ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: శుక్రవారం, 3 ఆగస్టు 2018 (20:27 IST)

వైసిపి నాయకులకు ఏమైంది? ఒకరేమో బూతులు.. మరొకరేమో వార్నింగ్‌లు..

అధికారులపై వైసిపి నాయకుల వ్యవహరించే తీరు వివాదాస్పదంగా మారుతోంది. వైసిపికి చెందిన ప్రముఖులు తరచూ పోలీసు, ఇతర శాఖల అధికారులపై నోరుపారేసుకోవడం విమర్శల పాలవుతోంది. మొన్నటికి మొన్న కొడాలి నాని వైసిపి కార్యకర్తల జోలికి వస్తే ఎన్నికల తరువాత మీ కథ తేలుస్తాన

అధికారులపై వైసిపి నాయకుల వ్యవహరించే తీరు వివాదాస్పదంగా మారుతోంది. వైసిపికి చెందిన ప్రముఖులు తరచూ పోలీసు, ఇతర శాఖల అధికారులపై నోరుపారేసుకోవడం విమర్శల పాలవుతోంది. మొన్నటికి మొన్న కొడాలి నాని వైసిపి కార్యకర్తల జోలికి వస్తే ఎన్నికల తరువాత మీ కథ తేలుస్తానని మున్సిపల్ అధికారులను హెచ్చరించడం మరువక ముందే తాజాగా నగరి ఎమ్మెల్యే రోజా పోలీసులపై బూతుల వర్షం కురిపించడం, నేడు వైసిపి సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి సిబిఐ అధికారులను ఊరకుక్కలతో పోల్చడం చర్చనీయాంశంగా మారుతోంది. ఎన్నికలు సమీపిస్తున్నవేళ వైసిపి నేతలు ఎందుకు సహనం కోల్పోతున్నారు. అధికార పార్టీ నాయకులను వదిలి అధికారులపై ఎందుకు విరుచుకుపడుతున్నారు.
 
వైసిపి నేతలకు అసలేమైంది. గత కొన్ని రోజులుగా వైసిపి నేతలు తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు. ఏం మాట్లాడుతున్నారో.. ఎవరిని విమర్శిస్తున్నారో తెలియని పరిస్థితుల్లో ఉన్నారా.. అధికార పార్టీ నాయకులతో పాటు అధికారులను టార్గెట్‌గా చేసుకుని మాటల దాడులకు దిగుతున్న వైసిపి నేతల తీరు సర్వత్రా విమర్శల పాలవుతోంది. ప్రధాన ఎన్నికలకు నెలల వ్యవధే ఉన్న నేపథ్యంలో ఆ ఒత్తిడిలో పడి సహనం కోల్పోయి ఇష్టమొచ్చినట్లు వ్యవహరించడం సరికాదన్న వాదన వినిపిస్తోంది. వారం వ్యవధిలో వైసిపికి చెందిన ముగ్గురు కీలక నాయకులు వ్యవహరించిన తీరు సరికాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 
 
కొన్నిరోజుల క్రితం గుడివాడ ఎమ్మెల్యే నాని నాని తాము అధికారంలోకి వస్తే టిడిపికి వత్తాసు పలుకుతున్న అధికారుల సంగతి చూస్తామంటూ హెచ్చరించారు. నాని వ్యవహారశైలిపై అధికారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సంగతి మరువకముందే నగరిలో పోలీసు అధికారులపై బూతుల వర్షం కురిపించారు. అలాగే తిరుపతిలో మీడియా సమావేశంలో మరో నేత భూమన కరుణాకర్ రెడ్డి ఏకంగా సిబిఐ అధికారులు ఊరకుక్కలంటూ కాంగ్రెస్, టిడిపిలు రెచ్చగొడితే తమ నేత జగన్‌ను అరెస్టు చేశారంటూ వ్యాఖ్యానించారు. అయితే వైసిపి నాయకులు వ్యవహరిస్తున్న తీరుపై అధికారులు, ఇతర ఉద్యోగులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విధి నిర్వహణలో భాగంగా తాము వ్యవహరించాల్సి వస్తోందని, రాజకీయాలతో తమకు సంబంధం లేదని వారంటున్నారు. 
 
అయినప్పటికీ తమపై రాజకీయాలు రుద్దడమే కాకుండా అవమానకర పదజాలాన్ని వాడుతూ వైసిపి నేతలు దూషించడం సరికాదంటున్నారు. ఇకనైనా వైసిపి నేతలు తీరు మార్చుకోకపోతే చట్టపరంగా ముందుకు వెళతామని హెచ్చరిస్తున్నారు పోలీసులు, ప్రభుత్వ అధికారులు. అయితే వైసిపి నేతలు ఇలా అధికారులను టార్గెట్ చేసుకోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈమధ్యకాలంలో వైసిపి అధినేత జగన్ అనూహ్యంగా మాట్లాడిన వివాదాస్పద అంశాల ప్రభావం ఆ పార్టీపై తీవ్రంగా పడుతుందోని అంటున్నారు. అందుకే ప్రజల నుంచి పాదయాత్రకు మంచి రెస్పాన్స్ వస్తున్న తరుణంలో చేజేతులారా అధినేత వ్యాఖ్యల వల్ల ఇబ్బందులు వచ్చాయని ఆ పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు. 
 
ఒకవైపు ముంచుకొస్తున్న ఎన్నికలు, మరోవైపు గెలుస్తామో.. లేదోనన్న సందేహాలు. ఇవన్నీ కలిపి వైసిపి నేతలను తీవ్ర ఒత్తిడికి గురిచేస్తున్నాయని భావిస్తున్నారు. దీంతోనే సహనం కోల్పోయి ఎవరిని విమర్శిస్తున్నామో అర్థంకాని స్థితిలో అధికారులను కూడా వదలడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ తీరును వైసిపి నేతలు మార్చుకోకపోతే వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి మరింత ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.