బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 31 జనవరి 2020 (20:41 IST)

అమరావతి రైతులకు వైకాపా ఎంపీ మద్దతు

రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళన చేస్తున్న రైతులకు నరసరావుపేట వైకాపా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు మద్దతు తెలిపారు.

మందడం, వెలగపూడిలో దీక్షా శిబిరాలకు విచ్చేసిన ఎంపీ రైతులకు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రైతులతో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రభుత్వం చర్చలకు పిలిచినప్పుడు వచ్చి మీ అభిప్రాయాలు చెప్పాలని రైతులకు సూచించారు.

భూములు ఇచ్చిన రైతులకు న్యాయం జరగాలని ఆకాంక్షించారు. ఆందోళన చేస్తున్న రైతులు ఆరోగ్యం కాపాడుకోవాలని సూచించారు. సానుకూలంగా సమస్యను పరిష్కరించుకుందామని కోరారు.
 
 ‘‘మీరు వ్యాపారాలు చేస్తే వచ్చిన ఆస్తులు కావు.. తరతరాలుగా వచ్చినవి. తర తరాల నుంచి వచ్చిన ఆస్తులపై రైతులకు భావోద్వేగం ఉంటుంది. రైతుల ఆందోళనను అర్థం చేసుకోగలం.

సీఎం జగన్‌ రైతుల పక్షపాతి. రైతులకు న్యాయం చేసిన తర్వాతే ముందుకు వెళ్తారు. అందరూ సహకరించినందువల్లే వైకాపాకు 151 సీట్లు వచ్చాయి. తప్పకుండా ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తారు. రైతులకు న్యాయం జరిగే ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కావాలని ఆశిద్దాం. రైతులకు న్యాయం చేసే బాధ్యత తీసుకుంటాం’’ అని ఎంపీ వివరించారు.

రైతులకు సంఘీభావం తెలిపిన ఎంపీకి జేఏసీ నేతలు కృతజ్ఞతలు తెలిపారు. రైతుల సమస్యలను సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. తమ సమస్యకు పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేశారు.