బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 12 జూన్ 2020 (09:38 IST)

వెలుగొండ ప్రాజెక్టును ఏడాదిలో పూర్తిచేస్తాం.. : మంత్రి ఆదిమూలపు సురేష్

వెలిగొండ ప్రాజెక్ట్ నిర్మాణ పనులను ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. ఈ మేరకు సచివాలయం ప్రచార విభాగం ముందున్న పచ్చిక ఆవరణలో మంత్రి మీడియాతో మాట్లాడారు.

గత ఫిబ్రవరిలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రకాశం జిల్లా వరప్రదాయిని, తాగు నీటి జల ప్రదాయిని అయిన వెలుగొండ ప్రాజెక్ట్ ను సందర్శించడం జరిగిందన్నారు. ఆనాడే సమీక్ష నిర్వహించి ప్రాజెక్ట్ నిర్మాణానికి కావాల్సిన విధివిధానాలను రూపొందించడం, సంబంధిత శాఖాధికారులకు దిశా నిర్ధేశం చేయడం జరిగిందన్నారు. 
 
గడచిన 3 నెలల్లో వేగంగా పనులు:
గడిచిన మూడు నెలల కాలంలో వెలిగొండ ప్రాజెక్ట్ పనుల పురోగతి వేగంగా కొనసాగుతుందని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. దీనిపై మంత్రివర్గంలో చర్చించి వెలిగొండ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని త్వరగా పూర్తిచేసేందుకు  నిధుల విడుదలకు ఆమోదం తెలిపిందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం రూ.1411 కోట్ల 56 లక్షల నిధులు కేటాయించడం జరిగిందన్నారు. అందులో రూ.1301 కోట్ల 56 లక్షల నిధులు పునరావాసం కోసం వాడుకోవడం జరుగుతుందన్నారు. భూసేకరణకు సంబంధించి ఈస్ట్రన్ మెయిన్ కెనాల్, తీగలేరు ప్రాంతాలకు మరో రూ.110 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. ప్రధానంగా ప్రాజెక్ట్ ను పూర్తి చేయాలంటే పునరావాసంపై స్పష్టమైన విధానం అవలంభించాలని మంత్రి సూచించారు.

పునరావాస కాలనీల నిర్మాణాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుందని గుర్తుచేశారు. వెలుగొండ ప్రాజెక్ట్ నిర్మాణంలో ఇబ్బందులు అధిగమించేందుకు ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో ముందుకెళుతుందని, ఈ ఏడాది చివరినాటికి పూర్తి చేసేందుకు తగు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. పునరావాస నిర్మాణం, పరిహారంగా ఇచ్చే ప్యాకేజి కింద ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకుందని తెలిపారు.

వన్ టైం సెటిల్ మెంట్ కింద ఒక్కో కుటుంబానికి రూ.12.50 లక్షలు అందించే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ముంపుకు గురై ఆయా గ్రామాల నుంచి బయటకు రావాల్సిన కుటుంబాలు సుమారు 7,555గా గుర్తించడం జరిగిందన్నారు. అందులో సోషియో ఎకనమిక్ సర్వే ప్రకారం 4,617 కుటుంబాలు గుర్తించామన్నారు.

అక్టోబరు 2019లో తమ ప్రభుత్వం వచ్చిన తరువాత, వెలిగొండ ప్రాజెక్ట్ ను వేగవంతం చేసే క్రమంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సర్వేలో 18 ఏళ్లు నిండిన యువతను అదనంగా 2938 మందిని చేర్చుకోవడం జరిగిందన్నారు. అనంతరం మొత్తంగా 7,555 మందిని గుర్తించి, వారికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజిని వర్తించే విధంగా ఈ కేటాయింపులు చేయడం జరిగిందని మంత్రి తెలిపారు.

ఇందులో ప్రధానంగా ఎస్సీ కుటుంబాలకు చెందిన వారు 1184, ఎస్టీ 259, ఇతరులు 3174 మంది అని మొత్తంగా 4617 కాగా అక్టోబరు 2019 నాటికి 18 ఏళ్ళు నిండిన యువత 2938మందితో కలిపి  మొత్తంగా 7,555  మందికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజిని, వన్ టైం సెటిల్ మెంట్ కింద ప్రతీ పిడిఎఫ్ కుటుంబానికి రూ.12.50 లక్షలు, గృహ నిర్మాణం కింద ఒక్కొక్కరికి రూ.4 లక్షలు నిధులు కేటాయించడం జరిగిందని వివరించారు.

ఇవి కాకుండా క్యాష్ కాంపోనెంట్ కింద, వన్ టైం సెటిల్ మెంట్ గా రూ.5 లక్షలు, సస్పెంట్ కింద రూ.36 వేలు, ఎస్సీ, ఎస్టీలకు అదనంగా మరో రూ.50వేలు, రవాణాకు సంబంధించి రూ.50వేలు, వన్ టైమ్ సెటిల్ మెంట్ కింద రూ.50వేలు మొత్తంగా రూ.6.86లక్షలు ఒక్కో కుటుంబానికి కేటాయించడం జరిగిందని తెలిపారు.
 
వెలిగొండ ప్రాజెక్ట్ తో జిల్లా వాసులకు తీరనున్న కష్టాలు:
వెలిగొండ ప్రాజెక్ట్ ను పూర్తి చేయడం ద్వారా ప్రకాశం జిల్లా వాసుల కష్టలు తీరనున్నాయని మంత్రి  ఆదిమూలపు సురేష్ అభిప్రాయపడ్డారు. నల్లమల సాగర్ రిజర్వాయర్ లో నీరు నింపే కార్యక్రమంలో భాగంగా 11గ్రామాలు  ముంపుకు గురవుతున్న పరిస్థితుల్లో 8 కాలనీలకు పునరావాసం కోసం ఎంపిక చేయడం జరిగిందన్నారు.

ఆ కాలనీల్లో కూడా పనులు వేగవంతం చేస్తామన్నారు. సెప్టెంబరు నెల లోపల టెన్నెల్ పనులు పూర్తి అవుతాయని పేర్కొన్నారు. రెగ్యులేటర్ పనులు పూర్తి అవుతున్నాయని తెలిపారు. పునరావాస ప్యాకేజి అందరూ ఆశించిన విధంగానే ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పెద్ద మనసు చేసుకొని నిధులు కేటాయించారన్నారు. గత 13 ఏళ్ళుగా జాప్యం జరుగుతున్న తరుణంలో ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి ప్రకటించడం అనేది నిజంగా గొప్పమలుపు అన్నారు.

ప్రకాశం జిల్లా వాసులు ఏన్నో ఏళ్ళుగా ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయడం కోసం ఆశతో ఎదురు చూస్తున్నారన్నారు. 2006లో అప్పటి దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి పాలనలో వెలుగొండ ప్రాజెక్ట్ కు అంకురార్పణ జరిగిందని గుర్తుచేశారు. టెండర్ల ప్రక్రియ చేపట్టిన తరువాత  శంఖుస్థాపన కార్యక్రమాలు జరిగాయని గుర్తుచేశారు.

2008 నుంచి అక్కడి నిర్వాసితులు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి కోసం ఎదురు చూస్తూ ఉన్నారని ఈ క్రమంలో సుమారు 13 ఏళ్ళు తరువాత ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన ఏడాది కాలంలోనే ఈ నిర్ణయం తీసుకోవడం ఆనందదాయకమన్నారు. ప్రకాశం జిల్లా వాసుల తరుపున సిఎంకు మంత్రి సురేష్  ధన్యవాదాలు తెలిపారు.

ఈ ప్యాకేజిలకు సంబంధించి జీవోలను త్వరలోనే తయారుచేసి విడుదల చేయడం జరుగుతుందన్నారు. దీంతో ఫేజ్ -1 పనులు పూర్తి చేయడంలో ఉన్న ప్రధానమైన అడ్డంకులు తొలుగుతాయన్నారు. సుమారు 1.17లక్షల ఎకరాల ఆయకట్టు సాగుకు, సుమారు 4 లక్షల మందికి తాగునీరు అందించే పనులు కూడా అనుకున్న ప్రకారం జరుగుతాయని మంత్రి ఆశాభావం వ్యక్తంచేశారు.
 
తెలుగు, సంస్కృత అకాడమీ ఏర్పాటుకు కేబినెట్‌ నిర్ణయం:
ఏపీ ఉన్నత విద్యాశాఖ ద్వారా తెలుగు, సంస్కృత అకాడమీ ఏర్పాటుకు కేబినెట్‌ నిర్ణయించిందని మంత్రి తెలిపారు. తిరుపతి కేంద్రంగా పనులు ప్రాంరభించాలని కూడా సిఎం సూచనప్రాయంగా చెప్పినట్లుగా మంత్రి వెల్లడించారు. తెలుగు, సంస్కృత భాషల అభివృద్ధికి, ప్రచారానికి, పుస్తక ముద్రణలతో పాటు అనేక అంశాలు ఈ అకాడమీ ద్వారా చేపట్టనున్నామని వివరించారు. 
 
రామాయపట్నం ఓడరేవు పనులకు నిధులు:
రామాయపట్నం పోర్టు పనులపై కూడా మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగిందని మంత్రి తెలిపారు. సుమారు 3200 ఎకరాలు ఫేజ్-1 కింద సేకరించడం జరుగుతుందన్నారు. సంబంధించన పోర్టుకు సంబంధించిన డిపిఆర్(డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్) కూడా  రైట్స్ సంస్థ తయారు చేసిందన్నారు. రూ. 3736 కోట్లతో తొలిదశ పనులకు సంబంధించి త్వరలో టెండర్లను పిలవడం జరుగుతుందని తెలిపారు. 
 
ఎంసెట్, పదవ తరతగతి, కామన్ ఎంట్రన్స్ పరీక్షలు షెడ్యూల్ అనుకున్న ప్రకారమే నిర్వహించబడతాయని తెలిపారు.