తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కూడా వారసులొచ్చారు. తండ్రి, తాతలు, ఇతర రక్తసంబంధీకుల అండదండలతో బరిలోకి దిగుతున్నారు. ఈసారి జరగబోయే ఎన్నికల్లో యువరక్తం ఉరకలేస్తోంది. రాజకీయ అరంగేట్రం చేస్తున్న యువతరం... సరికొత్త రాజకీయాలను ఆవిష్కరిస్తామంటోంది. కానీ అది వారసత్వ రాజకీయం కావడమే ప్రజలకు కొత్త అనుమానాలు పుట్టిస్తోంది. కొత్త సీసాలో పాత సారాలాగానే వీరి వైఖరి ఉంటుందా అనే సందేహం ఇప్పటి నుంచే ఉత్పన్నమవుతోంది. ఏమైనా రాజకీయాలను శాసించిన కుటుంబాల నుంచి వారి ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు.
తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో 11 మంది వారసులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వారసత్వంతో ఇప్పటికే రాజకీయాలను శాసిస్తున్న నాయకులు కొందరైతే. ఇప్పుడిప్పుడే రాజకీయాల్లోకి వస్తున్న వారు మరికొందరు. అలాంటి వారిలో గోడం నగేశ్. ఆదిలాబాద్ ఎంపీగా పోటీ చేస్తున్న నగేష్ తండ్ర రామారావు. బోథ్ మాజీ ఎమ్మెల్యే. రామారావు వారసుడిగా రాజకీయాల్లో దిగిన నగేశ్‌కు బోథ్ ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రి వర్గంలో మంత్రిగా, ఆదిలాబాద్ ఎంపీగా పనిచేసిన అనుభవం ఉంది.
కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ మాజీ మాజీ జాతీయ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ కుమార్తె బంగారు శ్రుతి. నాగర్‌కర్నూల్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఈమె బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శిగా కూడా కొనసాగుతున్నారు.
మహబూబ్‌నగర్ ఎంపీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఫైర్ బ్రాండ్ డీకే అరుణ బరిలోకి దిగారు. ఈమె తండ్రి మాజీ ఎమ్మెల్యే చిట్టెం నరసింహారెడ్డి. ఆమె సోదరుడు చిట్టెం రామ్మోహన్‌రెడ్డి ప్రస్తుతం మక్తల్ ఎమ్మెల్యే. గద్వాల ఎమ్మెల్యేగా అరుణ 2004, 2009, 2014 ఎన్నికల్లో గెలుపొందారు.
మాజీ మంత్రి, పీపీసీ మాజీ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ కుమారుడు ధర్మపురి అరవింద్. నిజామాబాద్ లోక్‌సభ బీజేపీ అభ్యర్థి. ఈయన తండ్రి డి.శ్రీనివాస్ మూడుసార్లు ఎమ్మెల్యేగా, వైఎస్సార్ హయాంలో మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు.
మహబూబాబాద్(ఎస్టీ) నియోజకవర్గం టీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్న మాలోతు కవిత.. డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ కుమార్తె. ఈమె 2009లో కాంగ్రెస్ తరుపున పోటీ చేసి మహబూబాబాద్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇప్పుడు టీఆర్ఎస్ నుంచి మహబూబాబాద్ ఎంపీగా పోటీలో ఉన్నారు.
చేవెళ్ల ఎంపీగా కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్న కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఉమ్మడి రాష్ట్ర ఉప ముఖ్యమత్రి కొండా వెంకటరంగారెడ్డి మనవడు. ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి మంత్రివర్గంలో రెవెన్యూ మంత్రిగా పనిచేసిన వెంకటరంగారెడ్డి 1961లో ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈయన పేరుపైనే రంగారెడ్డి జిల్లాను ఏర్పాటు చేశారు.
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు తలసాని సాయికిరణ్. సనత్‌నగర్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న తలసాని శ్రీనివాసయాదవ్ కేసీఆర్ మంత్రివర్గంలో రెండోసారి మంత్రిగా కొనసాగుతున్నారు. సాయికిరణ్ సికింద్రాబాద్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు.
మల్కాజిగిరి లోక్‌సభ స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా మర్రి రాజశేఖర్‌రెడ్డి పోటీ చేస్తున్నారు. తెలంగాణ మంత్రి సి.హెచ్.మల్లారెడ్డికి అల్లుడు. మల్కాజిరిగి లోక్‌సభ స్థానం నుంచే 2014లో టీడీపీ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచిన మల్లారెడ్డి గత శాసనసభ ఎన్నికల్లో మేడ్చల్ ఎమ్మెల్యేగా విజయం సాధించి కేసీఆర్ కేబినెట్‌లో మంత్రి అయ్యారు.
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా జనార్దన్‌రెడ్డి బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఈయన కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయకు వియ్యంకుడు. గత లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహించిన బండారు దత్తాత్రేయ ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు.
నాగర్‌కర్నూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా మల్లు రవి పోటీ చేస్తున్నారు. ఈయన సోదరుడు మల్లు భట్టి విక్రమార్క కాంగ్రెస్ శాసనసభాపక్ష నేతగా ఉన్నారు. మల్లు రవి గత ఎన్నికల్లో జడ్చర్ల ఎమ్మెల్యేగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు.