సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 7 మే 2024 (13:13 IST)

పవన్‌ను గెలిపించండి.. రాజకీయాల్లోకి ఇష్టంతోనే వచ్చాడు.. మెగాస్టార్

Chiranjeevi
Chiranjeevi
ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల 13వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ నియోజకవర్గాలకు ఒకే రోజున పోలింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. జూన్ 4వ తేదీన ఓట్లను లెక్కిస్తారు. పోలింగ్ గడువు దగ్గర పడుతోండటం అన్ని పార్టీలు ప్రచారంలో పూర్తి దృష్టి సారిస్తున్నాయి. 
 
అధికారాన్ని నిలబెట్టుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్, ఈ ఎన్నికల్లో విజయం సాధించడానికి తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సర్వశక్తులనూ ఒడ్డుతున్నాయి. ఈ నేపథ్యంలో- మెగాస్టార్ చిరంజీవి అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. 
 
ఎన్నికల ప్రచారానికి ఆయన దూరంగా ఉండనున్నారు. అయితే సోషల్ మీడియా వేదికగా అన్నయ్య పవన్‌కు మద్దతు పలికారు. పిఠాపురంలో పవన్ కల్యాణ్‌ను గెలిపించాలంటూ చిరంజీవి వీడియో విడుదల చేశారు. 
 
పిఠాపురం వాసులకు న్యాయం చేయడానికి పవన్ ఎంతవరకైనా వెళ్తాడని, ఎవరితోనైనా కలబడుతాడని అన్నారు. అందుకే గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి, పవన్ కల్యాణ్‌ను గెలిపించాలంటూ మెగాస్టార్ విజ్ఞప్తి చేశారు.
 
అమ్మ కడుపున ఆఖరువాడిగా పుట్టినా, అందరికీ మేలు జరగాలనే విషయంలో ముందువాడిగా ఉంటాడని పవన్ కల్యాణ్‌ను ప్రశంసించారు. అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏదైనా చేయాలని ఎవరైనా అనుకుంటారని, దీనికి భిన్నంగా పవన్ కల్యాణ్.. తన సొంత సంపాదన నుంచి కౌలు రైతుల కన్నీళ్లు తుడిచాడని గుర్తు చేశారు. 
 
సినిమాల్లోకి పవన్ బలవంతంగా వచ్చాడని, రాజకీయాల్లోకి మాత్రం ఇష్టంతోనే వచ్చాడని చిరంజీవి వ్యాఖ్యానించారు. అన్యాయాన్ని ఎదిరించకుండా మౌనంగా ఉండే వాళ్ల వళ్లే ప్రజాస్వామ్యానికి మరింత నష్టం అని పవన్ నమ్మాడని, అందుకే జనం కోసం జనసైనికుడు అయ్యాడని చిరంజీవి వివరించారు.