గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 22 జనవరి 2020 (08:31 IST)

అమరావతికి కృష్ణాబోర్డ్!

కృష్ణా బోర్డు అమరావతికి తరలిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌, తెలం గాణ రాష్ట్రాలకు చెందిన జలవనరుల శాఖ అధికారులు ఢిల్లిలో భేటీ అయ్యారు. కేంద్ర జల వనరుల శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో వివిధ అంశాలపై చర్చించారు.

కృష్ణా నది బోర్డు, గోదావరి నదీ యాజమాన్య బోర్డు చైర్మన్లతో పాటు కేంద్ర జల సంఘం చైర్మన్‌ కూడా పాల్గొన్న ఈ భేటీలో తెలంగాణాకు చెందిన ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ మురళీధర రావు, ఆంధ్రప్రదేశ్‌ ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ వెంకటేశ్వర రావులు తమ వాదనలను వినిపించారు. కృష్ణా, గోదా వరి నదీ యాజమాన్య బోర్డుల పరిధితో పాటు నిధు లు విడుదలపై చర్చ జరిగింది.

అదే విధంగా గోదావరి నుంచి కృష్ణా నదికి మళ్లించే నీటిలో తెలంగాణా వాటా విషయంపైనా కేంద్ర జల సంఘం చైర్మన్‌ సమక్షంలోనే ఇరు రాష్ట్రాల అధికారులు చర్చించుకున్నారు. ఈ సందర్భంగా కృష్ణానదీ యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని వెంటనే అమరావతికి తరలించాలని ఏపీ జలవనరుల శాఖ అధికారులు పట్టు పట్టారు.

కృష్ణా బోర్డు కార్యాలయ తరలింపుకు కొంత సమయం ఇవ్వాలని తెలంగాణ ఇరిగేషన్‌ అధికారులు సీడబ్ల్యుసీ అధికారులకు విజ్ఞప్తి చేశారు. దీనిపై త్వరలోనే మరోసారి సమావేశం కావాలని ఇరు రాష్ట్రాల అధికారులు నిర్ణయించుకున్నారు.

అయితే పోలవరం ప్రాజెక్ట్‌పై తెలంగాణా రాష్ట్రం కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తోన్న నేపధ్యంలో తాజాగా పోలవరం ప్రాజెక్ట్‌ అథారిటీ (పీపీఏ) సభ్యులు పోలవరం ప్రాజెక్ట్‌ను సందర్శించారు. రాష్ట్రానికి అనుకూలంగా కేంద్ర ప్రభుత్వానికి నివేదిక కూడా ఇచ్చారు.

ఈ నెల 23న మరోసారి ప్రాజెక్ట్‌ విషయంపై చర్చించడానికి పీపీఏ సమావేశం అవ్వనున్నది. మరో 24 గంటల్లో జరిగే పీపీఏ సమావేశానికి ముందు రెండు నదుల యాజమాన్య బోర్డులతో తెలుగు రాష్ట్రాల అధికారులు భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.