మానవత్వాన్ని మంటగలుపుతోన్న కరనా.. ఇల్లు ఖాళీ చేయాలంటూ..
కరోనా వైరస్ పగబట్టింది. దేశంపై సునామీలా విరుచుకుపడింది. దీంతో లక్షలాది మంది ఈ వైరస్ బారినపడుతున్నారు. ఈ కరోనా వైరస్ మనషుల్లోని మానవత్వాన్ని సైతం మంటగలుపుతోంది. అద్దె ఇళ్లలో ఉంటున్న వారిలో ఎవరికైనా చిన్నపాటి ఆరోగ్య సమస్యలు వచ్చినా.. కరోనా నెపంతో యజమానులు దయాదాక్షిణ్యాలు కూడా మరిచి ఇళ్లను ఖాళీ చేయిస్తున్నారు.
తలదాచుకునేందుకు మాకు మరో అవకాశం కూడా లేదని కాళ్లావేళ్లా పడుతున్నా.. కనికరించడం లేదు. ఇలాంటి ఘటనే పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆకివీడు, పెదపేటలో మంగళవారం జరిగింది. పెదపేటలోని ఓ ఇంట్లో ఏకుల మరియమ్మ(85), ఆమె కుమారుడితో కలిసి అద్దెకు ఉంటున్నారు. మరియమ్మ నాలుగు రోజుల క్రితం అనారోగ్యానికి గురయ్యారు.
ఈ క్రమంలో ప్రభుత్వాస్పత్రిలో చికిత్స చేయించుకున్నారు. ఆమెకు కరోనా పరీక్ష కూడా చేసిన వైద్యులు.. నెగిటివ్ రావడంతో సోమవారం ఇంటికి పంపించారు. అయితే.. ఇంటి యజమాని మాత్రం..నీకు కరోనా లక్షణాలు ఉన్నాయి. మా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని ఆదేశించారు. దీంతో తమకు మరో గత్యంతరం లేదని తల్లీకొడుకులు ప్రాధేయపడ్డారు.
అయినా.. యజమాని కనికరం చూపలేదు. దీంతో వారు.. సమీపంలోని క్రైస్తవ శ్మశానం వాటికకు చేరుకుని, అక్కడి రేకుల షెడ్డులో కాలం గడిపారు. మంగళవారం ఉదయం.. ఈ విషయం సంచలనంగా మారింది. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్‌ఐ వీఎస్ వీరభద్రరావు రంగంలోకి దిగి.. తల్లీ కొడుకులను శ్మశానం నుంచి ఆటోలో తీసుకొచ్చి అద్దెకు ఉంటున్న ఇంటికి తరలించారు. యజమానితో మాట్లాడి అవగాహన కల్పించడంతో తల్లీకొడుకులు ఊరడిల్లారు.