ఇంటి నుంచే ఓటు వేసేలా..ఈ-ఓట్ యాప్‌కు రూపకల్పన
ఇంటి నుంచే ఓటు వేసేలా ఓటింగ్ విధానంలో సరికొత్త రూపకల్పనల దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంటి నుంచే ఓటు వేసేలా అత్యాధునిక పరిజ్ఞానంతో ఈ-ఓటింగ్ విధానం రూపుదిద్దుకుంటోంది.
మొబైల్‌లో ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని దాని ద్వారా ఓటు వేసే సాంకేతిక ప్రక్రియ సిద్ధమవుతోంది. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ), తెలంగాణ ఐటీ శాఖ,కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఐటీ విభాగం సీడాక్,బొంబాయి ఐఐటీ,భిలాయ్ ఐఐటీల ప్రొఫెసర్ల సంయుక్త కార్యాచరణలో ఈ-ఓటింగ్ యాప్ తయారైంది.
వివిధ ప్రయోగాలు, పరిశీలనల అనంతరం దీనికి తుదిరూపు ఇచ్చారు. అనేక భద్రతా అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ యాప్‌ను రూపొందించారు.
అన్నీ బాగానే ఉన్నాయనుకుంటే ముందుగా రాజకీయ పార్టీలకు దీని గురించి వివరించి అభిప్రాయాలను తెలుసుకుంటారు. కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిస్తారు. మొదట కొన్నిచోట్ల ప్రయోగాత్మకంగా ఉపయోగించి పరిశీలిస్తారు. ఆ తర్వాత తుది ఆమోదం పొందే అవకాశం ఉంటుంది.