శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 19 నవంబరు 2019 (12:51 IST)

డైలమాలో వల్లభనేని వంశీ..! వణికిస్తున్న ఓటమి భయం?

కృష్ణా జిల్లా గన్నవరం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ వాట్సాప్‌లో చంద్రబాబుకు పంపిన సంగతి తెలిసిందే. కానీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలంటే శాసనసభాపతికి రాజీనామా అందజేయాలి. ఇంతవరకు శాసనసభ సభాపతికి స్వయంగా కలిసి రాజీనామా లేఖను ఇస్తానని వంశీ వెల్లడించలేదు. తాను ప్రజలలో పట్టున్న నాయకుడునని, ఏ పార్టీ అభ్యర్ధిగా అయినా విజయం సాధిస్తానని, స్వతంత్రం అభ్యర్ధిగా అయినా విజయం సాధించగల సత్తా తనకు ఉందని అని ఎమ్మెల్యే వంశీ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆయన మాటలలో ఉన్న తొందర ఆయన చేతలలో కనిపించటం లేదంటున్నారు.
 
ఒక పార్టీ ఎమ్మెల్యే మరో పార్టీలోకి చేరితే వారి శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేస్తానని శాసనసభ సభాపతి తమ్మినేని సీతారాం ఇప్పటకే తెలిపారు. అసలు విషయం ఏమిటంటే.. ఎమెల్యే పదవికి రాజీనామా చేశాక ఆమోదిస్తే మళ్లీ ఉప ఎన్నిక జరుగుతుంది. అప్పుడు పోటీ చేసే అవకాశం జగన్‌ కల్పించినా ఎన్నికలలో విజయం సాధిస్తే ఫర్వాలేదు. ఒక వేళ ఓడిపోతే వల్లభనేని వంశీ రాజకీయ జీవితం అంతటితో ముగుస్తుందని ఆయనకు అనుమానం ఉందేమో అంటున్నారు. గన్నవరం నియోజకవర్గంలో గత నలభై ఏళ్లలో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్‌ అభ్యర్థి 1989లో మాత్రమే విజయం సాధించగా, మరోసారి స్వతంత్ర అభ్యర్ధి (తెలుగుదేశం రెబల్‌) విజయం సాధించారు. ఈ రెండు దఫాలు మినహా మిగతా అన్ని సార్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులే విజయం సాధిస్తూ వస్తున్నారు. 
 
ఈ నియోజకవర్గంలో 2019 ఎన్నికలలో స్వల్ప మెజార్టీతో వంశీ వైఎస్సార్‌సీపీ పార్టీ అభ్యర్థిపై విజయం సాధించారు. తాను మళ్లీ జగన్‌ పార్టీ అభ్యర్థిగా ఎన్నికలలో బరిలోకి దిగితే వైఎస్సార్‌సిపి తరపున పోటీ చేసి ఓటమి చెందిన యార్లగడ్డ వెంకటరావు, ముద్దరబోయిన వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే దాసరి బాలవర్దనరావులు కలిసి పని చేస్తే ఓటమి ఖాయమని వంశీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కారణాలతోనే ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు ముందుకు రావటం లేదా..? తెలుగుదేశం పార్టీ నుంచి తనను బహిష్కరించారు. స్వతంత్ర ఎమ్మెల్యేగా కొనసాగాలని వంశీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.