ఆదివారం, 24 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : ఆదివారం, 3 నవంబరు 2019 (21:11 IST)

జగన్ అద్భుతమైన పాలన ఇస్తే నేను సినిమాలు చేసుకుంటా: పవన్ కల్యాణ్

జగన్ అద్భుతమైన పాలన ఇస్తే నేను సినిమాలు చేసుకుంటానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. దత్తపుత్రుడు, బీ టీమ్‌ అని వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని, ఇప్పటి వరకు సహనం పాటించానని పవన్ కల్యాణ్ అన్నారు.

భవన నిర్మాణ కార్మికుల ఇబ్బందులను ప్రభుత్వానికి చాటి చెప్పే లక్ష్యంతో జనసేన తలపెట్టిన ‘లాంగ్ మార్చ్‌’లో ఆ పార్టీ అధినేత పవన్ ప్రసంగించారు. ఇసుక కొరతపై లాంగ్ మార్చ్ నిర్వహించిన ఆయన ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇంతమంది రోడ్ల మీదకు వచ్చారంటే ప్రభుత్వం సరిగా పని చేయడం లేదని అర్థమవుతుందన్నారు. రోడ్లపైకి రావడానికి భవన నిర్మాణ కార్మికులకు సరదానా? అని ప్రశ్నించారు. తనన్ను విమర్శించే నాయకుల్లా తనకు వేల కోట్లు లేవని, తనకు వేల ఎకరాలు లేవని చెప్పారు.

ఒక పార్టీని నడపడం అంటే ఆశామాషీ అనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. పార్టీని నడపడానికి తనకు వేల కోట్లు అక్కర్లేదన్నారు. ఒక భావజాలాన్ని పట్టుకుని చచ్చిపోయే వరకు నిలబడాలని పవన్ పేర్కొన్నారు. జగన్ అద్భుత పాలన అందిస్తే తాను వెళ్లి సినిమాలు తీసుకుంటానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.

అసలు వైఎస్ జగన్మోహన్ రెడ్డే కాదు. సగటు రాజకీయ నాయకులు నిజంగా ప్రజల పట్ల బాధ్యతగా ఉండుంటే తనకు జనసేన పార్టీ పెట్టాల్సిన అవసరం ఉండేదే కాదని పవన్ వ్యాఖ్యానించారు. తనకు రాజకీయాలు సరదా కాదని, ఏదో నాలుగు పుస్తకాలు చదువుకుని ఇంట్లో కూర్చునేవాడినని.. సినిమాల్లోకి కూడా పొరపాటున వచ్చానని ఆయన చెప్పుకొచ్చారు.

సగటు రాజకీయ నాయకుల పాలసీలు, విధివిధానాలు ప్రజలను ఇబ్బంది పెడుతున్నప్పుడు సామాన్యుల నుంచే నాయకులు పుడతారని.. అలాగే తాను రాజకీయాల్లోకి వచ్చానని పవన్ చెప్పారు.

భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై విశాఖలో జనసేన నిర్వహించిన సభలో పవన్ మాట్లాడారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ... తన డీఎన్‌ఏ గురించి మాట్లాడే హక్కు ఏ వైసీపీ నాయకుడికి ఉందని ఆయన ప్రశ్నించారు. తన డీఎన్‌ఏ గురించి మాట్లాడటానికి తమాషాగా ఉందా అని పవన్ మండిపడ్డారు.

మరి మీ అమ్మాయి పెళ్లికి ఎందుకు పిలిచారని, ఏ డీఎన్‌ఏ ఉందని పిలిచారని పవన్ వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబును ఉద్దేశించి నిలదీశారు. అప్పటికి టీడీపీతో తనకు ఎలాంటి విభేదాలు లేవని, అలాంటప్పుడు ఎందుకు పిలిచారని ప్రశ్నించారు.

మీరు భయపడ్డారని, అందుకే ‘మా అమ్మాయి పెళ్లికి రా’ అని పిలిచారని.. ఈరోజు 151 సీట్లు రాగానే కళ్లు నెత్తికెక్కి మాట్లాడుతున్నారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీ ఊరికి రానా.. మీ ఇంటి ముందుకొచ్చి మాట్లాడనా’ అని గద్దించారు. ‘ఓడిపోతే భయపడతామనుకుంటున్నారా’ అని పవన్ మండిపడ్డారు.
 
వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రంగా మండిపడ్డారు. దేశానికి సేవ చేసిన మహానుభావులనే రాజ్య సభకు పంపుతుంటారని కానీ, సూట్ కేస్ కంపెనీలు పెట్టే విజయసాయి రెడ్డి రాజ్యసభకు వెళ్లి కూర్చున్నారని ఎద్దేవా చేశారు.

విశాఖలో జరిగిన ‘జనసేన లాంగ్‌మార్చ్’ లో మాట్లాడుతూ... సూట్‌కేస్ కంపెనీలు పెట్టే విజయసాయి రెడ్డికి కూడా సమాధానం చెప్పుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. అంబేద్కర్, కాన్షీరామ్ లాంటి మహామహులే ఓడిపోయారని, వారి స్ఫూర్తితోనే ముందుకు సాగుతున్నానని, ఓడిపోవచ్చేమో కానీ, తన చిత్తశుద్ధిలో నిబద్ధత ఉందని స్పష్టం చేశారు.

రెండున్నరేళ్లు జైళ్లో ఉన్న నాయకులు కూడా తనను విమర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు. స్వతంత్ర్య పోరాట నాయకుడిలా, లేదా పౌరహక్కులను కాపాడే నాయకుడిలా జైలుకెళ్లారా? సూట్‌కేసు కంపెనీలు పెట్టి జైలుకెళ్లారని ఆయన ధ్వజమెత్తారు.

వారిలాగా ఎలాపడితే అలా మాట్లాడనని, వారు పరిధి దాటితే మాత్రం వారి తాట తీస్తామని హెచ్చరిస్తారు. విజయసాయి రెడ్డి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని, భయపడే ప్రసక్తే లేదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
 
 
మీకు చేత కాదా..?: నాగబాబు
ఇసుక విషయంలో వైసీపీ ప్రభుత్వం చాలా పెద్ద తప్పు చేసిందని వైసీపీ నేత నాగబాబు అన్నారు. జనసేన లాంగ్ మార్చ్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ 30 లక్షల మందికిపైగా భవన నిర్మాణ కార్మికుల జీవితాలతో ఆడుకుంటున్నారన్నారు.

వైసీపీకి చేతగాకుంటే 10 రోజుల్లో ఇసుక సమస్యను పరిష్కరిస్తామని నాగబాబు పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వానికి కొన్ని రోజుల సమయం ఇద్దామనుకున్నామని కానీ ఆందోళన చేసే అవకాశం వైసీపీ ప్రభుత్వమే కల్పించిందని నాగబాబు తెలిపారు.
 
పవన్ సభలో తొక్కిసలాట..
పవన్ పిలుపునిచ్చిన ‘లాంగ్ మార్చ్’ సందర్భంగా విశాఖలో జరుగుతున్న జనసేన సభలో అపశృతి చోటుచేసుకుంది. బారికేడ్లకు విద్యుత్ షాక్ రావడంతో వాటిని ఆనుకుని ఉన్న ఇద్దరు జనసేన కార్యకర్తలకు షాక్ తగిలింది. వెంటనే స్పందించిన నిర్వాహకులు విద్యుత్‌ను నిలిపివేశారు.

టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు మాట్లాడుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. గాయపడిన వారిని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో సభలో ఒక్కసారిగా కలకలం రేగింది. స్వల్ప తొక్కిసలాట జరిగింది.