శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 17 సెప్టెంబరు 2019 (21:40 IST)

అమరావతిలో ప్యాలెస్ లు కడితే ఒప్పుకోం: టీజీ

‘ప్రతిపక్షనేతగా ఉన్న సమయంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి రాయలసీమ వెనుకబాటుతనంపై పోరాటం చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి ఫలాలను ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం చేయకుండా సీమకు కూడా పంచాలి’ అని రాయలసీమ హక్కుల ఐక్యవేదిక వ్యవస్థాపకుడు, రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్‌ డిమాండ్‌ చేశారు.

అనంతపురంలో జరిగిన రాయలసీమ హక్కుల ఐక్యవేదిక సభలో ఆయన మాట్లాడారు. రాజధాని అమరావతిని ఫ్రీ జోన్‌ చేయాలన్నారు. అభివృద్ధిలో భాగంగా రాష్ట్రంలో రెండు, మూడు రాజధానులు ఏర్పాటు చేయాలన్నారు. అందులో రాయలసీమకు ప్రాధాన్యతనివ్వాలన్నారు. ఏపీలోని తిరుమల తిరుపతి దేవస్థాన కమిటీలో ఇతర ప్రాంతాలకు కూడా ప్రాధాన్యతనిస్తారని, అక్కడ వచ్చే ఆదాయాన్ని రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు కూడా ఖర్చు పెడతారని వివరించారు.

కానీ కోస్తాంధ్రలో ప్రముఖంగా ఉన్న దుర్గమ్మ ఆలయం, సింహాచలం వంటి ఆలయ కమిటీల్లో స్థానికులకే అవకాశాలిస్తారని, రాయలసీమవారికి ఎందుకు అవకాశాలివ్వరని ప్రశ్నించారు. అమరావతిలో హైకోర్టు, అసెంబ్లీ, సెక్రటేరియెట్ లు ఉన్నాయనీ... తాత్కాలిక భవనాలు అంటూ ప్యాలెస్ లు కడితే ఒప్పుకోబోమనీ ఆయన అన్నారు.

అమరావతిలో ప్రస్తుతం ఉన్న భవనాలతోనే పరిపాలన మంచిగా చేయొచ్చనీ, ఇక నుంచి రాయలసీమ అభివృద్దిపై దృష్టి సారించాలనీ ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయంలో తనను ఏమన్నా ఫర్వాలేదు గానీ.. సీమను, సీమలోని ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదన్నారు.