శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 22 జనవరి 2020 (12:59 IST)

లేకపోతే ఏంటి అధ్యక్షా.. పది మంది సభ్యులున్నారు.. వీధి రౌడీల్లా ఉన్నారు: సీఎం జగన్

రైతు భరోసా కేంద్రాలపై సభలో చర్చ కొనసాగుతుండగా, స్పీకర్‌ పోడియమ్‌ చుట్టుముట్టిన టీడీపీ సభ్యులు. వారంతా తమ తమ స్థానాల్లో కూర్చోవాలని స్పీకర్‌ పదే పదే విజ్ఞప్తి చేసినా వెనక్కి తగ్గని విపక్ష సభ్యులు.. ఒక దశలో ఆయనపైకి దూసుకుపోయే ప్రయత్నం చేశారు. దీంతో సభలో తీవ్ర గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఈ దశలో జోక్యం చేసుకున్న సభా నాయకుడు, ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌మోహన్‌ రెడ్డి ఈ తరహా చర్యలు సరి కాదని స్పష్టంచేశారు. ఇలాంటి ఘటనలు జరగకుండా స్పీకర్‌ కఠినంగా వ్యవహరించాలని ఆయన కోరారు.
 
'అసలు పోడియం మెట్లు పైకెక్కి స్పీకర్‌ ఛైర్‌ పక్కనే కూర్చుని.. ఇంతటి దారుణంగా డెమోక్రసీని అపహాస్యం చేస్తున్న పరిస్థితి. మొత్తం కలిపి 10 మంది లేరు అక్కడ. ఇక్కడ 151 మంది ఉన్నారు. అయినా కూడా ఈ 151 మంది ఎంతో ఓపికగా ఇక్కడే కూర్చుని వింటున్నారు. కానీ అక్కడ వాళ్లు ఏ రకమైన కామెంట్స్‌ పాస్‌ చేస్తున్నారు. పూర్తిగా పోడియం మీదకు వచ్చారు. స్పీకర్‌ ఛైర్‌ చుట్టూ గుమిగూడారు. స్పీకర్‌ను అగౌరవ పరుస్తున్నారు. అలా అగౌరవ పర్చడమే కాకుండా, అక్కడ నుంచి ఏ రకమైన రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారు.. అంత దారుణంగా రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతుంటే ఇటు వైపున కూర్చున్న సభ్యులందరికీ కూడా రెచ్చిపోయే పరిస్థితులు లేకుండా ఎలా ఉంటాయి? అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను'.
 
'నేను ఇప్పటికైనా ఒక్కటే తెలియజేస్తున్నాను. సంస్కారం లేని ఇటువంటి వ్యక్తులు, అసలు వీరు అక్కడ ఎందుకు ఉన్నారో వీళ్లకే తెలియదు. అసెంబ్లీకి ఎందుకు వస్తున్నారో వీళ్లకే తెలియదు. ప్రజల సమస్యల మీద డిస్కషన్‌ జరుగుతా ఉన్న నేపథ్యంలో.. వీళ్లకు చేతనైతే సలహాలు ఇవ్వాలి. అలా చేత కాకపోతే అసెంబ్లీకి రాకుండా బయటే ఉండాలి. కానీ ఇలా వచ్చి మీ చుట్టూ గుమిగూడి అక్కడి నుంచి రెచ్చగొట్టే కామెంట్లు చేసి.. వాటికి మా సభ్యులు ఎవరైనా రెచ్చిపోయి 10 మంది మీద దాడి చేస్తే, దాడి చేశారూ అని చెప్పి దాన్ని కూడా వాళ్లకు అనుకూల మీడియాలో వక్రీకరించుకుని దాంతో కూడా రాజకీయ లబ్ధి పొందాలని అని చెప్పి దిక్కుమాలిన ఆలోచన చేసే దిక్కుమాలిన ఎమ్మెల్యేలు, దిక్కుమాలిన పార్టీ అధ్యక్షా ఇది'.
 
'అధ్యక్షా నేను ఇప్పటికైనా ఒకటే చెబుతున్నాను. ఆ మెట్ల దగ్గరే.. ఆ రింగ్‌ దాటి ఎవరైనా ఇక్కడికి లోపలికి వస్తే.. మార్షల్స్‌ను మొత్తం అక్కడే పెట్టండి. రింగ్‌ దాటి ఎవరైనా వస్తే,  రింగ్‌ దాటి వస్తే, మార్షల్స్‌ వాళ్లను అటు నుంచి అటే ఎత్తుకుని బయటకు తీసుకుని పోయే ఏర్పాటు చేయకపోతే, ఈ సభలో ప్రజా సమస్యలకు విలువనిచ్చే పరిస్థితి కూడా ఉండదు. వెంటనే మార్షల్స్‌ను పిలవండి. అక్కడ పూర్తిగా రింగ్‌ ఫామ్‌ చేయమని చెప్పండి. వాళ్లు ఎవరైనా వస్తే వాళ్లను అక్కడి నుంచి అటే ఎత్తుకుపొమ్మని చెప్పండి'.
 
'లేకపోతే ఏమిటిది అధ్యక్షా.. 10 మంది ఉన్నారు. రౌడీల్లా వ్యవహరిస్తున్నారు. వీధి రౌడీలు కూడా వీళ్ల కన్నా బెటర్‌. అంత దారుణంగా వ్యవహరిస్తున్నారు. నిజంగా ఒక వ్యవస్థ అనేది నిలబడాలంటే, వీధి రౌడీలు ఎక్కడైనా కనిపిస్తే, వారిని ఏరివేయకపోతే వ్యవస్థ బాగుపడదు. దయచేసి వెంటనే మార్షల్స్‌ను పిలిపించండి'.