జగన్ రెడ్డి గారూ.. నేను మీకు ఒక్కటే చెబుతున్నా: పవన్
అమరావతి: రైతులు, మహిళలపై లాఠీఛార్జ్ కంటతడి పెట్టిస్తోందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని రైతులు పవన్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ... వైసీపీ ఆలోచనా విధానాన్నే పోలీసులు అవలంభిస్తున్నారని, వైసీపీ నేతలు వాడిన పదజాలం బాధాకరమని చెప్పారు. ఆడపడుచులు రోడ్డుపైకి వచ్చి పోరాడుతుంటే పాశవికంగా దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
‘జగన్ రెడ్డి గారూ.. మీకు ఒక్కటే చెబుతున్నా.. వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చేవరకు జనసేన నిద్రపోదు’ అని పవన్ హెచ్చరించారు. ఆడపడుచులపై పోలీసుల దాడిని మర్చిపోనని పవన్ హెచ్చరించారు. దివ్యాంగులన్న కనికరం కూడా లేకుండా లాఠీచార్జ్ చేశారని, ఒళ్లంతా మదమెక్కితేనే ఇలాంటి పనులు చేస్తారని జనసేనాని వ్యాఖ్యానించారు. వైసీపీ వ్యక్తిత్వం, రౌడీ సంస్కృతి, ఫ్యాక్షనిస్టు సంస్కృతి అని... ప్రజలపై చూపుతారని మొదటి నుంచీ చెబుతున్నానని పవన్ గుర్తుచేశారు.
రాజధానిపై సమష్టిగా నిర్ణయం తీసుకున్నప్పుడు.. తర్వాత ప్రభుత్వం పాటించి తీరాలని పవన్ కల్యాణ్ తేల్చిచెప్పారు. ఒక సామాజికవర్గం అని, ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందన్న నెపంతో.. ఇన్ని కులాలను, ఇంత మందిని క్షోభపెట్టారని పవన్ మండిపడ్డారు. వైసీపీ వినాశనం మొదలైందని, భవిష్యత్‌లో వైసీపీ ఉండకూడదని ఆయన పిలుపునిచ్చారు.
3 పంటలు పండే పొలాలను రాజధాని కోసం త్యాగం చేశారని, ఇక్కడి నుంచి అమరావతి కదలదని పవన్ కల్యాణ్ రైతులకు హామీ ఇచ్చారు. శాశ్వత రాజధాని అమరావతిలోనే ఉండాలని, నమ్మి ఓట్లు వేస్తే వైసీపీ వంచన చేస్తోందని జనసేన అధినేత విమర్శించారు. ఇన్‌సైడర్ ట్రేడింగ్ చేసిన వాళ్లపై కేసులు పెట్టండి కానీ రాజధానిని తరలించడమేంటని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.