శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 30 జనవరి 2021 (14:58 IST)

నిమ్మగడ్డే లక్ష్యంగా వైకాపా మంత్రులు : సభా హక్కుల నోటీసు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనరు నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను లక్ష్యంగా చేసుకుని వైకాపా మంత్రులు సరికొత్త ఎత్తులు వేస్తున్నారు. తాజాగా ఎన్నికల కమిషనర్‌పై ప్రభుత్వం సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చింది.
 
నిమ్మగడ్డ రమేష్ కుమార్‌పై మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ శాసన సభ స్పీకర్‌ కార్యాలయంలో నోటీసులు ఇచ్చారు. ఎన్నికల కమిషనర్ తన పరిధి దాటి తమపై వ్యాఖ్యలు చేశారని, ఆయన వ్యవహార శైలి అభ్యంతరకరంగా ఉందంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. 
 
ఇక వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి కూడా పార్లమెంట్‌లో నిమ్మగడ్డ రమేష్ కుమార్‌పై సభా హక్కుల నోటీసు ఇచ్చే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
 
మరోవైపు, నిమ్మగడ్డ రమేష్ చార్ దిన్ కా సుల్తాన్ అని ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి ఎద్దేవ చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి లబ్ధి చేకూర్చడానికి ప్రభుత్వ అధికారులను ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
అధికారుల అంతు చూస్తాం, కఠిన చర్యలు తీసుకుంటామనే రీతిలో ఎస్ఈసీ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పదవీ విరమణ అనంతరం నిమ్మగడ్డ బతుకు బజారు పాలేనని ఎద్దేవా చేశారు. పదవీ విరమణ తర్వాత ఆయనను ఎవరూ పట్టించుకోరని సంచలన వ్యాఖ్యలు చేశారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ చర్యలకు సిఫారసు చేసినా ప్రభుత్వం అంగీకరించదని చెప్పారు. టీడీపీ నేత కాలవ శ్రీనివాసులు జాగ్రత్తగా మాట్లాడాలని రామచంద్రారెడ్డి హెచ్చరించారు.