఆధారాలను బట్టి చూస్తే నిర్దేశిత ప్రక్రియలను పాటించడంలో కంపెనీ నిర్లక్ష్యం వహించిందని అర్థమవుతోంది. కార్యకలాపాలు ప్రారంభించే ముందు, ప్రత్యేకించి ఇలాంటి కంపెనీలు తప్పనిసరిగా నిర్దేశిత నిబంధనలను పాటించి తీరాలని ప్రభుత్వం చాలా విస్పష్ట ఆదేశాలు జారీచేసింది. ఈ నిబంధనల అమలులో ఎల్జీ పాలిమర్స్ విఫలమైందని నిరూపణ జరిగితే కఠిన చర్యలు తీసుకుంటాం.
 
ప్రస్తుతం మరో పాలిమర్‌ను వినియోగించి గ్యాస్ లీకేజీని అరికట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు దాదాపు 90-95శాతం వరకూ లీకేజీని అరికట్టాం. మరో గంటలో మొత్తం అదుపులోకి వస్తుంది. దాదాపు కిలోమీటర్ వరకూ ఈ వాయువు వ్యాపించింది.
 
ఘటన జరిగినప్పుడు కంపెనీలో ఉద్యోగులున్నారు. కానీ, వారిలో ఎవరైనా ప్రాణాలు కోల్పోయారా అనే విషయం ఇంకా తెలియలేదు. విడుదలైన గ్యాస్ వాతావరణంలో కలిసిపోయింది. ఈ వాయువును పీల్చి అస్వస్థతకు గురైనవారిపై దీర్ఘకాలంలో అది ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నాం.
 
ఉదయం 10.30
"విశాఖ గ్యాస్ ప్రమాదంపై హోంశాఖ అధికారులు, ఎన్డీఎంఏ సిబ్బందితో మాట్లాడాను. బాధితులంతా వీలైనంత త్వరగా కోలుకోవాలని, విశాఖ వాసులంతా క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నా" అని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.
 
ఉదయం 10.25
పోలీసులు తక్షణమే స్పందించారు: డీజీపీ
విశాఖలో ఆర్‌ఆర్‌ వెంకటాపురం వద్ద పరిశ్రమలో గ్యాస్‌ లీకైన ఘటన దురదృష్టకరమని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. "తెల్లవారుజామున '100' నంబరు ద్వారా పోలీసులకు సమాచారం అందింది. తక్షణమే స్పందించిన పోలీసులు, సీపీ ఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిసర జిల్లాల నుంచి అధికారులను, సిబ్బందిని, ఏపీఎస్పీ బలగాలను సంఘటన స్థలానికి పంపి బాధితులకు సహాయ కార్యక్రమాలు చేపట్టాం. ప్రజలను రక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాం. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, ఘటనపై వివరాలను ముఖ్యమంత్రికి వివరిస్తున్నాం" అని డీజీపీ వెల్లడించారు.
 
ఉదయం 10.20
విశాఖలో ఇదే పెద్ద ప్రమాదం
పారిశ్రామిక నగరం విశాఖలో గతంలోనూ అనేక ప్రమాదాలు జరిగాయి. అందులో 2013 జనవరి 27న జరిగిన ప్రమాదం పెద్దది. అప్పట్లో ఉదయం 6 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. హెచ్‌పీసీఎల్‌ ఎంఎస్ బ్లాక్‌లో సీసీఆర్ యూనిట్‌లో ఆ ప్రమాదం సంభవించింది. 25 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతకుముందు 1997లో కూడా హెచ్‌పీసీఎల్‌లోనే ప్రమాదం జరిగింది. 22 మంది మరణించారు.
 
2013, 2017లో కూడా ప్రమాదాలు జరిగినప్పటికీ పెద్దగా ప్రాణనష్టం లేకుండా బయటపడ్డారు. వాటి తర్వాత ప్రస్తుతం ఎల్జీ పాలిమర్స్ ప్రమాదమే విశాఖ పారిశ్రామికప్రాంతాల్లో జరిగిన పెద్ద ప్రమాదంగా భావిస్తున్నారు.
 
ఉదయం 10.15
విశాఖ దుర్ఘటన హృదయవిదారకం: పవన్ కల్యాణ్
విశాఖపట్నం పరిధిలోని ఆర్ఆర్ వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి విష వాయువులు విడుదలై 5 కిలోమీటర్ల మేర ప్రజలు భయకంపితులు కావడం, 8 మంది మృతి చెందటం, వందల మంది తీవ్ర అస్వస్థతకు లోనవడం హృదయవిదారకం అని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.
 
"మృతుల కుటుంబాలకు నా తరపున, జనసేన తరపున ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నా. అస్వస్థతకు గురైనవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా. వారికి ప్రభుత్వం మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలి. మృతుల కుటుంబాలకు ఆర్థికసాయం అందించాలి.
 
విశాఖ పరిధిలోని పరిశ్రమల్లో తరచూ ప్రమాదాలు చోటు చేసుకొంటున్నాయి. ప్రభుత్వం తక్షణం పరిశ్రమల్లోని రక్షణ, కాలుష్య నియంత్రణ చర్యలను పరిశీలించాలి. అదే విధంగా పరిశ్రమల నుంచి విష రసాయనాలు, వ్యర్థాలు వెలువడుతుండటంతో ప్రజలు అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. చర్యలు తీసుకోవాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నా స్పందించకపోవడంతోనే ఇలాంటి దుర్ఘటనలు చోటు చేసుకొంటున్నాయి.
 
రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఇలాంటి పరిశ్రమల విషయంలో నిర్లిప్తంగా ఉండకుండా ప్రజారోగ్యం పట్ల, పర్యావరణ పరిరక్షణపట్ల బాధ్యతగా ఉండాలి. కఠినంగా వ్యవహరించాలి. ఈ ప్రమాదం గురించి, విశాఖ పరిధిలోని కాలుష్యకారక పరిశ్రమల గురించి నివేదిక సిద్ధం చేయాలని మా పార్టీ నాయకులకు సూచించాను" అని పవన్ కల్యాణ్ తెలిపారు.
 
ఉదయం 10.10
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహిస్తున్నారు. విశాఖ ప్రమాద బాధితులకు చేపట్టిన సహాయక చర్యలపై అధికారులతో మాట్లాడుతున్నారు.
 
ఉదయం 10.05
"మృతుల కుటుంబాలకు నా సానుభూతి తెలియచేస్తున్నా. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డీజీపీలతో మాట్లాడి సంఘటన వివరాలు తెలుసుకున్నా. అవసరమైన సహాయక చర్యలు చేపట్టాల్సిందిగా ఎన్డీఆర్ఎఫ్‌ను ఆదేశించా. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నా. ఈ అనూహ్య ఘటన కారణంగా వందల మంది ప్రజలు అస్వస్థతకు గురయ్యారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శితో కూడా మాట్లాడాను. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సహాయ సహకారాలు అందించాలని కోరాను" అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి తెలిపారు.
 
యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలి
జనావాసాల నుంచి కెమికల్ పరిశ్రమను తరలించాలని ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్, మాజీ ఎమ్మెల్యే బండారు సత్యన్నారాయణ మూర్తి డిమాండ్ చేశారు. బ్రాయిలర్‌ను పరీక్షించాల్సిన అధికారులు ఎందుకు నిర్లక్ష్యం చేశారని వారు ప్రశ్నించారు.
 
"బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలి. 8 మంది మరణించారు, 30 మందికి సీరియస్‌గా ఉంది. బాధితులకు తగిన వైద్యం, ఇతర సదుపాయాలు అందించాలి. సమీప ప్రాంత ప్రజలందరినీ ఆస్పత్రికి తరలించి పరీక్ష చేయాలి. భవిష్యత్తులో ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలి. దీనిపై ముఖ్యమంత్రి స్పష్టమైన ప్రకటన చేయాలి" అని వారు కోరారు.
 
ఉదయం 10.00
విశాఖ ఎల్జీ పాలిమర్స్ ప్రమాదంపై గవర్నర్ విశ్వ భూషణ్ హరిచందన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. యుద్ధ ప్రాతిపదికన అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రజల తరలింపులో రెడ్ క్రాస్ వాలంటీర్ల సేవలను వియోగించుకోవాలని సూచించారు. తక్షణమే వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని విశాఖ రెడ్ క్రాస్‌కు ఆదేశాలు జారీ చేశారు.
 
ఉదయం 9.55
లాక్ డౌన్ కారణంగా కార్యకలాపాలు నిలిచిన ఈ పరిశ్రమలో సడలింపుల తర్వాత నిన్నటి నుంచే కార్యకలాపాలు ప్రారంభమయ్యాయని జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ తెలిపారు.
 
ఉదయం 9.50
"గ్యాస్ లీకేజీ ఘటనలో ముగ్గురు చనిపోయారని, వందల మంది అనారోగ్యం పాలయ్యారని తెలిసి దిగ్భ్రాంతికి లోనయ్యా. బాధితులకు సాయం చేయడానికి టీడీపీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలి. అధికారులు సూచించిన విధంగా అవసరమైన చర్యలు చేపట్టేందుకు అందరూ సిద్ధంగా ఉండాలని కోరుతున్నా" అని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ట్వీట్ చేశారు.
 
ఉదయం 9.45
"ఈ ఉదయం విశాఖ గ్యాస్ ప్రమాదం తీవ్ర ఆవేదన కలిగించింది. అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నా. బాధితులు, మృతుల కుటుంబాలకు నా సానుభూతి తెలుపుతున్నా" అని కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ట్వీట్ చేశారు.
 
"విశాఖ కలెక్టర్ కార్యాలయ అధికారులతో, ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యంతో నిరంతరం సంప్రదిస్తున్నాం. ఇది ఎల్పీజీ లీక్ కాదని, ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉంది. యుద్ధప్రాతిపదికన అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించాం. గ్రామాలను ఖాళీ చేయించే ప్రక్రియ కొనసాగుతోంది. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అధికారులు, సహాయక సిబ్బందికి సహకరించాలి" అని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు.
 
ఈ వాయువు కారణంగా కళ్లు మండుతూ, ఊపిరి పీల్చుకోవడం కష్టమవుతుండడంతో ప్రజలు ఉన్న ఫళంగా అక్కడి నుంచి దూరంగా తరలిపోతున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా తీవ్ర ఆందోళన నెలకొంది. ఇప్పటికే కొందరు అపస్మారక స్థితికి చేరుకోవడంతో వారిని అంబులెన్సుల్లో ఆసుపత్రులకు తరలిస్తున్నారు. పోలీసులు, అధికారులు ఆ ప్రాంతానికి చేరుకుని ప్రజలను ఇళ్లు ఖాళీ చేయిస్తున్నారు.
 
ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో గ్యాస్‌ లీకైన ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరా తీశారు. తక్షణమే తగిన సహాయ కార్యక్రమాలు చేపట్టాలని, బాధిత ప్రాంతాల్లో తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీచేశారు. మరి కాసేపట్లో వైఎస్ జగన్ విశాఖకు రానున్నారు. గ్యాస్ లీకేజీ ఘటనలో జరుగుతున్న సహాయక చర్యలను పర్యవేక్షించడంతోపాటు, బాధితులను ఆయన పరామర్శించనున్నారు.
 
సైరన్లు మోగించి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. సమీపంలో ఉన్న కాలనీలు, గ్రామాల ప్రజలు తమ ముక్కు, నోటికి అడ్డంగా తడి గుడ్డలను కట్టుకోవాలని, దీని వల్ల కొంతవరకూ ఉపశమనం ఉంటుందని జీవీఎంసీ అధికారులు సూచించారు.
 
ఎల్జీ పాలిమర్స్‌పై కేసు నమోదు
ఘటనాస్థలంలో ఆర్ఆర్ వెంకటాపురంలో మూడు మృతదేహాల గుర్తించామని, కేజీహెచ్‌లో ఐదుగురు మరణించారని విశాఖ సీపీ ఆర్పీ మీనా వెల్లడించారు. "ప్రాణ నష్టం తగ్గించేందుకు ప్రయత్నం చేస్తున్నాం. సహాయక బృందాలు సకాలంలో స్పందించాయి. స్థానికులను వెంటనే అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించాం. 3 కిలోమీటర్ల పరిధిలో ఈ వాయువు ప్రభావం ఉంది. అంబులెన్సులు, మెడికల్ కిట్లతో నేవీ దళాలు రంగంలో దిగాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, పోలీసులు, ఫైర్ సిబ్బంది కూడా గ్యాస్ అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదానికి కారణాలు ఇంకా స్పష్టంగా తెలియలేదు. కంపెనీపై కేసు నమోదు చేశాం" అని ఆర్పీ మీనా తెలిపారు.
 
ఏయే ప్రాంతాలపై ప్రభావం..
పరిశ్రమ ఉన్న ఆర్ఆర్ వెంకటాపురం పరిసరాల్లో ప్రజలంతా ఇళ్లను ఖాళీ చేసి మేఘాద్రి గెడ్డ వైపు, ఇతర సురక్షిత ప్రాంతాల వైపు పరుగులు తీశారు. నాయుడు తోట, పద్మనాభపురం, కంపరపాలెం ప్రాంతాల్లోనూ రసాయన వాయువులు వ్యాపించడంతో అక్కడుండే వారంతా ఇళ్లను ఖాళీ చేసి వాహనాల్లో, పరుగులు తీస్తూ దూరంగా వెళ్లిపోతున్నారు. వృద్ధులు, చిన్నారులు శ్వాస ఆడక ఇబ్బందులు పడుతున్నారు.
 
ఈ ప్రమాదంలో పెద్ద సంఖ్యలో పశువులు, ఇతర జీవాలు మరణించినట్టు చెబుతున్నారు. చాలామంది నిద్రలోనే ఉండగా గ్యాస్ లీకై, ఆవరించడంతో స్పృహ తప్పిపోయారని, వారికి వెంటనే చికిత్స అందించడంలో జాప్యం జరిగిందని, ఇదే అతి పెద్ద సమస్యని వైద్యులు చెబుతున్నారు. దీనివల్ల ప్రాణ నష్టం పెరిగే ప్రమాదముందని అంటున్నారు.
 
ఫ్యాక్టరీలో ఎవరికైనా ప్రమాదం జరిగిందా?
తెల్లవారుజామున 3 గంటల నుంచి వాయువు విడుదల కావడం ప్రారంభమైంది. దీంతో చాలామంది వెంటనే దీన్ని గ్రహించలేకపోయారు. ఆర్ఆర్ వెంకటాపురం, వెంకటాపురం, పద్మనాభపురం, బీసీ కాలనీ, కంపరపాలెం గ్రామాల ప్రజలు తమ ఊరిని విడిచి సురక్షిత ప్రాంతాలు తరలివెళ్లారు.
 
రసాయన వాయువు 3 నుంచి 5 కిలో మీటర్ల మేర వ్యాపించిందని అంచనా. చాలామంది కళ్లు తిరిగి పడిపోయారు. శ్వాస పీల్చుకోవడంలో సమస్యలు ఎదురయ్యాయి. పోలీసులు, రెవెన్యూ యంత్రాంగం, గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) సాయం చేస్తోంది. అంబులెన్సుల్లో బాధితులను తరలిస్తున్నారు. సింహాచలం డిపో ఆర్టీసీ బస్సుల్లో కూడా కొందరిని వేరే ప్రాంతాలకు చేరవేస్తున్నారు.
 
రసాయన వాయువును అదుపు చేసేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. పూర్తిగా అదుపులోకి వచ్చిందా లేదా అనేది ఇంకా తెలియలేదు. స్పృహ తప్పి పడిపోయిన వారిలో పిల్లలు కూడా ఉన్నారు. కొందరు పిల్లాపాపలతో రోడ్లపైకి వచ్చారు. అవకాశం ఉన్న వారు స్నేహితుల ఇళ్లకు వెళ్లారు. లేని వారు రోడ్లపైనే కూర్చున్నారు.
 
ఫ్యాక్టరీలో ఎవరికైనా ప్రమాదం జరిగిందా? స్థానికులు ఇంకా ఎంత మంది ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఉండిపోయారు? వంటి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఉన్నతాధికారులు, కొందరు నాయకులు అక్కడే ఉండి పర్యవేక్షిస్తున్నారు.
 
కొందరు కళ్లు తిరిగిపడిపోయారు. స్పృహలేని వారిని అంబులెన్సుల్లో ఎక్కించడం ఆ ప్రాంతం అంతా కనిపిస్తోంది. చాలా మందికి కళ్లు మండుతున్నాయి. శ్వాస సమస్య కనిపిస్తోంది. దీంతోపాటు చర్మంమీద బొబ్బులు, మంటలతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. తెల్లవారుఝామున ప్రమాదం జరగడం వల్ల ఎవరైనా నిద్రలో మత్తులోకి జారిపోయారా అన్నది తెలియదు.
 
అస్వస్థతకు గురైనవారిని ఆసుపత్రులకు తరలించాం: కలెక్టర్ వినయ్ చంద్
ఈ ప్రమాదంలో సుమారు 200 మంది అస్వస్థతకు గురైనట్లు విశాఖ కలెక్టర్ వినయ్ చంద్ మీడియాకు చెప్పారు. స్టైరీన్ గ్యాస్ లీకైందని, ప్రజలంతా నిద్రలో ఉన్న సమయంలో ఇది లీకవడం వల్ల ఎక్కువ మంది పీల్చి అస్వస్థతకు గురయ్యారని చెప్పారు. వారందరికీ చికిత్స చేస్తున్నారని, కోలుకుంటారని కలెక్టర్ చెప్పారు.
 
ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, పోలీసులు సహాయ చర్యలు చేపట్టారన్నారు. పరిశ్రమకు 5 కిలోమీటర్ల పరిధిలో ఉన్నవారిని ఆర్టీసీ బస్సుల్లో సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు. విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. 15 మంది వృద్ధులకు తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో కేజీహెచ్‌కు తరలించారు.
 
దాదాపు 200 మందికి పైగా ఈ వాయువు కారణంగా అస్వస్థతకు గురయ్యారు. వారిని స్థానికులు, అధికారులు అంబులెన్స్‌లతో పాటు ఆటోలు, కారులలోనూ సమీప ఆస్పత్రికి తరలిస్తున్నారు. ప్రస్తుతం 50 అంబులెన్స్‌లు కూడా ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను తరలించే పనిలో ఉన్నాయి.
 
పూర్తి సమాచారం రావాల్సి ఉంది: పీసీబీ
కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ఘటనా స్థలానికి వెళ్లారని, ఇంకా పూర్తి సమాచారం అందాల్సి ఉందని ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ విశాఖ జాయింట్ ఛీఫ్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ రాజేందర్ రెడ్డి బీబీసీకి తెలిపారు. "ఇప్పటి వరకూ ఉన్న సమాచారం ప్రకారం స్టైరీన్ అనే గ్యాస్ లీక్ అయింది. అది రిఫ్రిజిరేషన్‌లో ఉంటుంది. ఇప్పుడు లీక్ అయింది. మరింత సమాచారం రావాల్సి ఉంది" అని ఆయన అన్నారు.
 
ఏమిటీ ఎల్జీ పాలిమర్స్?
ఈ కంపెనీ హిందుస్తాన్ పాలిమర్స్ పేరుతో 1961లో ప్రారంభమైంది. 1978లో దీన్ని యూబీ గ్రూప్ తీసుకుంది. 1997లో దక్షిణ కొరియాకు చెందిన ఎల్జీ కంపెనీ టేకోవర్ చేసి, ఎల్జీ పాలిమర్స్‌గా పేరు మార్చింది. పాలిస్టిరైన్, ఎక్స్‌పాండబుల్ పాలిస్టిరైన్ (థర్మాకోల్) వంటివి ఈ సంస్థలో తయారవుతాయి. రసాయన వాయువులు లీకై ఎల్‌జీ పాలిమర్స్ పరిశ్రమ దక్షిణకొరియాకు చెందిన సంస్థ. లాక్‌డౌన్ నుంచి పరిశ్రమలకు మినహాయింపు ఇవ్వడంతో దీన్ని తిరిగి ప్రారంభించారు.