సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 24 ఫిబ్రవరి 2021 (20:04 IST)

ఆ నాలుగు తప్ప అన్నింటినీ ప్రైవేట్ పరం చేస్తామన్న మోదీ, 'ఉక్కు' హుళక్కేనా?

ఇటీవలి కాలంలో పలు ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్ పరం చేయాలన్న ప్రతిపాదనలను కేంద్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేసారు. ఎన్నో ఏళ్లుగా వారసత్వంగా వస్తున్నాయన్న ఒకే ఒక్క కారణంతో ప్రభుత్వరంగ సంస్థలను ప్రభుత్వం నడపలేదని తేల్చి చెప్పారు.
 
పీకల్లోతు నష్టాల్లో వున్న అనేక ప్రభుత్వరంగ సంస్థలను ప్రజాధనంతో నడుపుతున్నట్లు వెల్లడించారు. ఈ సంస్థల ద్వారా ప్రభుత్వం వ్యాపారం చేయాల్సిన అవసరం లేదన్నారు. అందువల్ల ప్రైవేటికరించాలని నిర్ణయించినట్లు చెప్పారు. దీపమ్ ఆధ్వర్యంలో ప్రైవేటీకరణ అనే అంశంపై చేపట్టిన వెబినార్ లో ప్రధాని ఈ మేరకు వ్యాఖ్యానించారు.
 
నాలుగు వ్యూహాత్మక రంగాలు మినహా అన్నింటినీ ప్రైవేట్ పరం చేయనున్నట్లు కుండబద్ధలు కొట్టినట్లు చెప్పారు. ఆ ప్రకారం చూస్తే విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేట్ పరం అవడం ఖాయమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లేదంటే ప్రధాని చెప్పినట్లు నాలుగు వ్యూహాత్మక రంగాల్లో ఇది కూడా వుందా అనేది వేచి చూడాల్సిందే.