శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 21 నవంబరు 2019 (08:32 IST)

ఏపీలో 3 కాన్సెప్ట్‌ సిటీలు

రాష్ట్రంలో ఐటీ, సంబంధిత పరిశ్రమల కోసం కాన్సెప్ట్‌ సిటీలను తీసుకురావాలని సీఎం ఆదేశించారు. ప్రాథమికంగా 10 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ కాన్సెప్ట్‌ సిటీల ఏర్పాటుకు ఆలోచనలు చేయాలన్నారు. విశాఖపట్నం, తిరుపతి, బెంగుళూరుకు సమీపంలో ఉన్న  అనంతపురం ప్రాంతాల్లో ఈ కాన్సెప్ట్‌ల సిటీల ఏర్పాటుకు ప్రణాళిక తయారు చేయాలన్నారు.

అమెరికాలోని ఇండియానాలో ఉన్న  కొలంబియా సిటీని సీఎం ఈసందర్భంగా ప్రస్తావించారు. విశిష్ట శైలి నిర్మాణాలన్నీ ఆ సిటీలో కనిపిస్తాయని, ఆ తరహాలోనే ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీకి, హై ఎండ్‌ టెక్నాలజీకి చిరునామాగా ఈ సిటీలు తయారుకావాలని సీఎం ఆకాంక్షించారు. కంపెనీ సామర్థ్యం బట్టి, సైజును బట్టి అక్కడ భూములు కేటాయిద్దామన్నారు.

పరిశ్రమలు పెట్టదలుచుకున్నవారికి వేగంగా అనుమతులు ఇవ్వడంతోపాటు, అవినీతి లేకుండా పారదర్శక విధానంలో వారికి వసతులు సమకూరుస్తామన్నారు. ప్రోత్సాహక ధరల్లో భూములు, నీళ్లు, కరెంటు ఇద్దామని సీఎం చెప్పారు. స్కిల్‌ డెవలప్‌ సెంటర్ల ద్వారా మంచి మానవ వనరులను అందిద్దామన్నారు.

గత ప్రభుత్వంలో పాలసీలు పేరు చెప్పి ప్రచారం చేసుకున్నాక కాని, పరిశ్రమలకు ఇవ్వాల్సిన రూ.4వేల కోట్ల ఇన్సెంటివ్‌లను పూర్తిగా చంద్రబాబు ఎగ్గొట్టారని సీఎం ఆక్షేపించారు. ఇప్పుడు అదే చంద్రబాబు పరిశ్రమల గురించి, పారిశ్రామికాభివృద్ధి గురించి, ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ గురించి మాట్లాడ్డం విడ్డూరంగా ఉందన్నారు. 
 
తిరుపతిలో క్యాంపస్‌ పెట్టడానికి టీసీఎస్‌ సానుకూలంగా ఉందని సీఎం అధికారులతో వ్యాఖ్యానించారు. అందుకు సంబంధించి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే ప్రస్తుతం తిరుపతిలో ఉన్న  ఇంటర్నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ డిజిటల్‌ టెక్నాలజీస్‌ పక్కనే హై ఎండ్‌ స్కిల్స్‌కు కేంద్రం ఏర్పాటుచేయాలని సీఎం ఆదేశించారు.

ప్రపంచ సాంకేతిక రంగంలో వస్తున్న నూతన విధానాలు, పద్ధతులు, టెక్నాలజీ అంశాలపై బోధన, శిక్షణకు సంస్థను ఏర్పాటుచేయడంపై ప్రణాళిక తయారుచేయాలని సీఎం ఆదేశించారు. స్టార్టప్‌ల కోసం కూడా ఇదే ప్రాంగణంలో మరొక నిర్మాణం చేయాలన్నారు. 
 
ఐటీ శాఖలో స్పష్టమైన పనుల విభజన:
çసమావేశంలో భాగంగా సీఎం ఐటీశాలో ఉన్న అనేక విభాగాలు నిర్వర్తిస్తున్న  విధులపై సమీక్ష చేశారు. ఒకే పనిని రెండు మూడు విభాగాలు చేయడంతో ఓవర్‌ ల్యాపింగ్‌ ఉన్నట్టుగా అధికారులు సీఎంకు వివరించారు.

అంతేకాక పెద్ద ఎత్తున నిధులు ఖర్చుచేసి అనేక అప్లికేషన్లను ఏపీ ఐటీ శాఖ అందుబాటులోకి తీసుకు వచ్చిందని కాకపోతే ప్రభుత్వ విభాగాలతో సరైన సమన్వయం లేకపోవడంవల్ల .. కొత్త అప్లికేషన్లు కోసం ఆయా శాఖలు ప్రత్యేకంగా ఖర్చు చేస్తున్నాయని వివరించారు.

దీనివల్ల ప్రభుత్వ పరంగా ఉన్న వసతులను, మానవనరులను సక్రమంగా వినియోగించుకోలేకపోతున్నామని, ఇతర శాఖలు తయారుచేయించుకుంటున్న అప్లికేషన్లలో సెక్యూరిటీ పరమైన లోపాలు కూడా ఉంటున్నాయని సీఎం దృష్టికి తీసువచ్చారు. దీనిపై సీఎం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.

ఏ ప్రభుత్వ శాఖకు ఎలాంటి అప్లికేషన్‌ కావాల్సి వచ్చినా ముందు ప్రభుత్వం ఐటీ విభాగం అనుమతి ఇచ్చిన తర్వాతనే ఆర్థికశాఖ అనుమతి ఇవ్వాలని స్పష్టంచేశారు. దీనిపై సర్క్యులర్‌ జారీచేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. అంతేకాక ప్రస్తుతం ఐటీ విభాగంలో ఉన్న సదుపాయాలను, వసతులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని స్పష్టంచేశారు.

పనుల్లో ఎక్కడా డూప్లికేషన్‌ లేకుండా ఐటీశాఖలోని ఒక్కో విభాగానికి ఒక్కో పనిని అప్పగించాలని సూచించారు. ఆర్టీజీఎస్‌కు అనలిటిక్స్‌ బాధ్యతను అప్పగించడం ద్వారా పూర్తిస్థాయి  సేవలను పొందవచ్చని అధికారులు సూచించగా దీనికి సీఎం అంగీకరించారు.
 
వాలంటీర్ల వ్యవస్థకు బలమైన సమాచార సాంకేతిక పరిజ్ఞానం
పరిపాలనలో విప్లవాత్మక మార్పుగా తీసుకు వచ్చిన గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థకు బలమైన సమాచార సాంకేతిక వ్యవస్థను సమకూర్చాలని ముఖ్యమంత్రి వైయస్‌. జగన్‌ ఐటీశాఖ అధికారులను ఆదేశించారు. 


గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ పరిపాలనలో అత్యంత కీలకమైనదని, ఈ వ్యవస్థను సాంకేతిక పరిజ్ఞానంతో బలోపేతం చేయడంద్వారా అవినీతి తగ్గుతుందని సీఎం అన్నారు. గ్రామ సచివాలయానికి వచ్చే వినతులు పరిష్కారంలో భాగంగా సంబంధిత అర్జీ వివిధ దశల్లో ఏస్థాయిలో ఉందో నేరుగా కంప్యూటర్లో చూసే అవకాశం ఉండాలని సీఎం స్పష్టంచేశారు.

రేషన్‌కార్డు, ఆరోగ్యశ్రీకార్డు, పెన్షన్‌ కార్డు, ఫీజు రియింబర్స్‌మెంట్‌కార్డు గ్రామ సచివాలయాల్లోనే ముద్రించి ఇవ్వాలని, అలాగే గ్రామ సచివాలయాలతో నేరుగా కలెక్టర్‌కు, రాష్ట్ర సచివాలయానికి అనుసంధానం ఉండాలని, ఈమేరకు సమాచార సాంకేతిక వ్యవస్థలు ఉండాలని సీఎం పునరుద్ఘాటించారు. 
 
బుధవారం క్యాంపు కార్యాలయంలో ఐటీ, ఎలక్ట్రానిక్‌ కమ్యూనికేషన్ల శాఖపై సీఎం వైయస్‌.జగన్‌ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఐటీశాఖ మంత్రి గౌతంరెడ్డితోపాటు, చీఫ్‌ సెక్రటరీ నీలం సహానీ సహా సంబంధిత శాఖల అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 
 
గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ అత్యంత కీలకమైనది, ఇవి సమర్థవంతంగా పనిచేయాలంటే తగిన సమాచార, సాంకేతిక వ్యవస్థ ఉండాలని ముఖ్యమంత్రి స్పష్టంచేశారు. దీనివల్లనే అవినీతిని పూర్తిగా నిర్మూలించగలుగుతామన్నారు.

రేషన్‌కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు, పెన్షన్‌ కార్డు, ఫీజు రియింబర్స్‌ మెంట్‌కార్డుల లబ్ధిదారులను గుర్తించి వారికి అక్కడే కార్డులను ప్రింట్‌ చేసి ఇవ్వాలంటే అందుకు తగ్గ సమర్థవంతమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులో ఉంచాలన్నారు.

వివిధ పథకాల లబ్ధిదారుల జాబితాను గ్రామ, సచివాలయాల్లో సోషల్‌ ఆడిట్‌ కోసం ఉంచుతామని, అర్హులైన వారు ఇంకా ఎవరైనా మిగిలిపోతే వారుకూడా ఎవరికి దరఖాస్తు చేయాలన్న అంశాన్ని అక్కడే పొందుపరుస్తామని, వారి అర్జీలను కూడా పరిగణలోకి తీసుకుని తగిన చర్యలు తీసుకోవాల్సి ఉందని, ఇవన్నీ వ్యవస్థీకృతంగా, సక్రమంగా, సమర్థవంతగా, పారదర్శకంగా జరగాలంటే పటిష్టమైన ఐటీ వ్యవస్థను వారికి అందించాల్సి ఉంటుందని సీఎం అన్నారు.

ఇప్పటికే గ్రామ సచివాలయాల్లో ప్రింటర్లు, కంప్యూటర్లు, స్కానర్లు , వాలంటీర్లకు సెల్‌ఫోన్లు తదితర పరికరాలకు సంబంధించి కొనుగోలు ప్రక్రియ నడుస్తుందన్నారు. ఇవి వచ్చాక... వాటిని సక్రమంగా వినియోగించుకునేలా అప్లికేషన్లపై దృషిపెట్టాలన్నారు. 
 
ఒక వ్యక్తి ఏదైనా అర్జీతో వస్తే, ఆ అర్జీని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఆ దరఖాస్తును అప్‌లోడ్‌ చేశాక..., ఆ అర్జీ సంబంధిత శాఖలకు వెళ్తున్న తీరు, వివిధ దశలు దాటి ముందుకు వెళ్తుందా? లేదా? వారు దానికి ఆమోదం తెలిపారా? లేదా? అభ్యంతరాలు ఉంటే.. ఎలాంటి అభ్యంతరాలు ఉన్నాయి అన్న విషయాలు... అన్నీకూడా కంప్యూటర్లలో చూడగలిగేలా ఉండాలన్నారు.

ఆ అర్జీతో ఆమోదం పొందిన తర్వాత గ్రీన్‌ కలర్‌ ఫ్లాగ్‌తో కంప్యూటర్లో కనిపించాలన్నారు. దీంతోపాటు గ్రామ, వార్డు సచివాలయాలకు నేరుగా కలెక్టర్, రాష్ట్ర సచివాలయంతో కూడా అనుసంధానం ఉండాలని సీఎం స్పష్టంచేశారు.

మొత్తం ఈ విధానాల లక్ష్యం అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాలు అందాలని, పారదర్శకతతోపాటు, సంతృప్తి స్థాయిలో ఉండాలన్నారు. అవినీతి, పక్షపాతం లేకుండా లబ్ధిదారులందరికీ పథకాలు చేరాలన్నారు. దీన్ని చేరుకోవాలంటే గ్రామ, వార్డు సచివాలయాల్లో సమర్థవంతమైన, బలమైన ఐటీ వ్యవస్థ ఉండాలని సీఎం అధికారులను ఆదేశించారు.