మేనమామతో నిశ్చితార్థం.. మరో యువకుడితో జంప్.. వాట్సాప్‌లో తల్లికి ఫోటోలు
మేనకోడలితో అతనికి నిశ్చితార్థం జరిగింది. నిశ్చితార్థం సమయంలో చక్కగానే ఉన్న యువతి రేపో మాపో పెళ్లనగా ప్లేటు ఫిరాయించింది. ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. దీంతో నిశ్చితార్థం కుదుర్చుకున్న వ్యక్తి షాక్ తినక తప్పలేదు.
వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం కందులవారిపల్లె పంచాయతీ పరిధిలోని నారావారిపల్లెకు చెందిన యువకుడికి.. తమిళనాడు రాష్ట్రంలోని పరదామిలో ఉంటున్న తన అక్క కుమార్తెతో వివాహం నిశ్చయమైంది. ఈ క్రమంలో ఇద్దరికీ గతనెల 5వ తేదీన నిశ్చితార్థం చేశారు. ఎంగేజ్ మెంట్ రోజు ఎలాంటి అభ్యంతరం చెప్పని యువతి.. ఆ ఫంక్షన్లో సంతోషంగానే గడిపింది. నవ్వుతూ మేనమామతో రింగ్ తొడిగించుకుంది.
కానీ నెలరోజులు తిరిగేసరికి అసలు విషయం బయటపడింది. వారం రోజుల క్రితం పరదామి నుంచి నారావారి పల్లె వచ్చిన యువతి.. రెండురోజుల క్రితం కనిపించకుండా పోయింది. దీంతో కంగారుపడిన కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించారు. పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. కానీ అందరికీ షాకిచ్చిన ఆ యువతి.. చిత్తూరుకు చెందిన ఓ యువకుడితో వెళ్లిపోయింది. అతడ్ని ప్రేమించానని.. పెళ్లి కూడా చేసుకున్నానంటూ.. ఆ ఫోటోలను తన తల్లికి వాట్సాప్ చేసింది.
ఐతే కుమార్తె చేసిన పనికి ఐంగ్రహించిన తల్లిదండ్రులు.. యువకుడు బలవంతంగా తమ కుమార్తెను కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ ప్రేమజంటను తీసుకొచ్చే పనిలో ఉన్నారు. మరోవైపు నిశ్చితార్థం చేసుకొని వెళ్లిపోయిన యువతితో తనకు పెళ్లొద్దని.. యువకుడు చెప్తున్నట్లు తెలుస్తోంది.