శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 19 నవంబరు 2019 (12:45 IST)

సీఎం జగన్‌కు నవంబర్‌ 22 డెడ్‌లైన్..!! వైకాపా నేతల వెన్నులో వణుకు?

నవంబర్‌ 22కు రెడీగా ఉండండి, అదే ఆఖరి రోజు… అనే మాట ఎక్కువ వినపడుతోంది. ముఖ్యంగా ఏపీ రాజకీయాల్లో. ఏంటా అని ఆరా తీస్తే… జగన్ సీఎం కల మున్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోనుంది అనే మాట ఎక్కువగా వినపడుతోంది. 
 
ఇప్పటికే, గత రెండు వారాలుగా కోర్టుకు హజరుకాకుండా సీఎం జగన్… ఆబ్సెంట్‌ పిటిషన్ వేస్తూ వస్తున్నారు. అంతకుముందు వారమే సీఎం జగన్ నేను ప్రతి వారం కోర్టుకు హజరుకాలేనని, మినహయింపు కోరటం అందుకు సీబీఐ అంగీకరించకపోవటంతో… కోర్టు కూడా ఒప్పుకోలేదు. దాంతో జగన్ ప్రతివారం కోర్టుకు రావాల్సి ఉన్నా… రెండు వారాలుగా డుమ్మా కొడుతూనే ఉన్నారు. కానీ వరుసగా మూడో వారం కూడా డుమ్మా కొడితే జగన్ బెయిల్ రద్దయ్యే అవకాశమే ఎక్కువగా కనపడుతోంది. 
 
మరోవైపు బీజేపీ కూడా జగన్‌పై గుర్రుగా ఉంది. ముఖ్యంగా సీఎం కేసీఆర్‌తో జగన్‌ దోస్తానా బీజేపీకి అస్సలు నచ్చలేదన్నది బహిరంగ రహస్యం. పైగా కేంద్రం ఎవరు, తమ పెత్తనమేంటీ… మనం ఇద్దరం ఒకటిగా ఉంటే…అంటూ చేసిన వ్యాఖ్యలు మరింత నిప్పురాజేసాయి. కాళేశ్వరం ప్రాజెక్టుకు వెళ్లి… రాచమర్యాదలు పొందిన ఏపి సీఎం జగన్, ఆ తర్వాత కాళేశ్వరానికి జాతీయ హోదా ఎలా ఇస్తారు అని ప్రశ్నించేంతగా మారిపోయారు. ఈ మార్పు వెనుక బీజేపీ ఆగ్రహం ఉందన్నది ఏపీ, తెలంగాణ పాలిటిక్స్ రెగ్యూలర్‌గా ఫాలో అవుతున్న వారికి తెలిసిందే. 
 
పైగా… జగన్ అధికార ప్రతినిధిగా ఉన్న ఎంపీ విజయసాయి బీజేపీ మెప్పు కోసం… అఖిలపక్ష సమావేశంలో మధ్యలో దూరితే హోంమంత్రి అమిత్‌షా సీరీయస్‌ అయ్యారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వైసీపీ ఎంతలా పాకులాడుతుందో… బీజేపీ ఎంతలా దూరం పెడుతుందో. 
 
బీజేపీతో ఎలాగూ వ్యవహారం పూర్తిగా చెడిపోయిన నేపథ్యంలో జగన్ డుమ్మాలతో బెయిల్ రద్దు కాబోతుందని, నవంబరు 22వ తేదీన జగన్ సీఎం కుర్చీకి చివరి రోజంటూ వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. పైగా జగన్ సతీమణి భారతికి సీఎం శిక్షణ ఇస్తున్నారని ఓ పక్క… సీఎం రేసులో సీనియర్స్‌ అని మరో పక్క వార్తలు ఏపీలో వైరల్‌గా మారాయి. ప్రస్తుతానికి 22 నవంబరును తమ సోషల్‌ మీడియా పేజీల మీద బ్యానర్లుగా పెట్టుకొని ఈ వార్తను టీడీపీ కార్యకర్తలు మరింత వైరల్‌ చేస్తున్నారు.