గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 19 నవంబరు 2019 (13:02 IST)

సగం భూమి రాసిస్తే ఆన్‌లైన్‌లో ఎక్కిస్తా.. రైతుకు వీఆర్వో బెదిరింపు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెవెన్యూ అధికారుల తీరు ఏమాత్రం బాగోలేదు. ‘పట్టాదారు పాసుపుస్తకం, 1బీకి సంబంధించి పేరు ఆన్‌లైన్‌లో ఎక్కించాలని పలు దఫాలుగా అర్జీలు ఇచ్చినా ఫలితం లేకుండా పోతోంది. ఓ వీఆర్వోను సంప్రదించగా భూమిలో సగం నేను చెప్పిన వాళ్లకు రాసిస్తే.. ఆన్‌లైన్‌లో తక్షణమే ఎక్కించి పట్టాదారు పాసుపుస్తకం ఇస్తామని బెదిరింపులకు గురిచేస్తున్నారు. ఈ విషయాన్ని ఓ బాధిత రైతు అనంతపురం జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణకు ఫిర్యాదు చేశారు. 
 
సోమవారం అనంతపురం కలెక్టరేట్‌లో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో సమస్యను విన్నవించారు. ఈ సందర్భంగా బాధితుడు, కదిరికి చెందిన ఆలం నవాజ్‌ మాట్లాడుతూ తనకు పిత్రార్జితంగా సర్వే నంబరు 175-4లో 1.02 ఎకరాల భూమి వచ్చింది. ఆ భూమికి పట్టాదారు పాసుపుస్తకం కోసం అనేక దఫాలుగా కదిరి రెవెన్యూ అధికారులకు అర్జీలు ఇచ్చినట్లు తెలిపారు. అయితే వీఆర్వో నరసింహారెడ్డి అడ్డుపడుతున్నారని, సగం భూమి తాను చెప్పిన వాళ్లకు రాసిస్తేనే పనిచేస్తాం. లేకపోతే చేయం. నీఇష్టమొచ్చిన వారికి చెప్పుకో అంటూ బెదిరిస్తూ.. మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని బాధితుడు కలెక్టర్‌కు మొరపెట్టుకున్నారు. 
 
దీంతో వెంటనే కలెక్టర్‌ స్పందించారు. కదిరి ఉప తహసీల్దారుతో బాధితుడితోనే వీసీ ద్వారా మాట్లాడించారు. అనంతరం కలెక్టరు అధికారులపై మండిపడ్డారు. తమాషా చేస్తున్నారా? భూమికి పట్టాదారు పాసుపుస్తకం, ఆన్‌లైన్‌లో ఎక్కించడానికి భూమి ఇవ్వాలా? బాధితుడి సమస్య తక్షణమే పరిష్కరించి, తనకు నివేదించాలని ఆదేశించారు. అక్రమాలకు పాల్పడితే ఉద్యోగం ఊడుతుందని వీఆర్వోను హెచ్చరించారు.