ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్

మరో 15 రోజుల్లో వివాహం.. కబళించిన రోడ్డు ప్రమాదం

road accident
కాకినాడ జిల్లాలో దారుణం జరిగింది. మరో 15 రోజుల్లో పెళ్లి పీటలపై కూర్చోవాల్సిన ఓ యువజంటను రోడ్డు ప్రమాదం కబళించింది. జిల్లాలోని జగ్గంపేట మండలం, జె.కొత్తూరుకు చెందిన మానేపల్లి రాజకుమార్ (25) అనే యువకుడికి కిర్లంపూడి మండలం సోమవారానికి చెందిన మలిరెడ్డి దుర్గాభవాని (18)కి వచ్చే నెల పదో తేదీన వివాహం చేయాలని పెద్దలు నిశ్చయించారు. వీరికి ఇటీవలే నిశ్చితార్థం కూడా జరిగింది. 
 
మంగళవారం వారిద్దరూ కలిసి తూర్పుగోదావరి జిల్లా గౌరీపట్నం మేరీమాత ఆలయానికి ద్విచక్రవాహనంపై బయలుదేరారు. మార్గమధ్యంలో వెనుక నుంచి వచ్చిన ఓ లారీ వారిని ఢీకొట్టడంతో ఇద్దరూ అక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకుని రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.