గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 6 ఏప్రియల్ 2021 (10:07 IST)

బిడ్డా... బాబాయ్‌ను ఎవరు చంపారో నిగ్గుతేల్చు : వైఎస్. విజయలక్ష్మి

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇపుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో బీజేపీ - జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి రత్నప్రభకు మద్దతుగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల ఎన్నికల ప్రచారం చేశారు. 
 
ఈ సందర్భంగా ఆయన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు అంశాన్ని ప్రస్తావించారు. వివేకానందరెడ్డి హత్యకు గురైతే ఇప్పటివరకు ఎవరు చంపారో తెలియకపోవడం విచారకరమని విమర్శించారు. అలాగే, కోడికత్తి కేసు కూడా ఏమైందంటూ ఆయన నిలదీశారు. 
 
ఈ పరిస్థితుల్లో పవన్ వ్యాఖ్యలపై వైఎస్ విజయలక్ష్మి ఐదు పేజీల బహిరంగ లేఖ రాశారు. సీబీఐ విచారణ కేంద్ర ప్రభుత్వానిదని, పవన్‌ విమర్శలు అర్ధరహితమని లేఖలో విజయలక్ష్మి కొట్టిపారేశారు. వైఎస్ వివేకాను ఎవరు చంపారో నిగ్గు తేల్చాల్సిందేనని ఆమె కోరారు. 
 
మరోవైపు, వైఎస్. వివేకానంద రెడ్డి హత్యకేసులో జరుగుతున్న విచారణపై ఆయన కుమార్తె సునీతారెడ్డి తీవ్ర మనోవేదన చెందుతున్నారు. హత్య జరిగి రెండేళ్లు దాటినా ఇంతవరకు హంతకులను పట్టుకోలేదని వాపోయారు. ఈ విషయంపై ఆమె నేరుగా ఢిల్లీలోని సీబీఐ కార్యాలయానికి వెళ్లారు. వివేకా హత్య కేసులో కుటుంబ సభ్యుల్లో కొందరిపై అనుమానాలు ఉన్నాయని తెలిపారు. 
 
వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డి పేర్లను కూడా.. తాను హైకోర్టులో వేసిన పిటిషన్‌లో పేర్కొన్నానని తెలిపారు. వైఎస్ షర్మిల మద్దతు తమకు ఉందని ప్రకటించారు. అంతేకాదు కుటుంబ సభ్యుల్లో కొందరి మద్దతు కూడా తమకుందని పేర్కొన్నారు. జగన్‌ సీఎంగా ఉన్నా కేసు ఎందుకు ముందుకెళ్లడం లేదో.. ఆయన్నే అడిగితే బాగుంటుందని సునీతారెడ్డి చెప్పారు.