శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 15 నవంబరు 2019 (18:41 IST)

లబ్దిదారుల గుర్తింపునకు 'వైఎస్ఆర్ నవశకం'

రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమానికి నవరత్నాల్లో భాగంగా ప్రవేశపెట్టి అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు సాచ్యురేషన్ విధానంలో అర్హులైన ప్రతి లబ్దిదారునికి అందేలా ఆయా పథకాలకు లబ్దిదారుల గుర్తింపునకై వైఎస్ఆర్ నవశకం పేరిట ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహించనున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని వెల్లడించారు.

ఈ మేరకు శుక్రవారం అమరావతి సచివాలయం నుండి జిల్లా కలెక్టర్లతో ఈ అంశంపై వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ ఈ నెల 20వ తేదీ నుండి డిశంబరు 20వ తేదీ వరకూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక సర్వే క్యాంపెయిన్‌ను చేపట్టడం జరుగుతుందని తెలిపారు.

ఈ నెల రోజుల క్యాంపెయిన్ లో భాగంగా గ్రామ,వార్డు వాలంటీర్లు వారి పరిధిలోని ప్రతి ఇంటికీ వెళ్ళి ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించిన లబ్దిదారుల గుర్తింపు ప్రక్రియ కింద సర్వే చేపట్టి రోజువారీ సర్వే వివరాలను గ్రామ,వార్డు సచివాలయాలకు అందజేయాలని స్పష్టం చేశారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాలు సాట్యురేషన్ విధానంలో అర్హుడైన ప్రతి వ్యక్తికి అందించాలన్నదే ఈసర్వే లక్ష్యమని సిఎస్ స్పష్టం చేశారు. ఈనెల రోజుల కాలంలో ప్రతి గ్రామ వాలంటీర్ వారి పరిధిలో ప్రతిరోజు కనీసం 5 ఇళ్లు, వార్డు వాలంటీర్లు రోజుకు 10 ఇళ్ళకు మించకుండా సందర్శించి వివిధ పథకాలకు లబ్దిదారుల గుర్తింపునకై నిర్ధిష్ట ప్రిపాపులేటెడ్ డేటాసీట్ సర్వే ఫార్మ్ లో సర్వే చేయాల్సి ఉంటుందని చెప్పారు.

వారికి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు సహకారం అందించి రోజువారీగా వాలంటీర్ల నుండి సర్వే డేటా సేకరించి ఎండిఓలు, మున్సిపల్ కమీషనర్లకు సమర్పించాలని ఆదేశించారు. ఎండిఓలు, మున్సిపల్ కమీషనర్లు వారి పరిధిలోని వాలంటీర్లు ప్రతి ఇంటినీ సర్వే చేసే విధంగా చర్యలు తీసుకోవడంతోపాటు ఈ సర్వే ప్రక్రియ సక్రమంగా జరిగేలా పర్యవేక్షణ చేయాలని సిఎస్ ఆదేశించారు.

అంతేగాక సేకరించిన డేటాను గ్రామ/వార్డు సచివాలయం స్థాయిలోను లేదా మండల, మున్సిపల్ స్థాయిలోగాని సకాలంలో కంప్యూటరీకరించేందుకు ఎండిఓలు, మున్సిపల్ కమీషనర్లు చర్యలు తీసుకునేలా కలెక్టర్లు తగిన ఆదేశాలు జారీ చేయాలని చెప్పారు.

ముఖ్యంగా నూతన బియ్యం కార్డు, వైయస్సార్ పెన్షన్ కానుక కార్డు, వైయస్సార్ ఆరోగ్య శ్రీ కార్డు, జగనన్న విద్యా దీవెన మరియు జగనన్న వసతి దీవెన కార్డుల పంపిణీకి లబ్దిదారుల గుర్తింపునకై ప్రతి ఇంటికీ వెళ్ళి అర్హులైన లబ్దిదారులను గుర్తించాల్సి ఉందని సిఎస్ నీలం సాహ్ని పేర్కొన్నారు.

అలాగే ఏడు ఇతర సంక్షేమ పథకాలైన వైయస్సార్ మత్స్యకార భరోసా, వైయస్సార్ నేతన్ననేస్తం, వైయస్సార్ సున్నా వడ్డీ పథకం, అమ్మఒడి, ట్రైలర్లు, రజకులు, నాయీ బ్రాహ్మణుల షాపులు, వైయస్సార్ కాపు నేస్తం, ఇమామ్స్, మౌజంలు, పాస్టర్లు, అర్చకులకు సంబంధించిన లబ్దిదారులను గుర్తించేందుకు ప్రత్యేక సర్వే క్యాంపెయిన్లో చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు.

అయితే వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం, వైఎస్ఆర్ నేతన్న నేస్తం, ఇమామ్స్, మౌజంలు, పాస్టర్లు, అర్చకులకు గౌరవవేతనానికి సంబంధించి ఇప్పటికే సంబంధిత శాఖల వద్ద అవసరమైన డేటా అందుబాటులో ఉన్నందున వాటిపై సర్వే నిర్వహించాల్సిన అవసరం లేదని సిఎస్ కలెక్టర్లకు స్పష్టం చేశారు. 

జిల్లా స్థాయిలో జిల్లా రిసోర్సు పర్సన్లను ఏర్పాటు చేసి వారి ద్వారా మండల, మున్సిపల్ స్థాయి రిసోర్సు పర్శన్లకు శిక్షణ ఇచ్చేలా మరలా వారు గ్రామ, వార్డు వాలంటీర్లకు శిక్షణ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని సిఎస్ నీలం సాహ్ని కలెక్టర్లను ఆదేశించారు.

అంతేగాక మండల,మున్సిపల్ స్థాయి రిసోర్సు పర్సన్లకు ఒక రోజు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పారు. వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులతో సూపర్ వైజరీ బృందాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నెలరోజుల్లో సర్వే ప్రక్రియ పూర్తయ్యాక ఎండిఓలు, మున్సిపల్ కమీషనర్లు శాఖలవారీ, పథకాల వారీగా ముసాయిదా లబ్దిదారుల జాబితాను రూపొందించి గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆ జాబితాను ప్రదర్శించాలని చెప్పారు.

వాటిపై 3 రోజుల్లోగా అభ్యంతరాలుంటే స్వీకరించి తదుపరి ఎండిఓలు, మున్సిపల్ కమీషనర్లు గ్రామ,వార్డు సభలు నిర్వహించి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి అర్హులైన లబ్దిదారుల తుది జాబితాను రూపొందించి శాశ్వత సోషల్ ఆడిట్ కింద తుది జాబితాను ఆయా గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించి ఉంచాలని సిఎస్ నీలం సాహ్ని పేర్కొన్నారు.

వీడియో సమావేశంలో ఆయా శాఖలకు సంబంధించిన పథకాలకు లబ్దిదారుల గుర్తింపునకు సంబంధించిన అర్హతలు ఇతర మార్గదర్శకాల గురించి ఆయా శాఖల కార్యదర్శులు వివరించారు. వీడియో సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మరియు సిసిఎల్ఏ నీరబ్‌కుమార్ ప్రసాద్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికల వలవన్, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, తదితర అధికారులు పాల్గొన్నారు.