శనివారం, 9 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : బుధవారం, 15 సెప్టెంబరు 2021 (07:50 IST)

నకిలీ స్టిక్కర్లతో పట్టుబడ్డ 138 మంది వాహనదారులు

తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ఆదేశాలకు అనుగుణంగా నిన్న జిల్లా వ్యాప్తంగా వాహనాలపై పోలీసు, ప్రెస్, ఇతర శాఖల స్టిక్కర్లతో తిరుగుతున్న వాహనాలపై దృష్టి  సారించి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. 
 
పోలీసుల తనిఖీలలో రోడ్లపై తిరిగే అనేక వాహనాలకు ప్రెస్, పోలీస్, ఆర్మీ, డిఫెన్స్, గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ల  స్టిక్కర్లు పెట్టుకుని వెళుతుండడం గమనించడం జరిగిందని, నకిలీ స్టిక్కర్లు సృష్టించుకుని వాటిని వాహనాలకు అంటించుకుని రోడ్లపై తిరుగుతున్నారని, ఇలాంటి నకిలీ స్టిక్కర్ల పై దృష్టి పెట్టేందుకు  తూర్పుగోదావరి జిల్లా పోలీసు శాఖ జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి, తనిఖీలు చేపట్టడం జరిగిందని ఎస్పీ తెలియజేసారు. 
 
ఈ డ్రైవ్ ను ప్రాధమికంగా ముందస్తు హెచ్చరికలు చేస్తూ నిర్వహించి, తదుపరి అనగా రెండవ సారి చిక్కితే చట్ట ప్రకారం కేసులు నమోదు చేయనున్నట్లు తెలియజేసారు.
 
 
ఈ సందర్భంగా 13.09.2021 తేదిన నిర్వహించిన తనిఖీల్లో నకిలీ స్టిక్కర్లు గల పోలీస్ డిపార్టుమెంట్ తో సంబంధం లేని 76,ప్రెస్,మీడియాతో సంబంధం లేని 62 మొత్తం 138 మందిని గుర్తించి వారికీ కౌన్సిలింగ్ నిర్వహించి, వాహనాలకు ఉన్న స్టిక్కర్లు తొలగించటం జరిగిందని తెలియజేసారు. 
 
ఇకపై వాహనాలపై ఎలాంటి నకిలీ స్టిక్కర్లు కనిపించినా కఠిన చర్యలు తీసుకుంటామని, స్పష్టం చేస్తూ, జిల్లా పోలీసు శాఖ ద్వారా ఇకపై ఇలాంటి స్పెషల్ డ్రైవ్‌లు తరచూ కొనసాగుతాయని,  ట్రాఫిక్ రూల్స్ పాటించనివారిపై చట్ట పరంగా చర్యలు తిసుకో బడతాయని ఎస్పీ తెలియజేసారు.