శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 8 నవంబరు 2019 (06:02 IST)

సీబీఐ కోర్టులో జగన్ మరో పిటిషన్‌?

వ్యక్తిగత హాజరు మినహయింపు కోరుతూ జగన్ వేసిన పిటీషన్ ను సీబీఐ కోర్టు తిరస్కరించడంతో శుక్రవారం జగన్ కోర్టుకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అయితే, గత ఆరునెలలుగా చేస్తున్న విధంగానే తమ న్యాయవాది చేత సీబీఐ కోర్టులో సిఆర్ పిసి సెక్షన్ 317 ప్రకారం అబ్సెంట్ పిటీషన్ వేయించాలని జగన్ టీం నిర్ణయించినట్లు సమాచారం. వైఎస్ జగన్ ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన సీబీఐ కోర్టుకు ప్రతివారం హాజరుకావడం వివిధ కారణాల దృష్ట్యా కష్టమని ఆయన తరఫు న్యాయవాదులు కోర్టులో వాదించారు.

జగన్ ముఖ్యమంత్రి హోదాలో కోర్టుకు రావడం వల్ల ఏపీ ప్రభుత్వానికి ఆర్ధిక భారమని, ఆయన గతంలో క్రమం తప్పకుండా విచారణకు హజరయ్యారని, ఆరేళ్లలో ఎలాంటి ప్రత్యేక మినహయింపులు పొందలేదని కోర్టుకు తెలిపారు. 

అయితే, ఈ కేసులో పరిస్ధితులు మాత్రమే మారాయని,నేర స్వభావంలో ఎలాంటి మార్పు లేదని, వైఎస్ జగన్ సీఎం అయినంత మాత్రాన ప్రత్యేక మినహయింపు ఇస్తే సాక్షులు ప్రభావితం అవుతున్నారన్న విషయాన్ని సీబీఐ న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకుని వచ్చారు.

గతంలో జగన్ ఎంపిగా ఉన్నపుడే సాక్షులను ప్రభావితం చేయడానికి, బెదిరించడానికి ప్రయత్నించడంతోనే ఆయనను అరెస్టు చేశారని, ఆయన ప్రస్తుతం బెయిల్ పై ఉన్నారన్న విషయాన్ని కోర్టుకు సిబిఐ న్యాయవాదులు తెలిపారు.

అత్యంత తీవ్రమైన ఆర్ధిక నేరానికి సంబంధించిన ఆరోపణలు జగన్ పై ఉన్నాయన్న విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకుని వచ్చారు. ఈ క్రమంలో ఆయన వ్యక్తిగత హాజరు మినహయింపు కోరుతూ వేసిన పిటిషన్ ను సీబీఐ కోర్టు తిరస్కరించింది.

గతంలోనూ ఇలాంటి మినహయింపు పిటిషన్లు జగన్ తరఫు న్యాయవాదులు హైకోర్టులో వేసినపుడు వాటిని తిరస్కరించారు. మరీ అలాంటపుడు అవే కారణాలతో మళ్లీ పిటీషన్ వేస్తారా? మినహయింపు కు కొత్త కారణాలను హైకోర్టు ముందుకు తీసుకుని వస్తారా అనే విషయం ఆసక్తికరంగా మారింది.