సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : బుధవారం, 22 సెప్టెంబరు 2021 (08:38 IST)

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణకు కట్టుబడి వున్నాం: జనసేన

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణకు జనసేన పార్టీ కట్టుబడి ఉందని జనసేన పిఎసి చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. విశాఖ పౌర గ్రంథాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కొన్ని రాజకీయ పార్టీలు తమ రాజకీయ అవసరాల కోసం పాదయాత్రలు చేయడం, ఢిల్లీ వెళ్లి పార్లమెంట్‌లో నాయకులను కలవడం వంటివి చేస్తున్నాయే గానీ, స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణకు మనస్ఫూర్తిగా కృషి చేయడం లేదని ఎద్దేవా చేశారు.

అక్కడ మాట్లాడిన మాటలు వేరు ఇక్కడి ప్రజలకు చెప్పే మాటలు వేరని పేర్కొన్నారు. ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్న స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరిస్తే వారందరికీ అన్యాయం జరుగుతుందని, భావితరాలకు భవిష్యత్తు ఉండదని తెలిపారు.

అందువల్ల దీనిపై పునరాలోచన చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. స్టీల్‌ప్లాంట్‌ను పరిరక్షించే విధంగా స్థానిక నాయకులందరూ కలిసి పోరాడాలన్నారు. వచ్చే నెలలో పవన్‌ కల్యాణ్‌ స్టీల్‌ప్లాంట్‌ను సందర్శించి, ఏ విధంగా ముందుకెళ్లాలో అక్కడ కార్మిక నాయకులతో చర్చించనున్నట్లు చెప్పారు.

రాష్ట్ర ప్రభుత్వం ఎవరి మాటలు వినే స్థితిలో లేదని, తన అనుభవంలో ఇటువంటి పరిణామాలు ఎప్పుడూ చూడలేదని పేర్కొన్నారు. సంక్షేమ పథకాల పేరుతో ప్రజా ధనాన్ని వృథాగా ఖర్చు చేస్తున్నారని, అభివృద్ధి కార్యక్రమాలు జరగడం లేదని అన్నారు. రోడ్లన్నీ అధ్వానంగా ఉన్నాయని తెలిపారు.