ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 23 ఏప్రియల్ 2021 (22:30 IST)

సంగం డెయిరీ దోపిడీలో చంద్రబాబు వాటా ఎంత?: పొన్నూరు ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య

చంద్ర‌బాబు హ‌యాంలో చిత్తూరు డెయిరీతోపాటు అనేక సహకార సంస్థలు మూసేశారని పొన్నూరు ఎమ్మెల్యే కిలారి వెంక‌ట రోశ‌య్య‌ ఆరోపించారు. ఆయన ఇంకా మాట్లాడుతూ ఇంకా..
 
సంగం డెయిరీలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల న‌రేంద్ర చేస్తున్న అక్రమాలు, ఆయన పాపాల చిట్టా బ‌య‌ట‌ప‌డ‌డంతోనే అరెస్ట్‌ చేయడం జరిగింది, డెయిరీ రైతులను నిలువునా దోపిడీ, దగా, మోసం చేసిన‌ ధూళిపాళ్ల న‌రేంద్ర‌ని అరెస్ట్‌ చేస్తే టీడీపీ నేతలు ఎందుకు గగ్గోలు పెడుతున్నారు? కోఆపరేటివ్ డెయిరీ వ్యవస్ధను తమ సొంత ఆస్తుల్లాగా దోచుకుంటుంటే, రైతులకు చెందాల్సిన లాభాలు నొక్కేసి సొంతానికి వాడుకుంటూ, ట్రస్ట్‌ పేరుతో సొంత ఆస్తులు పెంచుకుని దోపిడీ చేస్తుంటే అరెస్ట్‌ చేస్తే చంద్రబాబు గగ్గోలు పెడుతున్నారు.
 
చంద్రబాబు హయాంలో కోఆపరేటివ్ డెయిరీలను నిర్వీర్యం చేసింది నిజం కాదా? చిత్తూరు డెయిరీకి మూతవేశారు. హెరిటేజ్‌ కోసం చిత్తూరు డెయిరీని మూసివేయలేదా? ఒంగోలు, గుంటూరు, కష్ణా, వైజాగ్‌, మిగిలిన ప్రాంతాలలో బ్రహ్మండంగా పనిచేస్తున్న కోఆపరేటివ్‌ డెయిరీలను టీడీపీ నేతలకు ఆర్థిక‌ వనరులుగా, ఆస్తులు కూడబెట్టుకునే విధంగా మార్చింది నిజం కాదా?  మీరు ఎందుకు గగ్గోలు పెడుతున్నారు? సంగం డెయిరీ అక్రమాల్లో, దోపిడీలో చంద్రబాబు వాటా ఎంత?
 
చంద్రబాబు, లోకేష్ ల‌కు రైతులపై అసలు ప్రేమ ఉందా? మీ హయాంలో రైతులకు ఏం మేలు చేశారు.? నేడు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ గారు రైతుల కోసం అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. వారికి అవసరమైన ప్రతీ విషయంలోనూ తోడుగా, అండ‌గా ఉంటున్నారు. రైతుల‌కు గిట్టుబాటు ధరలు రాకపోతే గిట్టుబాటు ధరలు కల్పించారు. రైతు లాభమే చూడాలి కానీ నష్టం చూడకూడదని సీఎం శ్రీ వైయ‌స్ జ‌గ‌న్ గారు భావించి వారికి ఎన్నో మంచి కార్య‌క్ర‌మాలు చేస్తున్నారు, ఈ రెండేళ్ళలో రూ.15,000కోట్లు రైతులకు కేవ‌లం గిట్టుబాటు ధరల కోసం వెచ్చించారు, అలాగే పాడి పరిశ్రమను ఆదుకునేందుకు అమూల్‌ అనే సహకార సంస్ధ ద్వారా పాల సేకరణ చేస్తూ ఇతర డెయిరీల కన్నా రూ.5 నుంచి 10 అత్యధికంగా చెల్లిస్తున్నారు.
 
సంగం డెయిరీ 1977లో స్ధాపించబడింది. ఆ రోజు కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల‌ రైతులందరూ క‌లిసి ఈ ప్రాంతంలో డెయిరీ కావాలని ఉద్దేశంతో, ఒక రోజు పాలు అన్నీ కూడా ఉచితంగా సేకరించి, ఆ వ‌చ్చిన‌ డబ్బుతో 34 ఎకరాలు కొనుగోలు చేసి సంగం డెయిరీకి డొనేట్‌ చేశారు. దీంతో పాటు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు మరో 53 ఎకరాలు ఇస్తే.. మొత్తం 77 ఎకరాలలో సంగం డెయిరీని నెలకొల్పితే.. దీని మీద దొంగ సర్టిఫికెట్లు పుట్టించి బ్యాంకులో రూ.116 కోట్ల లోన్‌ తీసుకున్నారంటే ఎంత దిగజారిపోయారు, ఎంత దోపిడీ చేస్తున్నారు, దీంట్లో చంద్రబాబు నాయుడు వాటా ఎంత?
 
సంగం డెయిరీ పేరుతో రైతులను నిలువునా మోసం చేస్తున్నారు. దీన్ని రైతులు గమనించాలి. ధూళ‌పాళ్ల నరేంద్ర అరెస్ట్‌ అక్రమమని మాట్లాడుతున్నారు. ఎందుకు అక్రమం? ధూళిపాళ్ల నరేంద్ర తన తండ్రి ధూళిపాళ్ళ వీరయ్య చౌదరి ట్రస్ట్‌ కు10 ఎక‌రాల భూమిని బదలాయించారు. ఇది ఎవరి ఆస్తి? పాల రైతుల ఆస్తి కాదా? ప్రభుత్వానికి తెలియజేయకుండా, ప్రభుత్వం దగ్గర అనుమతి తీసుకోకుండా.. ట్రస్ట్‌కు డొనేట్‌ చేయడం ఎంతవరకు సమంజసం? పాల డెయిరీకి అనుబంధంగా ప్రైవేట్‌ హాస్పిటల్‌ పెట్టి దానికి డైరెక్టర్‌లుగా ధూళిపాళ్ల న‌రేంద్ర‌, ఆయ‌న‌ భార్య, పిల్లలను పెట్టి దానిని వ్యాపార సంస్ధగా క్రియేట్‌ చేశారు. ఇందులో మీ వాటా ఎంత చంద్ర‌బాబు? మీరు రైతులను నిలువునా మోసం చేస్తూ, వచ్చే లాభాలను పక్కదోవ పట్టిస్తున్నారు. సంగం డెయిరీలో వచ్చిన లాభాలతో ఇతర వ్యాపారాలు చేస్తున్నారు. 
 
ఎన్నికల ముందు సంగం డెయిరీ తరపున రూ.6.50 బోనస్‌ రైతులకు ప్రకటించారు. ఇందులో రూపాయిన్నర డీవీసీ ట్రస్ట్‌కు, రూపాయిన్నర ఎలక్షన్‌ చందా, రెండు రూపాయిలు ఏజెంట్లుకు, స్టాఫ్‌కు, చివరికి మిగిలే రూపాయిన్నర రైతులకు.పేపర్లో ప్రకటించేది రూ.6.50 కానీ, రైతుకు ఇచ్చేది రూపాయిన్నర. ఏవిధంగా దోపిడీ చేస్తున్నారో అర్ధమవుతుంది.
 
ప్రభుత్వం ఈ అక్ర‌మాల‌న్నింటిని పరిశీలించి చర్యలు తీసుకుంటుంటే టీడీపీ నాయకులకు ఎందుకు కనిపించదు. చంద్రబాబు హెరిటేజ్‌ కోసం చిత్తూరు డెయిరీని మూసివేసి రైతులను ముంచేసిన సంగతి ప్రజలు ఇంకా మర్చిపోలేదు. చంద్రబాబూ..! మీరు నరేంద్రను కాపాడుతున్నారా? మీ హాయంలో రైతుల కోసం ఏం చేశారో చెప్పలేదు. రైతులకు ఫ‌లానా మేలు చేశానని ధైర్యంగా చెప్పగలరా? సంగం డెయిరీ పేరుతో జరిగిన మోసాలపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటే దానిపై టీడీపీ నేతలు విమర్శలా? 
 
అమూల్‌ అనేది ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన సొసైటీ, అమూల్‌కు, సంగం డెయిరీకి పోలిక ఏంటి? అమూల్‌లో ఓనర్ ఎవ‌రు‌ ఉండరు, రైతులే దాని వాటాదార్లు. వచ్చిన లాభాలు రైతులకు పంచుతారు. అమూల్‌ సంస్థ మూడు జిల్లాలలో పాల సేకరణ మొదలుపెట్టింది, వచ్చిన లాభాలు రైతులకే ఇస్తారు. లాభాలు తీసుకెళ్ళడానికి వీల్లేదనేది ఒప్పందం, ఇదేవిధంగా రైతులకు వచ్చే లాభాలు వారికే చెందాల‌న్న లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది..
 
సంగం డెయిరీ ద్వారా ధూళిపాళ్ళ నరేంద్ర వేల కోట్లు సంపాదించారు. ఇందులోకి ఇంకొకరు ఎవరూ రావడానికి వీల్లేదు అన్నట్టుగా తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడు. అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులకు కనీసం లేబర్‌ చట్టాల ప్రకారం జీతాలు కూడా చెల్లించరు. వారి కనుసన్నలలోనే నడుపుతూ దోపిడీ చేస్తున్నారు. చంద్రబాబు కూడా హెరిటేజ్‌ పేరుతో పాలరైతులను మోసం చేస్తున్నారు. రైతులను ముంచి వీళ్ళు వందల, వేల కోట్లు సంపాదించారు. 2019 ఎన్నికల్లో రైతులు టీడీపీకి తగిన బుద్దిచెప్పినా, చంద్ర‌బాబుకు ఇంకా బుద్దిరాలేదు. ఇది మరవద్దు.  టీడీపీ నేతలు చేస్తున్న తప్పుడు ఆరోపణలు ప్రజలు ఎవరూ నమ్మడం లేదు, రైతులు అన్నీ గమనిస్తున్నారు. ధూళిపాళ్ల నరేంద్ర మీద కఠిన చర్యలు తీసుకోవాలని రైతుల త‌రుపున ప్ర‌భుత్వాన్ని కోరుతున్నాను.
 
సంగం డెయిరీని ప్రైవేట్ సంస్థగా మార్చేటప్పుడు ప్రభుత్వ అనుమతి తీసుకోకుండా, నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కి, ధూళిపాళ్ళ నరేంద్ర ఫోర్జరీ సంతకాలతో అడ్డగోలుగా వ్యవహరించారు. పలు అక్రమాలకు పాల్పడ్డారు. వాటన్నింటిపై నేడు ఏసీబీ విచారణ జరపాలి.